700 ప్రమాదాలు.. 267 మరణాలు
ABN , First Publish Date - 2020-12-31T05:27:16+05:30 IST
2020 సంవత్సరంలో నేరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయాయి. వీటికి తోడు రుణ యాప్‌ల వేధింపులు, సైబర్ నేరాలు తోడయ్యాయి.

2020లో పెరిగిన నేరాలు
సిద్దిపేట జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 6,034
వివిధ కారణాలతో 301 మంది ఆత్మహత్య
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, డిసెంబరు 30: ఓ వైపు రోడ్డు ప్రమాదాలు.. మరోవైపు ట్రాఫిక్ ఉల్లంఘనలు.. ఇంకోవైపు హత్యలు, ఆత్మహత్యలు, దొంగతనాలు వెరసి 2020 సంవత్సరంలో నేరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయాయి. వీటికి తోడు రుణ యాప్‌ల వేధింపులు, సైబర్ నేరాలు తోడయ్యాయి. కరోనా లాక్‌డౌన్‌లో కేసుల సంఖ్య మందగించినప్పటికీ ఆ తర్వాత ఒక్కసారిగా పుంజుకున్నాయి. గత ఏడాది 5,178 కేసులు నమోదుకాగా ఈ ఏడాది 6,034 కేసులు నమోదు కావడం గమనార్హం. జిల్లాలో హైదరాబాద్ టు కరీంనగర్ రాజీవ్ రహదారి సుమారు 90కి.మీల దూరం విస్తరించి ఉంటుంది. అదే విధంగా హుస్నాబాద్, దుబ్బాక, మెదక్ వైపు ప్రధాన రహదారులు ఉన్నాయి. మొత్తంగా ఈ ఏడాది 700 ప్రమాదాలు జరుగగా ఇందులో 267 మంది దుర్మరణం చెందారు. 717 మంది గాయపడ్డారు. ప్రధానంగా డిసెంబరు 4న సిద్దిపేట పట్టణ శివారులో రాజీవ్ రహదారిపై ఓ కారు డివైడర్‌ను ఢీకొట్టగా తల్లి, తండ్రి, కొడుకు మృతిచెందారు. వారి మృతదేహాలను కారులో నుంచి బయటకు తీస్తుండగా డీసీఎం వ్యాన్ జనంపైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు చనిపోయారు. పోలీసులకు గాయాలయ్యాయి. డిసెంబరు 12న బెజ్జంకి మండలం గాగిల్లాపూర్ రాజీవ్ రహదారిపై ఆటోను పాల లారీ ఢీకొట్టగా ముగ్గురు మృతి చెందారు.
17 హత్యలు.. 301 ఆత్మహత్యలు
2019లో జిల్లాలో ఒక్క హత్య కూడా జరగలేదు. కానీ ఈ ఏడాది 17 హత్యలు జరగడం చర్చనీయాంశమైంది. సిద్దిపేట మండలం ఇమాంబాద్‌కు చెందిన రౌడీ షీటర్ అంబటి ఎల్లంను అతని శత్రువులు దారుణ హత్య చేశారు. అదే విధంగా చేర్యాల మండలం కడవేరుగు గ్రామంలో మంత్రాల నెపంతో వదిన లక్ష్మిని మరిది చంద్రమౌళి గొడ్డలితో హత్య చేశాడు. వివిధ కారణాలు, అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు, ప్రేమవైఫల్యాలు, కుటుంబ కలహాలతో 301 మంది ఆత్మహత్య చేసుకున్నారు.
రుణ యాప్ వేధింపులతో..
మొబైల్ ఫోన్లలోని ఆన్‌లైన్ మనీ యాప్‌ల వేధింపులు జిల్లాలో మితిమీరాయి. అవసరానికి రుణం ఇచ్చి వాటిని వసూలు చేయడానికి మానసిక వేధింపులకు ఈ మనీ యాప్‌లు పాల్పడ్డాయి. ఫలితంగా నంగునూరు మండలంలో ఏఈవోగా పనిచేస్తున్న మౌనిక ఆత్మహత్య చేసుకున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సైబర్ నేరాలు కూడా పెరిగాయి. జిల్లాలో ఈ ఏడాది 16 సైబర్ కేసులు నమోదు కావడం గమనార్హం.
537 దొంగతనాల్లో 41శాతం రికవరీ
జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 537 దొంగతనాలు జరిగాయి. ఇందులో రూ.2.48 కోట్లపైచిలుకు సొత్తును అపహరించారు. వివిధ కేసుల్లో నిందితులను అరెస్టు చేసి రూ.1 కోటికి పైగా సొత్తును రికవరీ చేశారు. 41శాతం రికవరీ కావాల్సి ఉంది. గతేడాది 533 దొంగతనాల కేసులు నమోదు కాగా 42 శాతం సొత్తును రికవరీ చేశారు.
లక్షా 72వేల ట్రాఫిక్ కేసులు
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు కొరఢా ఝులిపించారు. 1,72,045 కేసులు నమోదు చేసి రూ.5.50 కోట్ల జరిమానా విధించారు. స్పీడ్ లేజర్ గన్ ద్వారా 74,500 వాహనాలపై వేగ నియంత్రణ కేసులు నమోదు చేశారు. వీరికి రూ.7.69 కోట్ల జరిమానా విధించారు. 1,499 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేసి 155 మందిని జైలుకు పంపించారు. వీరికి రూ.21.65లక్షల జరిమానా వేశారు.
సామాజిక సేవలో పోలీసులు
సిద్దిపేట జిల్లాలో పనిచేస్తున్న 42 మంది పోలీసులు కరోనా సమయంలో ప్లాస్మాదానం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి 68 మంది పోలీసులు రక్తదానం చేశారు. పోలీస్ కళాబృందాల ద్వారా కనువిప్పు కార్యక్రమం నిర్వహించి 97 గ్రామాల్లో ప్రజలను చైతన్యవంతులుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు. సామాజిక సేవ దిశగా పోలీస్ సిబ్బందిని సీపీ జోయల్ డేవీస్ ప్రొత్సహించారు.