మన పరిశ్రమలు..ఎంత భద్రం!

ABN , First Publish Date - 2020-05-09T10:06:22+05:30 IST

ఎల్జీ పాలిమర్‌ గ్యాస్‌ లీకేజీతో విశాఖపట్నం ఉలిక్కిపడింది. ఈ సంఘటనతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం ఇండస్ట్రీస్‌, ఫ్యాక్టరీస్‌,

మన పరిశ్రమలు..ఎంత భద్రం!

కాలుష్యాన్ని వెదజల్లుతున్న ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పరిశ్రమలు

గతం నుంచి మూసి వేయాలని స్థానికుల ఆందోళనలు

‘ఆంధ్రజ్యోతి’లోనూ ప్రచురితమైన వరుస కథనాలు

జాతీయ గ్రీన్‌ ట్రిబ్యూనల్‌కు పలుమార్లు ఫిర్యాదు

కంటి తడుపు చర్యలు చేపట్టిన యాజమాన్యాలు

విశాఖపట్నం ఘటనలతో పరిశ్రమల నివేదికలు కోరిన సర్కారు

తనిఖీలు చేపట్టని ఇండస్ట్రీస్‌, ఫ్యాక్టరీస్‌, పొలూష్యన్‌ కంట్రోల్‌ బోర్డు


జడ్చర్ల, మే 8 : ఎల్జీ పాలిమర్‌ గ్యాస్‌ లీకేజీతో విశాఖపట్నం ఉలిక్కిపడింది. ఈ సంఘటనతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం ఇండస్ట్రీస్‌, ఫ్యాక్టరీస్‌, పొలూష్యన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారులను రాష్ట్రంలోని పరిశ్రమలను తనిఖీలు చేయాలని ఆదేశించింది. దీంతో ఆ శాఖలకు చెందిన అధికారులు శుక్రవారం ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని జడ్చర్ల మండలం పోలేపల్లి సెజ్‌లోని ఫార్మా పరిశ్రమలు, పెద్దపల్లి సమీపంలోని బల్క్‌ డ్రగ్స్‌ పరిశ్రమ, పోలేపల్లి సమీపంలోని ఆర్గానిక్‌ కెమికల్‌ ఇండస్ట్రీ, వేముల సమీపంలోని మరో పరిశ్రమతో పాటు మరికొన్ని పరిశ్రమలను తనిఖీ చేశారు.


నామమాత్రపు తనిఖీలు

పోలేపల్లి సెజ్‌లోని ఫార్మ పరిశ్రమలతో గాలి, నీరు, పంటలు, చెరువులు కలుషితమయ్యాయంటూ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఏడాది కిందట జాతీయ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. దీంతో కలెక్టర్‌ అధ్యక్షతన ఒక బృందం, రాష్ట్రస్థాయి ఉన్నత అధికారులతో కూడిన మరో బృందం పోలేపల్లి సెజ్‌ సమీపంలో పర్యటించి, విచారణ చేపట్టింది. అలాగే కెమికల్స్‌తో కూడిన నీటిని సమీపంలోని చెరువులకు, సెజ్‌లోని మురుగు కాలువలోకి వదిలిన సంఘటనలు ఇప్పటికే ‘ఆంధ్రజ్యోతి’లో కథనాలు ప్రచురితమయ్యాయి.


పోలేపల్లి సెజ్‌లోని ఫార్మా పరిశ్రమలు, బల్క్‌డ్రగ్స్‌, ఆర్గానిక్‌ కెమికల్‌ పరిశ్రమలతో పరిసర ప్రాంతవాసులు ముప్పునకు గురయ్యారంటూ ప్రతిపక్ష నాయకులు పర్యటించి, పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌ చేశారు. కాలుష్యం వెదజల్లుతున్న రాజాపూర్‌ మండలం రంగారెడ్డిగూడ సమీపంలోని స్పాంజ్‌ ఐరన్‌ పరిశ్రమ, రాజాపూర్‌ సమీపంలోని మరో పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని, నష్టాలకు గురైన గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టిన సందర్భాలున్నాయి.


ఇంత జరుగుతున్నా, కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమలపై నేటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పరిశ్రమల ద్వారా నష్టపోయిన రైతులను గుర్తించి, నష్టపరిహారం చెల్లించాలంటూ జాతీయ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ సూచించినా, ఇప్పటి వరకు పరిశ్రమల యాజమాన్యాలు స్పందించ లేదు. తాజాగా విశాఖపట్నంలో జరిగిన ఎల్జీ పాలిమర్‌ ఘటనలతోనైనా ప్రభుత్వం స్పందించి, కాలుష్యాన్ని వెదజల్లుతున్న ఈ పరిశ్రమలను మూసి వేయించాలనే డిమాండ్‌ వస్తోంది.


చర్యలు తీసుకోవాలి

కాలుష్య పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలి. జాతీయ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ మొట్టికాయలు వేసినా, పరిశ్రమల యాజమాన్యాలలో ఎలాంటి మార్పులేదు. పరిశ్రమల ద్వారా నష్టపోయిన రైతులను గుర్తించి, నష్టపరిహారం చెల్లించాలని ట్రిబ్యునల్‌ సూచించినా, ఇప్పటి వరకు అలాంటి చర్యలు చేపట్టలేదు. 

- వెంకటయ్య, జాతీయ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన వ్యక్తి


Updated Date - 2020-05-09T10:06:22+05:30 IST