కర్ణాటక..కొత్త ఎత్తు
ABN , First Publish Date - 2020-10-27T10:59:22+05:30 IST
తుంగభద్ర గంగానదితో సమానమైన పవిత్ర నది అంటారు పెద్దలు. అలాంటి పవిత్రమైన నది జలాలను జోగుళాంబ గద్వాల జిల్లా ప్రాంత రైతులకు అందకుండా దశాబ్దాలుగా కర్ణాటక, ఏపీ ప్రభుత్వాలు అడ్డుకుంటున్నాయి

తుంగభద్ర డ్యాం నుంచి దిగువకు నీరు రాకుండా అడ్డుకునే ప్రయత్నం
30 టీఎంసీల రిజర్వాయర్ నిర్మాణానికి సన్నద్ధం
తెలంగాణ, ఏపీ ఈఎన్సీతో చర్చించిన యంత్రాంగం
వ్యతిరేకించిన తెలుగు రాష్ర్టాల ఈఎన్సీ బృందం
ప్రతిపాదనలు పట్టాలెక్కితే తెలంగాణ, ఏపీలకు జలగండం
గద్వాల, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి) : తుంగభద్ర గంగానదితో సమానమైన పవిత్ర నది అంటారు పెద్దలు. అలాంటి పవిత్రమైన నది జలాలను జోగుళాంబ గద్వాల జిల్లా ప్రాంత రైతులకు అందకుండా దశాబ్దాలుగా కర్ణాటక, ఏపీ ప్రభుత్వాలు అడ్డుకుంటున్నాయి. ఈ నది పరిధిలో జిల్లాలో లక్ష ఎకరాలకు పైగా సాగు భూములు ఉండగా, ఒక్క పంటకు కూడా సాగునీరు అందని దుస్థితి నెలకొన్నది. తాజాగా ఇప్పుడు తుంగభద్ర డ్యామ్ కింద వరద నీటిని వినియోగించుకోవడానికి 30 టీఎంసీల రిజర్వాయర్ నిర్మాణం చేపట్టడానికి కర్ణాటక ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలు పెట్టింది. ఈ ప్రతిపాదలను అమలు చేస్తే తెలంగాణలోని అలంపూర్ నియోజక వర్గంలోని లక్ష ఎకరాలు, ఏపీలోని కేసీ కెనాల్ కింద సాగవుతున్న రెండు లక్షల ఎకరాలకు సాగు నీరు అందక ఎడారిగా మారే అవకాశం ఉన్నది.
కర్ణాటక, ఏపీలు 140 టీఎంసీల నీటి వినియోగం
తుంగభద్ర నదిపై కర్ణాటక ప్రభుత్వం 100.86 టీఎంసీల సామర్థ్యంతో తుంగభద్ర (టీబీ) డ్యాంను నిర్మించింది. ఈ డ్యాం దిగువన ఉన్న తెలంగాణకు రాజోళి బండ డైవర్షన్ స్కీం (ఆర్డీఎస్) ద్వారా 15.9 టీఎంసీల నీరు రావాల్సి ఉంది. కానీ, మూడు దశాబ్దాలుగా డ్యాం నుంచి ఒక్క ఏడాది కూడా నాలుగు టీఎంసీలకు మించి నీరు రాలేదు. దీంతో ఆర్డీఎస్ పరిధిలోని అలంపూర్ నియోజకవర్గంలో ఉన్న లక్ష ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉండగా, కేవలం 10 వేల నుంచి 15 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోంది. దీనికితోడు ఆర్డీఎస్ నుంచి తెలంగాణకు వచ్చే నీటిని కాల్వల ద్వారా రాకుండా ఏపీలోని రాయలసీమ జిల్లాలైన అనంతపూర్, కర్నూల్ జిల్లాల నాయకులు అనకట్టకు గండ్లు కొట్టి దౌర్జన్యంగా నీటిని కర్నూల్, కడప ప్రాంతాలకు మళ్లిస్తున్నారు. ఇప్పటికే టీబీ డ్యాం నుంచి వచ్చే వరద నీటిలో 32 టీఎసీలను ఏపీ ప్రభుత్వం హై లేవల్ కెనాల్ ద్వారా అనంతపూర్ జిల్లాకు తరలిస్తుండగా, మరో 18 టీఎంసీలను కేసీ కెనాల్ ద్వారా తరలించుకుపోతుంది. నదిపై నిర్మాణం చేపట్టిన టీబీ డ్యాంలోని వంద టీఎంసీల నీటిని కర్ణాకట వినియోగించుకుంటుంది. ఇలా ఈ రెండు రాష్ర్టాలు మొత్తం 150 టీఎంసీల నీటిని వాడుకుంటుండగా, మిగిలిన కొద్దిపాటిగా వచ్చే అర టీఎంసీ నీరు మాత్రమే అప్పుడప్పుడు తెలంగాణ ప్రాంతానికి ఆర్డీఎస్ ద్వారా వస్తున్నాయి.
కర్ణాటక ప్రతిపాదనలతో ఎడారే
కర్ణాటక ప్రభుత్వం తుంగభద్ర డ్యాం కింద వచ్చే వరద నీటిని వియోగించుకోవడానికి కొత్తగా 30 టీఎంసీల రిజర్వాయర్ నిర్మాణానికి సన్నద్ధమవుతోంది. ఈ మేరకు తుంగభద్ర బోర్డు నిర్వహించిన మూడు రాష్ట్రాల వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ ప్రస్తావన తీసుకొచ్చింది. ఈ రిజర్వాయర్ నిర్మాణం జరిగితే దిగువన ఉన్న తెలంగాణ, ఏపీలోని కేసీ కెనాల్‌కు సాగు నీరు అందని పరిస్థితి నెలకొంటుంది. డ్యామ్ నుంచి వంద టీఎంసీలతో పాటు మరో 30 టీఎంసీల రిజర్వాయర్ నిర్మాణం చేపట్టి వచ్చే కొద్దిపాటి వరద నీటిని కూడా రాకుండా చేయడానికి నిర్ణయం తీసుకుంది. ఈ ప్రతిపాదనలను తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు వ్యతిరేకించాయి. తెలంగాణకు రావాల్సిన 15.9 టీఎంసీల వాటా నీరు ఇచ్చిన అనంతరం, కొత్త ప్రతిపాదనలు తీసుకురావాలని తెలంగాణ ఈఎస్సీ అధికారులు స్పష్టం చేశారు. అలాగే ఏపీ ఈఎన్సీ కూడా వ్యతిరేకించింది.