మాన్యాన్ని.. మింగేశారు

ABN , First Publish Date - 2020-10-03T09:44:51+05:30 IST

ఆలయ మాన్యాలు అన్యాక్రాంతమవుతున్నాయి. కోట్లు విలువ చేసే భూములు పరుల చేతిలో బంధీ అవుతున్నాయి.

మాన్యాన్ని..  మింగేశారు

 పరుల చేతిలో వేంకటేశ్వర స్వామి ఆలయ భూములు

36 ఏళ్ల కిందట 15.3 ఎకరాలకు స్వాధీనం చేసుకున్న ప్రబుద్ధులు

రెవెన్యూ రికార్డులో అతని కుమారుడు, భార్య పేరు మీద పట్టాలు

2017లో ప్రజావాణిలో స్థానికుడి ఫిర్యాదు

నేటికీ చర్యలు తీసుకోని అధికారులు


వంగూరు, అక్టోబరు 2 : ఆలయ మాన్యాలు అన్యాక్రాంతమవుతున్నాయి. కోట్లు విలువ చేసే భూములు పరుల చేతిలో బంధీ అవుతున్నాయి. వంగూరు మండల కేంద్రంలో దాదాపు 500 ఏళ్ల కిందట నిర్మించిన అతి పురాతనమైన వేంకటేశ్వర స్వామి ఆలయ భూములిప్పుడు ఇతరుల పేరు మీద పట్టా అయ్యాయి. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.


వేంకటేశ్వర స్వామి ఆలయానికి మొత్తం 15.03 ఎకరాల మాన్యం భూములున్నాయి. 1954-55 ఖాస్ర్తా పహాణి ప్రకారం సర్వే నంబర్‌ 289లో 6.27 ఎకరాలు, 290లో 8.16 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని 36 ఏళ్ల కిందట అప్పటి పూజారి ఆండాళ్లమ్మకు వంగూరుకు చెంది కోట్ల అంతయ్య రూ.30 వేలు ఇచ్చి భూమిని స్వాధీనం చేసుకున్నాడు. ప్రస్తుతం రెవెన్యూ రికార్డుల్లో ఈ భూమి అంతయ్య కుమారుడు, అతని భార్య పేరు మీద పట్టా అయ్యి ఉంది. ప్రస్తుతం ఈ భూముల ధర కోట్లల్లో పలుకుతోంది. ఒక ఎకరా రూ.25 లక్షల ధర పలుకుతుండగా, మొత్తం దాదాపు 15.03 ఎకరాలకు సంబంధించిర రూ.3.80 కోట్ల ధర ఉంది. అయితే, 2017 ఫిబ్రవరిలో ఆలయ మాన్యం ఇతరుల పేరు మీద పట్టా అయిన విషయం తెలుసుకున్న గ్రామానికి చెందిన వ్యక్తి, ఆలయ భూములను కాపాడాలని ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశాడు. కానీ, ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.


స్వంత ఖర్చుతో నైవిద్యం చేస్తున్న..భక్తవత్సల్‌, పూజారి

36 ఏళ్ల కిందట మా నాయనమ్మ ఈ దేవుని మాన్యం భూమిని అమ్ముకున్నారు. ఎలా అమ్ముకున్నారో నాకు తెలియదు. ప్రస్తుతం దేవాలయం శిథిలావస్థకు చేరింది. నా సొంత ఖర్చుతో దేవునికి ధూప, దీప, నైవేద్యాలు సమర్పిస్తున్నా. 


అధికారులకు నివేదిస్తాం..రాజునాయక్‌, తహసీల్దార్‌, వంగూరు

వంగూరులోని వేంకటేశ్వర ఆలయానికి చెందిన భూమిపై పూర్తిగా విచారణ చేసి పైఅధికారులకు నివేదిస్తాం. అక్రమంగా దేవుని భూమిని పట్టా మార్చిడి చేసుకుంటే, పట్టాను రద్దు చేసి అధికారుల ఆదేశాల మేరకు భూమిని స్వాఽధీనం చేసుకుంటాం.

Updated Date - 2020-10-03T09:44:51+05:30 IST