పట్టణ ప్ర‘గతి’

ABN , First Publish Date - 2020-12-12T03:26:17+05:30 IST

పల్లె ప్రగతి పేరుతో గ్రామాల్లో ఆశించిన మేర అభివృద్ధి జరుగుతుండగా, పట్టణ ప్రగతి భాగంగా పట్టణాల్లో చేపట్టాల్సిన పనులు చేపట్టడం లేదు.

పట్టణ ప్ర‘గతి’
అయిజలో నిర్మాణం పూర్తి కాని ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ భవనం

నిధులున్నా ముందుకు సాగని పనులు

ప్రణాళికల వద్దే బ్రేకులు

సమీక్షలతోనే సరిపెట్టుకుంటున్న అధికారులు


గద్వాల, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): పల్లె ప్రగతి పేరుతో గ్రామాల్లో ఆశించిన మేర అభివృద్ధి జరుగుతుండగా, పట్టణ ప్రగతి భాగంగా పట్టణాల్లో చేపట్టాల్సిన పనులు చేపట్టడం లేదు. జోగుళాంబ గద్వాల జిల్లాలో గద్వాల, అయిజ, వడ్డేపల్లి, అలంపూర్‌ మునిసిపాలిటీలు ఉన్నాయి. పట్టణ ప్రగతిలో భాగంగా నాలుగు మునిసిపాలిటీల్లో పబ్లిక్‌ టాయిలెట్స్‌, హరితహారంలో భాగంగా నర్సరీలు, పట్టణ ప్రకృతి వనాలు, ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్స్‌, శ్మశానవాటికలు, వర్మీ కంపోస్టు యూనిట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. 13, 14వ ఆర్థిక సంఘం, ఎస్సీ కాంపోనెంట్‌, కేటీఆర్‌ జిల్లా కు ఇచ్చిన ప్రత్యేక నిధులతో రోడ్ల మరమ్మతుతోపాటు సీసీ, బీటీ రోడ్ల నిర్మాణాలు చేపట్టాలని ప్రణాళికలు చేపట్టారు. కానీ ఏ మునిసిపాలిటీలోనూ అభివృద్ధి పనులు ప్రారంభం కాలేదు.


పబ్లిక్‌ టాయిలెట్స్‌ ఎక్కడ?

గద్వాల మునిసిపాలిటీలో 71 పబ్లిక్‌ టాయిలెట్స్‌ నిర్మించాలని ప్రణాళిక రూపొందించారు. పాతవి 25 ఉన్నాయి. కొత్తగా 46 నిర్మించాల్సి ఉంగా, 15 మాత్రమే పురోగతిలో ఉన్నాయి. వడ్డేపల్లిలో 13కు తొ మ్మిది, అలంపూర్‌లో 13కు ఎనిమిదింటి పనులు మాత్రమే ప్రారంభమయ్యాయి. అయిజలో కూడా నిర్మాణంలో ఉన్నాయని రికార్డుల్లో చూపుతున్నారు. కానీ పనులు మాత్రం నామమాత్రంగా కొనసాగుతున్నాయి.


ప్రతిపాదనల్లోనే ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్లు

గద్వాలలో రూ.14.10 కోట్లతో చేపట్టాల్సిన ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ ప్రతిపాదనల్లోనే మగ్గుతోంది. అయిజలో రూ.1.50 కోట్లతో తలపెట్టిన పనులు ప్రారంభమయ్యాయి. వడ్డేపల్లి, అలంపూర్‌లోనూ ఇంకా ప్రతిపాదల్లోనే ఉన్నాయి. గద్వాలలో 30 ఎకరాల్లో శ్మశాన వాటిక నిర్మాణం చేపట్టాలని, అందుకు స్థలం సేకరించాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మరోవైపు జిల్లా కేంద్రంలో ప్రస్తుతం ఉన్న 12 శశ్మానవాటికల్లో మంచి నీరు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. అయిజలో శ్మశానవాటికకు స్థలం సేకరిస్తున్నారు. అలంపూర్‌లో పనులు ప్రారంభమయ్యాయి. వడ్డేపల్లిలో పాతదాన్నే అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు.


ముందుకు సాగని రోడ్ల నిర్మాణాలు

పట్టణాల్లో రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్ల నిర్మాణాలకు నిధులున్నా.. టెండర్లు పిలిచి పనులు చేయించడానికి పాలక వర్గాలకు, అధికారులకు తీరిక లేకుండా పోయింది. గద్వాల మునిసిపాలిటీలో 13, 14వ ఆర్థిక సంఘం, ఎస్సీ కంపోనెంట్స్‌, పట్టణ ప్రగతి నిధు లు రూ.13.19 కోట్లు ఉన్నాయి. వాటితో 135 చోట్ల రోడ్లు నిర్మించడానికి ప్రణాళికలు రూపొందించారు. ఒకటి రెండు చోట్ల పనులు ప్రారంభం కాగా, మిగతావి టెండర్ల స్థాయిలో ఉన్నా యి. అయిజలో రూ.4.90 కోట్లు ఉండగా, తొమ్మిది పనులకు రెండు మాత్రమే పూర్తి చేశారు. అలంపూర్‌లో రూ.45 లక్షలు ఉండగా, పనులు ప్రారం భం కాలేదు. వడ్డేపల్లిలో రూ.28 లక్షలు ఉన్నా పనులు మొదలు పెట్టలేదు. వీటితోపాటు వర్మీకంపోస్టు యూనిట్లు, డంపింగ్‌ యార్డుల పనులు కూడా మొదలు కాలేదు.

Updated Date - 2020-12-12T03:26:17+05:30 IST