ట్రాలీ ఆటోను ఢీకొన్న లారీ

ABN , First Publish Date - 2020-11-27T05:47:57+05:30 IST

భార్య, ఇద్దరు పిల్లలను ట్రాలీలో ఎక్కించుకుని అప్పటి వరకు ఆటోను నడిపిన తండ్రిని రోడ్డు ప్రమాదం కబలించింది.

ట్రాలీ ఆటోను ఢీకొన్న లారీ

ఆటో డ్రైవర్‌ మృతి

నుజ్జునుజ్జుయిన శరీరం

ముగ్గురికి గాయాలు


మెదక్‌ రూరల్‌, నవంబరు 26 : భార్య, ఇద్దరు పిల్లలను ట్రాలీలో ఎక్కించుకుని అప్పటి వరకు ఆటోను నడిపిన తండ్రిని రోడ్డు ప్రమాదం కబలించింది. లారీ చక్రాల కింద పడి శరీరం నుజ్జునుజ్జు కాగా.. నాన్నేక్కడమ్మా అంటూ పిల్లల రోదన అందరినీ కలిచివిసింది. ఆటోను లారీ ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలైన ఘటన మెదక్‌ మండలం పేరూర్‌ గ్రామ శివారులో గురువారం సాయంత్రం జరిగింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. పాపన్నపేట మండలం నాగ్సాన్‌పల్లికి చెందిన గోకని నర్సింహులుగౌడ్‌(35) భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి వెల్దుర్తి మండలం అచ్చంపేటకు వెళ్లి తన ట్రాలీ ఆటోలో తిరిగి వస్తున్నాడు. బొడ్మట్‌పల్లి వైపు నుంచి చెరకు లోడుతో కామారెడ్డి వెళ్తున్న లారీ మెదక్‌ మండలం పేరూర్‌ గ్రామ శివారు వద్ద ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో బోల్తా పడగా నర్సింహులుగౌడ్‌ లారీ టైర్‌ కిందపడ్డాడు. లారీ టైర్లు నర్సింహులుగౌడ్‌పై నుంచి వెళ్లడంతో మృతుడి శరీరం పూర్తిగా నుజ్జునుజ్జయింది. శరీరంలోని అవయవాలన్నీ రోడ్డుపై చెల్లాచెదరుగా పడిపోయాయి. ఆటో బోల్తాపడటంతో ట్రాలీలో వెనుక భాగంలో ఉన్న మృతుడి భార్య నవనీత, కుమార్తె భవానీ, కుమారుడు అఖిలే్‌షగౌడ్‌కు గాయాలయ్యాయి. ఆటోలో బియ్యం బస్తాలు ఉంటడంతో వారికి పెను ప్రమాదం తప్పింది. కానీ కంటి ముందే జరిగిన రోడ్డు ప్రమాదం చూసిన వారు భీతిల్లిపోయారు. ప్రమాదం నుంచి తెరుకున్న పిల్లలు ముందు ఉన్న శవాన్ని తమ తండ్రిగా గుర్తించక నాన్న ఏడమ్మా అంటూ తల్లిని అడగడంతో అక్కడ ఉన్న వారు కన్నీరు పెట్టుకున్నారు. రోడ్డుపై వెళ్తున్న వారంతా జరిగిన ప్రమాదం చూసి చలించిపోయారు. సుమారు అర గంటల పాటు రవాణా స్తంభించిపోయింది.. మెదక్‌ రూరల్‌  ఎస్‌ఐ కృష్ణారెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్‌ పారిపోవడంతో లారీ ఎక్కడి నుంచి వస్తుందని, ఎవరిది అన్న వివరాలు తెలియలేదు.

Updated Date - 2020-11-27T05:47:57+05:30 IST