చిన్న కంపెనీలపై లాక్‌డౌన్ ఎఫెక్ట్
ABN , First Publish Date - 2020-12-19T05:56:46+05:30 IST
పారిశ్రామిక రంగంలో పేరొందిన సంగారెడ్డి జిల్లాలో వేల సంఖ్యలో చిన్న తరహా పరిశ్రమలున్నాయి.

మూసివేతకు సిద్ధంగా 500 సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు
ఆర్డర్లు వస్తున్నా వేధిస్తున్న కార్మికుల కొరత
పారిశ్రామిక రంగానికి రూ. వెయ్యి కోట్ల్లు నష్టం
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, డిసెంబరు 18: పారిశ్రామిక రంగంలో పేరొందిన సంగారెడ్డి జిల్లాలో వేల సంఖ్యలో చిన్న తరహా పరిశ్రమలున్నాయి. పటాన్‌చెరు పారిశ్రామికవాడలో 750, రామచంద్రాపురం ప్రాంతంలో 250, బొల్లారం పారిశ్రామికవాడలో 300 వరకు చిన్న పరిశ్రమలున్నాయి. సదాశివపేట, జహీరాబాద్, పాశమైలారం, ఐడీఏ బొల్లారం, అశోక్‌నగర్ తదితర ప్రాంతాల్లోనూ పెద్ద సంఖ్యలో చిన్న, సూక్ష్మ పరిశ్రమలున్నాయి. పారిశ్రామిక రంగంలో 60 శాతం ఉద్యోగాలను ఈ కంపెనీలే కల్పిస్తున్నాయి. కరోనా విపత్తుతో చిన్న పరిశ్రమలకు రూ. వెయ్యి కోట్ల వరకు నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. జిల్లాలోని ప్రధాన పారిశ్రామికవాడల్లో పెద్ద పరిశ్రమలకు అనుబంధంగా నడుస్తున్న చిన్న పరిశ్రమలు ఆర్డర్లు లేక తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నాయి. లాక్‌డౌన్ సడలించిన అనంతరం చేతిలో ఉన్న ఆర్డర్లతో నెట్టుకొద్దామనుకుంటే కార్మికులు లేకపోవడం పెద్ద అవరోధంగా మారింది. జిల్లాలోని 2వేల చిన్న తరహా పరిశ్రమలు 30 శాతం కార్మికులతో ఉత్పత్తి కొనసాగిస్తున్నారు. ఇంజనీరింగ్, ప్లాస్టిక్, అల్లాయిస్ పరిశ్రమల్లో బిహార్, ఛత్తీ్‌సఘడ్, ఉత్తర్‌ప్రదేశ్, బెంగాల్ రాష్ట్రాలకు చెందిన స్కిల్డ్, అన్‌స్కిల్డ్ కార్మికులు పనిచేస్తుంటారు. కరోనా నేపథ్యంలో వారంతా సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయారు. స్థానిక యువత చిన్న పరిశ్రమల్లో పని చేసేందుకు ముందుకురావడం లేదు. దీంతో పటాన్‌చెరు, రామచంద్రాపురం, బొల్లారం, పాషమైలారం పారిశ్రామికవాడల్లో ఎక్కడ చూసినా పరిశ్రమల ఎదుట ‘కార్మికులు కావలెను’ బోర్డులు కనిపిస్తున్నాయి.
పరిశ్రమల్లో ఉద్యోగాలపై ఆసక్తి చూపని యువత
చిన్న పరిశ్రమల్లో కార్మికుల కొరతను గమనించి ఆయా పారిశ్రామికవాడల్లోని టీఎస్‌ఐఐసీ సర్వీస్ సొసైటీలు రంగంలోకి దిగాయి. వాట్సప్ నంబర్లు ఇచ్చి ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నా స్పందన కనిపించడం లేదు. జిల్లా పరిశ్రమల శాఖ ఉపాధి కేంద్రాల ద్వారా ఉద్యోగాలకు పిలుపు ఇచ్చినా స్పందన కరువైంది. సాధారణ వేతనమైన రూ.12 వేల కంటే ఎక్కువగా ఇస్తామని చెబుతున్నా యువత ముందుకురావడం లేదు. పారిశ్రామికవాడల్లో ప్రస్తుతం 15 వేల ఉధ్యోగాలు ఖాళీలున్నాయని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.
నష్టాల ఊబిలో చిన్న పరిశ్రమలు
చిన్న పరిశ్రమల యజమానులు నష్టాల ఊబిలో కూరుకుని బ్యాంకు రుణాల వాయిదాలు కూడా చెల్లించలేని దుస్థితికి చేరుకున్నారు. ఆర్డర్లు వస్తున్నా కరోనా నేపథ్యంలో ఇప్పట్లో ఉత్పత్తి సాధారణ స్థితికి చేరుకునే పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వం స్పందించి ప్రోత్సాహక చర్యలు చేపట్టాలని పరిశ్రమల యజమానులు కోరుతున్నా స్పందన కరువైంది. కనీసం లాక్‌డౌన్ కొనసాగిన మూడు నెలల విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలని కోరుతున్నా కనికరించడం లేదు. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులో చిన్న పరిశ్రమల ఫిక్స్‌డ్ కరెంటు బిల్లులను పూర్తిగా మాఫీ చేశారు. ఇక్కడ మాత్రం మూడు నెలలపాటు కంపెనీలు తెరుచుకోకపోయినా ఫిక్స్‌డ్ బిల్లుల పేరుతో లక్షలాది రూపాయలు వసూలు చేయడం ఎంతవరకు న్యాయమని పరిశ్రమ యజమానులు ప్రశ్నిస్తున్నారు.