ఇసుకతరలింపులో పారదర్శకత ఉండాలి : శృతి ఓఝా

ABN , First Publish Date - 2020-03-12T05:58:02+05:30 IST

రీచ్‌ల నుంచి ఇసుక తరలింపులో పారదర్శకత ఉండాలని కలెక్టర్‌ శ్రుతి ఓఝా అన్నారు. ఎట్టి పరిస్థితిల్లోను ఇసుక అక్రమ రవాణకు అవకాశం లేకుండా

ఇసుకతరలింపులో  పారదర్శకత ఉండాలి : శృతి ఓఝా

రాజోలి, మార్చి 11: రీచ్‌ల నుంచి ఇసుక తరలింపులో పారదర్శకత ఉండాలని కలెక్టర్‌ శ్రుతి ఓఝా అన్నారు. ఎట్టి పరిస్థితిల్లోను ఇసుక అక్రమ రవాణకు అవకాశం లేకుండా పటిష్ఠమైన జాగ్రత్తలు తీసుకోవాలని గనుల శాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ విజయరామరాజును ఆదేశించారు. మండలంలోని చిన్నధన్వాడ, పెద్దధన్వాడ, తుమ్మిళ్ల గ్రామాల్లోని ఇసుక రీచ్‌లను కలెక్టర్‌ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇసుక తరలించే ట్రాక్టర్లకు స్పష్టంగా ఎంఐబీ రేడియం, లోగో ఉండేలా చూడాలని సూచించారు.


ప్రతి ట్రాక్టర్‌కు జీపీఎస్‌, రిజిస్టర్‌ నెంబరుతో బోర్డు ఉండాలన్నారు. రీచ్‌లకు వచ్చే ట్రాక్టర్లకు ముందుగా అనుమతులను పరిశీలించి, తర్వాతే లోడ్‌ చేయాలన్నారు. పెద్ద ధన్వాడలో మొత్తం లక్ష క్యూబిక్‌ మీటర్ల ఇసుకను గుర్తించారని తెలిపారు. అందులో ఇప్పటి వరకు ఆన్‌లైన్‌ శ్యాండ్‌ ట్యాక్సీ ద్వారా తరలించిన ఇసుక, మిగిలిన ఇసుక లెక్కలు సరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఏడీని ఆదేశించారు. చిన్న ధన్వాడ ఇసుక రీచ్‌ వద్ద ట్రాక్టర్‌ డ్రైవర్ల మొబైల్‌ నెంబర్లను పరిశీలించారు. ఇసుకలోడు చేసే కూలీలతో మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. అనంతరం తుమ్మిళ్ల స్టాక్‌ పాయింట్‌లో 39 వేల క్యాబిక్‌ మీటర్ల ఇసుక వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో రాజోలి తహసీల్దార్‌ వెంకటరమణ పాల్గొన్నారు.

విద్యార్థుల హాజరు శాతం పెంచాలి

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే అని కలెక్టర్‌ శ్రుతి ఓఝా అన్నారు. మండలంలోని పెద్ద ధన్వాడ గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను ఆమె బుధవారం సందర్శించారు. విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనం మెనూ రిజిష్టర్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులు ఆమెను కలిశారు. గ్రామ సమీపం నుంచి నది పారుతున్నా సాగు నీరు అందడం లేదని కలెక్టర్‌కు తెలిపారు. ఒక ఎత్తిపోతలను నిర్మిస్తే సాగునీటి సమస్య తీరుతుందని చెప్పారు. గ్రామానికి రోడ్డు సరిగా లేదని, బస్సు సౌకర్యం కూడా లేదని తెలిపారు. అందుకు కలెక్టర్‌ స్పందిస్తూ పరిశీలిస్తామని అన్నారు. 


Updated Date - 2020-03-12T05:58:02+05:30 IST