ముక్కిడి‘గండం’

ABN , First Publish Date - 2020-09-16T06:28:38+05:30 IST

ముక్కిడిగుండం గ్రామస్థుల పరిస్థితి దినదిన గండంగా మారుతోంది. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలంలోని ఈ గ్రామాన్ని ఆనుకొని

ముక్కిడి‘గండం’

జలదిగ్బంధంలో గ్రామం

భయాందోళనలో ప్రజానీకం

అత్యవసర సమయాల్లో దేవుడిపై భారం

నాలుగేళ్లైనా పూర్తి కాని వంతెన నిర్మాణం


కొల్లాపూర్‌ రూరల్‌ : ముక్కిడిగుండం గ్రామస్థుల పరిస్థితి దినదిన గండంగా మారుతోంది. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలంలోని ఈ గ్రామాన్ని ఆనుకొని పెద్దవాగు, ఉడుముల వాగులు ఉండగా, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ఈ వాగులు ఉధృతంగా పారుతున్నాయి. సోమవారం నుంచి గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. గ్రామం నుంచి ఇతర ప్రాంతాలకు సంబంధాలు తెగిపోయాయి. మొత్తం గ్రామంలో ఎనిమిది వేల జనాభా ఉండగా, ప్రస్తుతం గ్రామంలోని కిరాణ దుకాణాల్లో నిత్యావసర సరుకులు అయిపోయాయి. ఉన్న వాటిని అధిక ధరలకు వ్యాపారులు అమ్ముతుండటంతో కూలీ పనులు చేసుకునే వారు పస్తులుండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీనికితోడు గ్రామంలో వృద్ధులు, గర్భిణుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. గ్రామానికి చెందిన కడ్తాల లక్ష్మి అనే మహిళ నిండు చూలాలు. కాన్పు సమయం దగ్గర పడుతుండటంతో ఆసుపత్రికి ఎలా వెళ్లాలనే ఆందోళన ఆమె కుటుంబ సభ్యులను వెంటాడుతోంది. అలగేఏ జబ్బు చేస్తే గోలి వేసుకునేందుకు కూడా మందులు దొరకడం లేదని ఓరే కిష్టమ్మ అనే వృద్ధురాలు వాపోతోంది.


ముక్కిడిగుండం వద్ద ఉడుముల వాగుపై వంతెన నిర్మాణం చేపట్టాలని ప్రజా సంఘాలతో పాటు గ్రామస్థులు దాదాపు రెండు దశాబ్దాల పాటు పోరాటాలు చేశారు. వారి పోరాటాల ఫలితంగా ప్రభుత్వం వంతెనను మంజూరు చేసింది. దాదాపు రూ.5 కోట్ల అంచనా వ్యయంతో 2016లో పనులను ప్రారంభించారు. కానీ, పనులు పూర్తి కావడం లేదు. మొదట్లో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌ మధ్యలోనే పనులను నిలిపివేశాడు. బిల్లులు చెల్లింపుల్లో జాప్యం చేయడంతో పాటు కొందరు రాజకీయ నాయకులు పర్సంటేజీల కోసం ఒత్తిళ్లు తీసుకురావడంతో కాంట్రాక్ట్‌ను రద్దు చేసుకున్నాడు. మరో కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించగా, ఆయన కూడా మధ్యలోనే పనులు నిలిపివేశారు. దీంతో మరో కాంట్రాక్టర్‌కు వంతెన నిర్మాణ బాధ్యతలను అప్పగించాయి. కానీ, కరోనా వైరస్‌ ప్రారంభమైన నాటి నుంచి పనులు చేపట్టడం లేదు. అలాగే పెద్దవాగుపై కూడా వంతెన నిర్మాణానికి డిమాండ్‌ చేస్తున్నా, ఇంత వరకు కార్యరూపం దాల్చడం లేదు.

Updated Date - 2020-09-16T06:28:38+05:30 IST