కనెక్టుకాని వాట్సాప్‌.. నేరుగా ఫిర్యాదులిచ్చేందుకు ఆసక్తికనబరుస్తున్న ప్రజలు

ABN , First Publish Date - 2020-07-28T20:26:16+05:30 IST

ప్రజా సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్లలో చేపట్టిన వాట్సాప్‌ ప్రజావాణి కి స్పందన రావడం లేదు. లాక్‌డౌన్‌ అమలవుతున్నప్పటి నుంచి ప్రజావాణి రద్దయిన నేపథ్యంలో తాజాగా మహబూబ్‌నగర్‌, నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో వాట్సాప్‌

కనెక్టుకాని వాట్సాప్‌.. నేరుగా ఫిర్యాదులిచ్చేందుకు ఆసక్తికనబరుస్తున్న ప్రజలు

అవగాహ నలేమి, నేరుగా అయితేనే ఫలితముంటుందనే విశ్వాసం

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో లాక్‌డౌన్‌ నుంచి ఆగిపోయిన ప్రజావాణి

వాట్సాప్‌ ప్రజావాణి పై మరింత అవగాహన కల్పించాలనే సూచనలు


మహబూబ్‌నగర్‌ (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : ప్రజా సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్లలో చేపట్టిన వాట్సాప్‌ ప్రజావాణి కి స్పందన రావడం లేదు. లాక్‌డౌన్‌ అమలవుతున్నప్పటి నుంచి ప్రజావాణి రద్దయిన నేపథ్యంలో తాజాగా మహబూబ్‌నగర్‌, నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో వాట్సాప్‌ ప్రజావాణి, ఈమెయిళ్ల ద్వారా ఫిర్యాదుల స్వీకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంపై అధికారులు విస్తృతంగా ప్రచారం చేసినా ఆశించిన ఫలితం కనిపించడం లేదు. గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు, నిరక్షరాస్యులకు ఈ కార్యక్రమంపై అవగాహన రాలేదు. తమ సమస్యను నేరుగా కలెక్టర్లకు చెప్పుకోవాలనే ఆత్రుత, నేరుగా విన్నవిస్తే తప్ప పట్టించుకోరేమోననే అపోహే ఫిర్యాదుదారుల్లో కనిపిస్తోంది. సోమవారం ఐదు జిల్లా కేంద్రాల్లోనూ ఆంధ్రజ్యోతి జరిపిన పరిశీలనలో ఈవిషయం స్పష్టమైంది. పాలమూరులోని ఐదు జిల్లాల్లోని నాగర్‌కర్నూల్‌ మినహా మిగిలిన నాలుగు చోట్ల వాట్సాప్‌ ప్రజావాణి నిర్వహించినా, వాట్సాప్‌ ద్వారా వచ్చిన ఫిర్యాదుల కంటే నేరుగా కలెక్టర్‌ కార్యాలయాలకు వచ్చి ఇచ్చిన ఫిర్యాదుల సంఖ్యే ఎక్కువగా ఉండటం ఇందుకు నిదర్శనం. 

 కోవిడ్‌ - 19 నేపథ్యంలో లాక్‌డౌన్‌ 2 తర్వాత అమల్లోకి వచ్చిన వాట్సాప్‌ ప్రజావాణి, ఈ-మెయిళ్ల ద్వారా దరఖాస్తుల స్వీకరణకు ప్రజల నుంచి ఆశించిన స్పందన రావడం లేదు. 


వాట్సాప్‌ ప్రజావాణి, ఈ-మెయిళ్ల ద్వారా కంటే నేరుగా కలెక్టర్లను, లేక ఉన్నతాధికారులకు కలిసి ఫిర్యాదులిస్తేనే తమ సమస్యలు పరిష్కారమవుతాయనే నమ్మకమే ప్రజల్లో బలంగా ఏర్పడింది. వాట్సాప్‌ ప్రజావాణిపై విస్తృతంగా ప్రచారం చేసినా ప్రజలు నేరుగా కలెక్టరేట్‌కు వచ్చి ఫిర్యాదులివ్వడం ఇందుకు నిదర్శనం. వాట్సాప్‌ కలిగిన ఫోన్లు లేకపోవడం, ఈవిధానంపై అవగాహన లేకపోవడం కూడా నేరుగా ఫిర్యాదులివ్వడానికి మరో కారణంగా తెలుస్తోంది. ప్రఽధానంగా నిరక్షరాస్యులు, పెద్దవయస్కులు, గ్రామీణ ప్రాంతాల వారు ఇలా నేరుగా వచ్చి ఫిర్యాదులిస్తున్నారు. ఈ సోమవారం మహబూబ్‌నగర్‌ జిల్లాలో వాట్సాప్‌ ద్వారా 16 ఫిర్యాదులు మాత్రమే నేరుగా కలెక్టర్‌ వెంకట్రావుకు చేరగా, ఆయన వీడియోకాల్‌ ద్వారా వారితో మాట్లాడి, ఆ సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారికి పంపారు. ఈమెయిల్‌ ద్వారా ఐదు ఫిర్యాదులు వస్తే, 53 మంది నేరుగా కలెక్టరేట్‌కు వచ్చి ఫిర్యాదులిచ్చారు. వనపర్తి జిల్లాను పరిశీలిస్తే అక్కడ 73 ఫిర్యాదులు వస్తే, అందులో 52 మంది నేరుగా వచ్చి ఇవ్వగా, 16 మంది వాట్సాప్‌ ద్వారా, ఐదుగురు ఈమెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో అసలు ప్రజావాణి కార్యక్రమమే లేకపోవడంతో 27 మంది ఫిర్యాదులివ్వడానికి రాగా, కలెక్టరేట్‌ ఇన్‌వార్డు సెక్షన్‌లో వాటిని స్వీకరించి నమోదు చేశారు. నారాయణపేట జిల్లాలో మాత్రం వాట్సాప్‌ ప్రజావాణికి 30 ఫిర్యాదులు వచ్చాయి. మరో ఐదు ఫిర్యాదులు ఇక్కడ ఈమెయిల్‌ ద్వారా స్వీకరించారు. 


నాగర్‌కర్నూల్‌లో ప్రజావాణికి ప్రత్యామ్నాయం కరువు

లాక్‌డౌన్‌ మొదలైన తర్వాత మార్చి 23 నుంచి నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ప్రజావాణి రద్దు చేశారు. విషయం తెలియక వచ్చేవారి నుంచి కలెక్టరేట్‌లోని ఇన్‌వార్డులో సెక్షన్‌ ఉద్యోగులు ఫిర్యాదులు స్వీకరించి, నమోదు చేస్తున్నారు. లాక్‌డౌన్‌ 2 మొదలైన తర్వాత పాలమూరులోని మహబూబ్‌నగర్‌, వనపర్తి, జోగుళాంబగద్వాల, నారాయణపేట జిల్లాల్లో ప్రత్యామ్నాయాల ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించడం మొదలుపెట్టినా, నాగర్‌కర్నూల్‌లో మాత్రం అలాంటి  చర్యలేవీ చేపట్టలేదు. ఎక్కువ గ్రామాలున్న ఈజిల్లాలో నాలుగు నెలలుగా ప్రజావాణి నిలిచిపోవడంతో ప్రజాసమస్యలు వినేవారు కరువయ్యారు.  ఇకనైనా స్పందించి వాట్సాప్‌ ప్రజావాణి గానీ, ఇంకో రూపంలో గానీ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి సమస్యలు పరిష్కరించాలనే విన్నపాలు వస్తున్నాయి.

Updated Date - 2020-07-28T20:26:16+05:30 IST