రైతుబీమాకు 20 వేల మంది దూరం

ABN , First Publish Date - 2020-09-06T09:59:59+05:30 IST

అర్హులైన రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పిస్తున్నది.

రైతుబీమాకు 20 వేల మంది దూరం

 జిల్లాలో ఇప్పటి వరకు లక్షా 20 వేల మంది రైతులకు ఇన్సూరెన్స్‌

నమోదు చేసుకోని వారికి మరో అవకాశం

దరఖాస్తులు స్వీకరిస్తున్న అధికారులు

రూ. 3,496కు పెరిగిన ప్రీమియం


మెదక్‌, సెప్టెంబరు 5: అర్హులైన రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పిస్తున్నది. కుటుంబ పెద్దను కోల్పోయిన రైతు కుటుంబాలను ఆదుకోవడానికి ఉద్దేశించిన ఈ పథకాన్ని మరో ఏడాది పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే బీమా పొందుతున్న రైతులను కొనసాగిస్తూనే.. కొత్తగా పాసుబుక్కులు పొందిన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నది. ఆగస్టు 15 నుంచి ఈ ప్రక్రియ మొదలైంది. రైతుల తరఫున ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి రూ. 5 లక్షలకు బీమా చేయిస్తుంది. గతంలో ఏడాదికి బీమా ప్రీమియం రూ. 3,013 ఉండగా.. ఈ ఏడాది ప్రస్తుతం రూ. 3,496కు పెంచారు. 


జిల్లాలో మొత్తం 2 లక్షల 20 వేల మంది పట్టాదారు పాస్‌పుస్తకాలు కలిగిన రైతులున్నారు. వీరిలో బీమాకు అర్హులైన (18 ఏళ్లు పైబడి 59 సంవత్సరాల లోపు వయసు కలిగిన) వారు లక్షా 40 వేల మంది ఉన్నారు. ఇప్పటి వరకు లక్షా 20 వేల మంది రైతులు బీమా కోసం వివరాలు అందజేశారు. 


కొత్తవారు దరఖాస్తు చేసుకోవచ్చు

బీమా కోసం దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఈ నెల 5న ముగియనున్నట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో జిల్లా వ్యవసాయాధికారి పరశురామ్‌నాయక్‌ స్పందించారు. గతేడాది బీమా పొందినవారిలో అర్హులను రెన్యూవల్‌ చేస్తున్నామని, వారి వివరాలను వ్యవసాయ విస్తరణ అధికారులు గ్రామాల్లో పర్యటించి సేకరిస్తున్నారని తెలిపారు. దరఖాస్తులపై రైతులు, నామినీల సంతకాలు సేకరిస్తున్నట్లు తెలియజేశారు.


తనపేరిట ఉన్న భూమిని అమ్ముకున్నా, నిర్ధేశించన వయసు దాటినా.. అనర్హులుగా గుర్తించి వారి పేర్లను తొలగిస్తున్నట్లు వివరించారు. కొత్తగా పాసుబుక్కులు పొందిన రైతులు పాస్‌పుస్తకం, ఆధార్‌కార్డు జిరాక్సులతో మండల వ్యవసాయ విస్తరణ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బీమా పొందిన రైతులు మరణిస్తే బీమా కంపెనీ సూచించిన మేరకు వివరాలు సమాచారాన్ని అందించిన 10 రోజుల్లో నామినీ బ్యాంకు ఖాతాలో రూ. 5 లక్షలు జమవుతాయని తెలిపారు. 

Updated Date - 2020-09-06T09:59:59+05:30 IST