జిల్లాలో 9 మందికి కరోనా పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-07-05T11:34:09+05:30 IST

సిద్దిపేట జిల్లాలో శనివారం కరోనా పరీక్షలలో తొమ్మిది మందికి పాజిటివ్‌ వచ్చినట్లు జిల్లా వైద్యాధికారులు తెలిపారు

జిల్లాలో 9 మందికి కరోనా పాజిటివ్‌

సిద్దిపేట సిటీ, జూలై 4: సిద్దిపేట జిల్లాలో శనివారం కరోనా పరీక్షలలో తొమ్మిది మందికి పాజిటివ్‌ వచ్చినట్లు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. వీరిలో సిద్దిపేట అర్బన్‌ పరిధిలో ఆరుగురు, గజ్వేల్‌, మద్దూరు, హుస్నాబాద్‌ మండలం రామారంలో ఒక్కొక్కరికి కరోనా సోకినట్లు వెల్లడించారు. ఈ తొమ్మిది మంది ఎవరెవరిని కలిశారో ఆరా తీస్తున్నారు. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వ్యక్తులను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని గాంఽఽధీ ఆస్పత్రికి తరలించినట్లు సూచించారు. 


హుస్నాబాద్‌లో 14 మందికి హోం క్యారంటైన్‌ 

హుస్నాబాద్‌: హుస్నాబాద్‌ పట్టణంలో ఓ మహిళకు కరోనా సోకడం కలకలం సృష్టించింది. పట్టణంలోని హన్మకొండ రోడ్డుకు చెందిన మహిళకు మోకాళ్ల నొప్పులు ఉండడంతో రెండు మార్లు వరంగల్‌ పట్టణంలోని ఆసుపత్రికి వెళ్లి వచ్చింది. ఆమెకు వారం రోజుల నుంచి జ్వరం వస్తుండడంతో వరంగల్‌ ఎంజీఎంకు చికిత్స కోసం వెళ్లగా శుక్రవారం కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యిందని వైద్యాధికారి సౌమ్య తెలిపారు.


శనివారం వైద్యాధికారులు, పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి కుటుంబసభ్యుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆమెకు ప్రైమరీ కాంటాక్ట్‌లో ఐదుగురు, సెకండరీ కాంటాక్ట్‌లో తొమ్మిది మంది ఉన్నారని, వీరందరిని 15 రోజులు హోం క్యారంటైన్‌లో ఉండాలని సూచించినట్లు వైద్యాధికారులు తెలిపారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆకుల రజిత పాజిటివ్‌ వ్యక్తి ఇంటి పరిసరాలతో పాటు ప్రధాన రహదారులపై సోడియం హైడ్రోక్లోరైడ్‌ ద్రావణాన్ని చల్లించారు.     


గౌరారంలో పాజిటివ్‌ వ్యక్తికి హోం ఐసోలేషన్‌

వర్గల్: వర్గల్‌ మండలం గౌరారంలో ఒక వ్యక్తికి శుక్రవారం రాత్రి పాజిటివ్‌ వచ్చింది. శనివారం మండల వైద్యాధికారి హరితతో పాటు వైద్య సిబ్బంది అతడు నివాసముంటున్న ఇంటికి వెళ్లారు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తితో పాటు ప్రైమరీ కాంటాక్ట్‌ అయిన ఎనిమిది మందిని హోం ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి అరోగ్య పరిస్థితి బాగానే ఉన్నదని వైద్యాధికారి హరిత తెలిపారు. 


ఐదుగురికి నెగటివ్‌

కొండపాక: కొండపాక మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఇటీవల కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అతడికి సంబంధించిన ఐదుగురు ప్రైమరీ కాంట్రాక్టుల శాంపిళ్లను సేకరించి టెస్టులకు పంపగా వారందరికీ నెగటివ్‌ వచ్చిందని వైద్య అధికారులు తెలిపారు.

Updated Date - 2020-07-05T11:34:09+05:30 IST