క్వింటాలుకు రూ.300 ఇస్తేనే కందులు తూకం!

ABN , First Publish Date - 2020-03-16T07:49:35+05:30 IST

రైతుల సౌలభ్యం మేరకు ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రంలో సిబ్బంది అక్రమాలకు అంతులేకుండాపోతుంది.

క్వింటాలుకు రూ.300 ఇస్తేనే కందులు తూకం!

రాపర్తి కొనుగోలు కేంద్రం సిబ్బంది డిమాండ్‌

అక్రమార్కులపై చర్యలు శూన్యం


కల్హేర్‌, మార్చి 15 : రైతుల సౌలభ్యం మేరకు ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రంలో సిబ్బంది అక్రమాలకు అంతులేకుండాపోతుంది. అయినా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్క్‌ ఫెడ్‌ ఆధ్వర్యంలో మండలంలోని రాపర్తి మార్కెటింగ్‌ గోడౌన్‌ వద్ద ఖేడ్‌ పీఏసీఎస్‌ వారు కందులను కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇక్కడ కేంద్రం ప్రారంభం నుంచే పీఏసీఎస్‌ సిబ్బంది అక్రమాలకు పాల్పడతూనే ఉన్నారు. కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన వ్యాపారులు కంగ్టి, మనూరు, నారాయణఖేడ్‌కు చెందిన వ్యాపారులతో చేతులు కలిపిన సిబ్బంది నాసిరకం కందులను కొనుగోలు చేసి వారి వద్ద డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.


తాజాగా రైతులు కందులకు తూకం వేయాలంటే క్వింటాల్‌కు రూ.300 ఇవ్వాలని సిబ్బంది డిమాండ్‌ చేయడంతో రైతులు రాపర్తి సర్పంచ్‌ శ్రావణ్‌కుమార్‌ను ఆశ్రయించారు. ఆయన కొనుగోలు కేంద్రానికి చేరుకుని రైతులను ఎవరూ డబ్బులు అడగొద్దని చెప్పి ఈ విషయాన్ని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. క్వింటాల్‌కు రూ.300 ఇవ్వకుంటే  తమ కందులు నాసిరకంగా ఉన్నాయంటూ తిరస్కరిస్తున్నారని  రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రం సిబ్బంది వ్యాపారుల వద్ద నుంచి డబ్బులు తీసుకోకుండా ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా ట్రాన్స్‌ఫర్‌ చేసినట్లు రైతులు ఆరోపించారు. సిబ్బందిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటే మరోసారి ఇలాంటివి జరగవని రైతులు కోరుతున్నారు. 

Updated Date - 2020-03-16T07:49:35+05:30 IST