జర్నలిస్ట్‌ల సేవలు మరువలేనివి
ABN , First Publish Date - 2020-04-21T09:48:31+05:30 IST
కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వం, పోలీస్‌లు చేస్తున్న సూచనలను ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పిస్తున్న

ఎస్పీ అపూర్వారావు
వనపర్తి క్రైమ్, ఏప్రిల్ 20: కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వం, పోలీస్‌లు చేస్తున్న సూచనలను ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పిస్తున్న జర్నలిస్ట్‌ల సేవలు మరువలేనివని ఎస్పీ అపూర్వరావు అన్నారు. సోమవారం పట్టణంలోని టౌన్ పోలీస్ స్టేషన్‌లో జర్నలిస్ట్‌లకు శానిటైజర్, మాస్క్‌లు, కోవిడ్ 19 జర్నలిస్ట్‌ల పాస్‌లను పంపిణీ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ వార్తల సేకరణలో తమ ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి జర్నలిస్ట్‌లు పని చేస్తున్నారని, కరోనా మహమ్మారి బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తగా జర్నలిస్ట్‌లకు శానిటైజర్‌లు, మాస్క్‌లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఇప్పుడున్న పరిస్థితులలో జర్నలిస్ట్‌లు విధి నిర్వహణలో ఇబ్బందులు ఎదురవ్వకుండా లాక్‌డౌన్ ఉన్నన్ని రోజులు సెపరేట్‌గా ప్రెస్ స్టిక్కర్స్ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
వాటిని ప్రతి ఒక్కరూ వాహనానికి అంటించుకోవాలన్నారు. విధులు నిర్వహిస్తున్న పోలీస్‌లు ఆ స్టిక్కర్స్ ఉన్న వాహనాన్ని ఆపకుండా వదిలేస్తారని సూచించారు. అలాగే జర్నలిస్ట్‌లు విధి నిర్వహణలో వార్తల సేకరణ సమయంలో సామాజిక దూరం పాటించాలన్నారు. ఎక్కడైనా చిన్న చిన్న సంఘటనలు జరిగితే స్థానిక సీఐ, ఎస్సైల దృష్టికి తీసుకరావాలన్నారు. ప్రభుత్వం, పోలీసులు రోజురోజుకు సూచిస్తున్న సూచనలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ మహమ్మారిని తరిమికొట్టడానికి మరింత కష్టపడి పని చేయాలని కోరారు. కార్యక్రమంలో డీఎస్పీ సృజన, సీఐ సూర్యనాయక్, ఎస్సై వెంకటేష్‌గౌడ్ పాల్గొన్నారు.