ప్రజాప్రతినిధులు భరోసా కల్పించాలి

ABN , First Publish Date - 2020-12-18T04:29:35+05:30 IST

ఎస్సీ, ఎస్టీలు ఆత్మగౌరవంతో బతికేలా ప్రజాప్రతినిధులు భరోసా కల్పించాలని ఎస్సీఎస్టీ కమిషన్‌ సభ్యుడు చిలక మర్రి నర్సింహ అన్నారు.

ప్రజాప్రతినిధులు భరోసా కల్పించాలి
అవగాహనా సదస్సులో మాట్లాడుతున్న చిలకమర్రి నర్సింహ

- ఎస్సీ ఎస్టీ కమిషన్‌ సభ్యుడు చిలకమర్రి నర్సింహ

    గద్వాల రూరల్‌, డిసెంబరు 17 : ఎస్సీ, ఎస్టీలు ఆత్మగౌరవంతో బతికేలా ప్రజాప్రతినిధులు భరోసా కల్పించాలని ఎస్సీఎస్టీ కమిషన్‌ సభ్యుడు చిలక మర్రి నర్సింహ అన్నారు. జమ్మిచేడ్‌ సమీపంలో ఉన్న సీఎన్‌జీ ఫంక్షన్‌ హాల్‌లో గురువారం నిర్వహించిన అవగాహనా సదస్సులో ఆయన మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చి ఎన్నో ఏళ్లు అవుతున్నప్పటికీ నేటి ఎస్సీఎస్టీలు అణచివేతకు గురి అవుతున్నారని అన్నారు. ఆర్థికంగా, రాజకీయంగా బలోపేతం కావాలంటే చదువు అవసరమన్నారు. ఎస్సీఎస్టీ చట్టం వజ్రాయుధం లాంటిదని, వివక్షకు గురైనపుడు దానిని ఉపయోగించాలన్నారు. గుడి, బడితో పాటు అన్నింటిలోనూ వారికి సమాన గౌరవం కల్పించాలని సూచించారు. ఇందుకోసం ప్రతి నెలా పౌరహక్కుల దినోత్సవం నిర్వహించి ప్రజలలో అవగాహన కల్పించాలన్నారు. అంతకు ముందు జడ్పీ చైర్‌ పర్సన్‌ సరిత మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎస్సీఎస్టీల అభివృద్ధికి కృషి చేస్తున్నదని అన్నారు. ప్రత్యేక బడ్జెట్‌తో పాటు అన్ని పథకాలలో వారికి పెద్దపీట వేస్తున్నదని వివరించారు. ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌ మాట్లాడుతూ జోగుళాంబ గద్వాల జిల్లాలో అన్ని వర్గాలవారు కలిసి మెలసి జీవిస్తున్నారని వివరించారు. జిల్లాలో పౌర హక్కుల దినోత్సవంతో పాటు కళాజాత బృందాలతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ సరోజమ్మ, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రామేశ్వరి, ఆర్డీఓ రాములు, ఎస్సీఎస్టీ అభివృద్ది శాఖ అధికారి సరోజమ్మ, జడ్పీ సీఈవో ముసాయిదా బేగం, డీపీవో కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


అలంపూర్‌ ఆలయాల సందర్శన

    అలంపూర్‌ : అలంపూర్‌ జోగుళాంబదేవి, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యుడు నర్సింహ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. గురువారం ఉదయం ఆలయానికి వచ్చిన ఆయనకు ఈఓ ప్రేమ్‌కుమార్‌, ప్రధాన అర్చకుడు ఆనంద్‌శర్మ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆయన వెంట అలంపూర్‌ తహసీల్దార్‌ మదన్‌మోహన్‌, చైర్మన్‌ రవిప్రకాష్‌గౌడ్‌, ఆర్‌ఐకరీం, వీఆర్వో వెంకట్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-12-18T04:29:35+05:30 IST