కనీవినీ ఎరుగని కర్ఫ్యూ

ABN , First Publish Date - 2020-03-23T07:53:43+05:30 IST

కరోనా వైరస్‌ను కట్టడి చేసే క్రమంలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం జరిగిన జనతా...

కనీవినీ ఎరుగని కర్ఫ్యూ

  • జిల్లాలో వందశాతం విజయవంతం
  • తెల్లవారుజామున 6గంటల నుంచే నిర్మానుష్యంగా మారిన ప్రధాన రహదారులు
  • ఇళ్లకే పరిమితమైన జనం
  • ఎక్కడికక్కడ నిలిచిపోయిన బస్సులు, ప్రైవేట్‌ వాహనాలు
  • గ్రామీణ ప్రాంతాల్లో సైతం జనతా కర్ఫ్యూను పాటించిన ప్రజలు
  • కుటుంబ సభ్యులతో గడిపిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు
  • చప్పట్లతో మారుమోగిన గడప గడప


నాగర్‌కర్నూల్‌, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ను కట్టడి చేసే క్రమంలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం జరిగిన జనతా కర్ఫ్యూ కనివిని ఎరుగని రీతిలో విజయవంతమైంది. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా గ్రామీణ ప్రజలు సైతం జనతా కర్ఫ్యూలో భాగస్వాములయ్యారు. దీంతో చరిత్ర పుటల్లో నిలిచిపోయే విధంగా కొత్త పేజీ ఆవిష్కృతమైంది. కరోనా స్వైర విహారం నేపథ్యంలో జనతా కర్ఫ్యూను విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం చేసిన విస్తృత ప్రచారం సత్ఫలితాలనిచ్చింది. 


తెల్లవారుజామున 5గంటల నుంచే నిర్మానుష్యం

ఆదివారం ఉదయం 6గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6గంటల వరకు 24గంటల పాటు ఇంటికి పరిమితం కావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన నేపథ్యంలో జిల్లాలోని నాగర్‌కర్నూల్‌, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్‌ నియోజకవర్గాలలో ఆదివారం తెల్లవారుజామున 5గంటల నుంచే ప్రధాన రహదారులన్ని నిర్మానుష్యంగా కన్పించాయి. జిల్లా కేంద్రంతోపాటు నాగర్‌కర్నూల్‌, శ్రీశైలం, హైదరాబాద్‌ వయా కల్వకుర్తి, అచ్చంపేట మీదుగా కూడా ఎక్కడా రాకపోకలు కొనసాగలేదు. శనివారం అర్ధరాత్రి నుంచే ఆర్టీసీ బస్సులన్నింటిని డిపోలకే పరిమితం చేయడం, ప్రైవేట్‌ వాహనాలను కూడా ఎక్కడికక్కడ నిలిపివేయడంతో ప్రధాన రహదారుల్లో నిశ్శబ్దం నెలకొంది. ద్విచక్ర వాహనాలు సైతం బయట కన్పించలేదంటే  జనతా కర్ఫ్యూ ఏ రీతిలో సక్సెస్‌ అయిందో తెలుస్తుంది.


అత్యవసర మందులకు కోసం పరిమితమైన సంఖ్యలో మెడికల్‌ షాపులు తెరవడం మినహా టీ కొట్లు మొదలుకొని సూపర్‌మార్కెట్లు, పండ్లు, కూరగాయలు అమ్ముకునే వారు కూడా ఇళ్లకే పరిమితం కావడం విశేషం. రహదారిపై  జనతా కర్ఫ్యూను పర్యవేక్షించేందుకు పోలీసులు, రెవెన్యూ అధికారులు, అత్యవసర సేవలందించేందుకు జిల్లా ఆసుపత్రి, పీహెచ్‌సీలు, మునిసిపల్‌ పారిశుధ్య సిబ్బంది, మీడియా ప్రతినిధులు తప్ప ఒక్కరు కూడా బయట కనబడలేదు. జిల్లా కలెక్టర్‌ ఈ.శ్రీధర్‌, ఎస్పీ డా.వై.సాయిశేఖర్‌, అదనపు కలెక్టర్లు మనుచౌదరి, హన్మంతురెడ్డి, జిల్లా వైద్యాధికారి సుధాకర్‌లాల్‌, డీపీఓ సురేష్‌మోహన్‌, సీపీఓ మోహన్‌రెడ్డిలు జిల్లాలో  జనతా కర్ఫ్యూ అమలును పర్యవేక్షించారు. 


చప్పట్లతో మారుమోగిన కందనూలు జిల్లా

శనివారం రాత్రి నుంచి ఇళ్లకే పరిమితమైన జనం కరోనా వైరస్‌ బారిన పడిన వారికి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలందిస్తున్న వారికి చప్పట్లతో అభినందించారు. ఎవరికి వారు స్వచ్ఛందంగా తమ ఇళ్ల ఎదురుగా నిలబడి వైద్య సిబ్బంది, పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం, మీడియా పారిశుధ్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతూ నినాదాలు కూడా చేశారు. జనతా కర్ఫ్యూలో భాగంగా ప్రభుత్వ విప్‌లు కూచకుళ్లదామోద్‌రెడ్డి, గువ్వల బాలరాజు, జడ్పీ చైర్‌పర్సన్‌ పద్మావతి, పార్లమెంట్‌ సభ్యులు పోతుగంటి రాములు, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, బీరం హర్షవర్దన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్‌లు, మాజీ నాగం జనార్దన్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ ఈ.శ్రీధర్‌, ఎస్పీ డా.వై.సాయిశేఖర్‌, అదనపు కలెక్టర్లు మను చౌదరి, హన్మంతురెడ్డిలతోపాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు కుటుంబ సభ్యులతో ఇంట్లోనే గడిపారు. ఆదివారం సాయంత్రం 5గంటల సమయంలో జిల్లాలోని నాగర్‌కర్నూల్‌, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్‌ నియోజకవర్గాలలో సైరన్‌ మోగించిన వెంటనే వారంతా బయటకి వచ్చి చప్పట్లు కొట్టారు. 

Updated Date - 2020-03-23T07:53:43+05:30 IST