పోలీసుల పని తీరు భేష్: ఎస్పీ
ABN , First Publish Date - 2020-12-31T03:18:03+05:30 IST
కరోనా మహమ్మారి పట్టి పీడిస్తున్న సమయంలో పాలమూరు పోలీసులు అద్భుతంగా పని చేశారని, వారి సేవలు మరువలేనివని ఎస్పీ రెమారాజేశ్వరి అన్నారు.
మహబూబ్‌నగర్, డిసెంబరు 30: కరోనా మహమ్మారి పట్టి పీడిస్తున్న సమయంలో పాలమూరు పోలీసులు అద్భుతంగా పని చేశారని, వారి సేవలు మరువలేనివని ఎస్పీ రెమారాజేశ్వరి అన్నారు. కరోనాను నియంత్రించే క్రమంలో 150 మంది పోలీసులు వైరస్ బారిన పడ్డారన్నారు. ఈ జిల్లాలో పనిచేయడం గర్వంగా ఉందని అన్నారు. బుధవారం ఆమె పోలీస్ పరేడ్ మైదానంలో ఈ ఏడాది నేరాల తీరు తెన్నులపై విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోలీసుల పని తీరును గుర్తించిన డీజీ జిల్లాలో 9 మందికి అవార్డులను ఇచ్చారన్నారు. కరోనా కారణంగా జిల్లాలో ఈ ఏడాది అన్ని విభాగాల్లో నేరాల సంఖ్య తగ్గగా, రోడ్డు ప్రమాదాలు మాత్రం కొద్దిగా పెరిగాయని చెప్పారు.
ముఖ్యమైన కేసుల ఛేదన
ముఖ్యమైన కేసులను ఈ ఏడాది పోలీసులు చేధించారని ఎస్పీ తెలిపారు. జడ్చర్ల ఏటీఎంలో రూ.40 లక్షల చోరీ, సీఎంఆర్ షాపింగ్ మాల్‌లో బంగారు నగలు అపహరణ, సీరియల్ కిల్లర్ ఎరుకలి శ్రీను కేసులను చేధించామన్నారు. జడ్చర్లలో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న వ్యక్తులను అరెస్ట్ చేశామన్నారు. ఆపరేషన్ ముస్కాన్ ద్వారా బడి బయటిపిల్లలను బడిలో చేర్పించామన్నారు.
కళాజాత బృందాలతో అవగాహన
ఆన్‌లైన్ మోసాలు, రహదారి భద్రత, సురక్ష కళాజాత బృందాలతో పలు రకాల అవహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎస్పీ చెప్పారు. యూటీఐలను తగ్గిస్తున్నామని, రాష్ట్రంలోని 8 జిల్లాలకు అందులో చోటు లభించగా పాలమూరు ఒకటని పేర్కొన్నారు. సమావే శంలో అడిషినల్ ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ శ్రీధర్, సీఐలు మహేశ్వర్‌రావు, రాజేశ్వర్ గౌడ్, శ్రీనివాసచారి పాల్గొన్నారు.