అనుమతుల పేరుతో అక్రమ రవాణా

ABN , First Publish Date - 2020-12-29T03:31:47+05:30 IST

అనుమతుల పేరుతో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు.

అనుమతుల పేరుతో అక్రమ రవాణా
ఇసుకను ట్రాక్టర్లలో నింపుతున్న కూలీలు

దుందుభీ వాగు నుంచి ఇసుకను కొల్లగొడుతున్న వైనం

మామూళ్ల మత్తులో అధికారులు


ఉప్పునుంతల, డిసెంబరు 28: అనుమతుల పేరుతో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. ప్రభుత్వం గ్రామాల్లో నిర్మిస్తున్న రైతు వేదికలు, శ్మశాన వాటికలు, డంపింగ్‌ యార్డులు, కల్లాల కోసం మండల పరిధిలోని పెద్దాపూర్‌ సమీపంలో గల దుందుభీ ఇసుక క్వారీ నుంచి తవ్వకాల కోసం అనుమతులు ఇస్తున్నారు. దానిని ఆసరా చేసుకుని ఇసుకను కొల్లగొడుతున్నారు. పని దినాల్లో మాత్రమే ఇసుకను రవాణా చేయాల్సి ఉండగా, సెలవు రోజుల్లోనూ తవ్వి తీసుకెళ్తున్నారు. రోజుకు 50 ట్రాక్టర్ల వరకు అనుమతులు ఇస్తుండగా, 150 ట్రాక్టర్లు ఇసుకను సరఫరా చేస్తున్నాయి. ఒక్కో ట్రాక్టరు రోజుకు రెండు ట్రిప్పుల ఇసుకను మాత్రమే తీసుకెళ్లాల్సి ఉండగా, ఇసుక క్వారీ వద్ద పర్యవేక్షణ చేస్తున్న పోలీసులు, రెవెన్యూ అధికారులకు మామూళ్లు ముట్టచెప్పి ఉదయం నుంచి సాయంత్రం వరకు పదుల సంఖ్యలో ట్రిప్పుల ఇసుకను రవాణా చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. సెలవు రోజుల్లో పగటి పూట తెలకపల్లికి బహిరంగంగా ఇసుకను రవాణా చేస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారని వాపోతున్నారు. డంపింగ్‌ యార్డులు, శ్మశానవాటికలు, రైతు వేదికల నిర్మాణాలు దాదాపు పూర్తయ్యాయి. నిర్మాణాలు ఆగిన వాటికీ ఇసుక నిల్వలు ఉన్నాయి. వాటి పేరు చెప్పుకుని ఇంకా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. అధికారులు ఇళ్లు నిర్మించుకుంటున్న వారికి అనుముతులు ఇవ్వకుండా కేవలం ఇసుక వ్యాపారులకు మాత్రమే వందల సంఖ్యలో ట్రాక్టర్‌  ట్రిప్పులకు అనుమతులు ఇవ్వడం వెనుక ఆంతర్యమేంటన్న చర్చ నడుస్తోంది. 


అక్రమంగా డంపులు

మండలంలోని పెద్దాపూర్‌, లక్మాపూర్‌ గ్రామాల సమీపంలో గల వ్యవసాయ పొలాల్లో ఇసుకను అక్ర మంగా డంప్‌ చేస్తున్నారు. అక్కడి నుంచి రాత్రి వేళ్లల్లో అచ్చంపేట, తెలకపల్లి తదితర ప్రాంతాలకు తరలించి, సొమ్ము చేసుకుంటున్నా రు. విషయం తెలిసినాఅధికా రులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నామమాత్రం గా తనిఖీలు చేస్తున్నారని అంటు న్నారు.

Updated Date - 2020-12-29T03:31:47+05:30 IST