20 నెలలు.. 6గురు కమిషనర్లు
ABN , First Publish Date - 2020-07-08T11:40:46+05:30 IST
నర్సాపూర్ మున్సిపాలిటీలో పాలన ఒకడుగు ముందుకు.. నాలుగడుగులు వెనక్కు అన్నట్లు సాగుతున్నది.

అమ్మో.. నర్సాపూర్ మున్సిపల్ కమిషనర్ పోస్టు
ఇన్‌చార్జిలతోనే సరి!
ఇక్కడికి రావాలంటేనే జంకుతున్న ఆఫీసర్లు
రాజకీయ ఒత్తిళ్లు, సిబ్బంది కొరత
పాలన గాడిన పడేదెన్నడో
కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ.. పుట్టెడు సమస్యలు.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పట్టణప్రగతి వంటి కార్యక్రమాలు.. సీఎం కేసీఆర్ ఇటీవల పట్టణానికి విచ్చేసిన సందర్భంగా మంజూరు చేసిన రూ.25 కోట్ల నిధుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిన తరుణం.. ఇలాంటి
సమయంలో అత్యంత కీలకమైన మున్సిపల్ కమిషనర్ పోస్టుపై అనిశ్చితి...
20 నెలల వ్యవధిలోనే ఆరుగురు అధికారులు మారడం పరిస్థితికి నిదర్శనం.
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్/ నర్సాపూర్, జూలై 7: నర్సాపూర్ మున్సిపాలిటీలో పాలన ఒకడుగు ముందుకు.. నాలుగడుగులు వెనక్కు అన్నట్లు సాగుతున్నది. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీకి రెగ్యులర్ కమిషనర్‌ను నియమించక ఇన్‌చార్జిలతోనే కాలం వెల్లదీస్తున్నారు. ఇక్కడికి రావడానికి కమిషనర్ స్థాయి అఽధికారులెవరూ ఆసక్తి చూపడంలేదు. వచ్చినవారు ఆరు నెలలకు మించి ఉండడంలేదు. రాజకీయ ఒత్తిళ్లు, కార్యాలయంలో సిబ్బంది కొరత వంటివి ఇందుకు కారణమని చెప్పవచ్చు.
ఐదుగురు ఇన్‌చార్జిలే!
మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న నర్సాపూర్‌ను 2018 అక్టోబరులో మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేశారు. ఎంపీడీవో శ్రావణ్‌కుమార్‌ను తొలి కమిషనర్‌గా ఇన్‌చార్జి బాధ్యతలతో నియమించారు. ఆయన 8 నెలల పాటు బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం ఆయన పదోన్నతిపై వెళ్లిపోగా కొల్చారం, నర్సాపూర్ ఎంపీడీవో వామనరావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. నాలుగు నెలలు తిరగకుండానే ఆయన తప్పుకున్నారు. అనంతరం వ్యవసాయశాఖ ఏవో వెంకటేశ్వర్లు కొంతకాలం ఇన్‌చార్జిగా ఉన్నారు. పనిభారంతో ఆయన కూడా తప్పుకున్నారు. మున్సిపల్ ఎన్నికలకు ముందు నర్సాపూర్ డీఎల్‌పీవో రమణమూర్తిని ఇన్‌చార్జి కమిషనర్‌గా నియమించారు. ఎన్నికలు పూర్తయిన అనంతరం వరంగల్ జిల్లాలో పనిచేస్తున్న శ్రీనివా్‌సను రెగ్యులర్ కమిషనర్‌గా నియమించారు. రెగ్యులర్ అధికారి రావడంతో పరిస్థితి చక్కబడుతుందని పట్టణవాసులు ఆశించినా.. ఎంతోకాలం నిలువలేదు.
పనిభారం, సిబ్బంది కొరత, రాజకీయ జోక ్యంతో ఆయన మూడు నెలలకే దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయారు. దీంతో శివ్వంపేట ఎంపీడీవోగా ఉన్న నవీన్‌కుమార్‌కు నెల రోజుల క్రితం కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. విధుల్లో చేరినప్పటి నుంచి ఆయన విముఖంగానే ఉన్నారు. సోమవారం ఆయన కూడా దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయారు. దీంతో తాజాగా ఎంపీవోకు కమిషనర్‌గా అదనపు బాధ్యతలను అప్పగించాలని ఉన్నతాధికారులు యోచిస్తున్నట్లు సమాచారం.
ఎందుకంత భయం?
పట్టణానికి కమిషనర్‌గా ఎవరొచ్చినా నాలుగు నెలలకు మించి ఉండడంలేదు. హైదరాబాద్‌కు అత్యంత సమీపాన ఉన్నప్పటికీ ఇక్కడ పోస్టింగ్ అంటేనే అధికారులు హడలిపోతున్నారు. కొందరు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లగా.. మరికొందరు తమకు అదనపు బాధ్యతలు వద్దని తప్పుకున్నారు.
అనుమతుల కోసం నెలల తరబడి..
మున్సిపల్ కార్యాలయంలో మేనేజర్ పోస్టు ఎన్నికలు ముగిసిన నాటి నుంచి భర్తీకి నోచుకోవడంలేదు. దీంతో పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. వివిధ పనుల కోసం కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. ఇళ్ల నిర్మాణాలకు అనుమతుల కోసం వచ్చిన దరఖాస్తులు నెలల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి. గత నెల 25న హరితహారం ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ వచ్చిన సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మురళీధర్‌యాదవ్ మున్సిపాలిటీలో పోస్టులను భర్తీ చేయాలని వినతిపత్రం అందజేశారు. ఈ పర్యటనలో సీఎం కేసీఆర్ నర్సాపూర్ పట్టణ అభివృద్ధికి రూ.25 కోట్లు కేటాయించారు. కానీ ఈ నిధులను ఖర్చు చేయడంపై అనిశ్చితి నెలకొంది. పూర్తిస్థాయి కమిషనర్, సిబ్బంది లేకపోవడంతో ప్రణాళికలు.. ప్రతిపాదనలు తయారు చేయడమే కష్టం మారింది. సరిపడా సిబ్బంది ఉంటేనే పట్టణ ప్రజలకు ఇబ్బందులు తీరనున్నాయి.