గూడు..గోడు

ABN , First Publish Date - 2020-10-31T07:40:50+05:30 IST

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో మెజారిటీ ప్రజలు ఇంకా మట్టి ఇళ్లల్లోనే జీవనం కొనసాగిస్తున్నారు. దాదాపు 50 ఏళ్ల నుంచి 80 ఏళ్ల కిందట నిర్మించిన ఇళ్లలో కూడా కొందరు నివాసం ఉంటున్నారు.

గూడు..గోడు

పాత మట్టి మిద్దెల్లోనే నివాసముంటున్న గ్రామీణులు

ఇటీవల భారీ వర్షాలకు కూలిపోయిన పైకప్పులు

ఉమ్మడి పాలమూరు జిల్లాలో దెబ్బతిన్న 2,793 ఇళ్లు

బుద్ధారం గ్రామంలో మట్టి ఇల్లు కూలి ఐదుగురి ఐదుర్మరణం

వర్షం వస్తే బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతన్న వైనం

పాడుపడ్డ ఇళ్లను ఖాళీ చేయిస్తే నష్ట నివారణకు అవకాశం


ఆ ఇళ్లన్నీ దాదాపు అర్ధ శతాబ్దం కిందట కట్టినవి.. అన్నీ కూడా పల్లె ప్రాంతాల్లోనివి.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చాలా వరకు దెబ్బతిన్నాయి.. వందల సంఖ్యలో ఇళ్ల పైకప్పులు కూలిపోయాయి.. ప్రాణనష్టమూ జరిగింది.. అయినా, ఇళ్లు కట్టుకునే స్థోమత లేక బిక్కుబిక్కుమంటూ ఆ ఇళ్లలోనే కాలం గడుపుతున్నారు, గ్రామీణులు.. ప్రతీ ఏటా కురుస్తున్న వర్షాలకు ఇళ్లు దెబ్బతింటున్నా, తాత్కాలిక మరమ్మతులు చేసుకొని అందులోనే నివాసముంటున్నారు.. రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో పాడుపడి ఉండి, ఆ ఇంట్లో ఎవరూ నివాసముండకపోతే వాటిని తొలగించింది.. కానీ, శిథిలమైన ఇళ్ల గుర్తింపును చేపట్టి, వారికి ప్రత్యామ్నాయ మార్గాలను చూపెట్టడంలో విఫలమైంది.. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పథకం ఇంకా నత్తనడకనే సాగుతుండగా, కొత్త ఇళ్ల నిర్మాణం అనేది ఇంకా గ్రామీణ ప్రాంతాల వారికి అందని ద్రాక్షగానే మిగులుతోంది..


వనపర్తి, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి పాలమూరు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో మెజారిటీ ప్రజలు ఇంకా మట్టి ఇళ్లల్లోనే జీవనం కొనసాగిస్తున్నారు. దాదాపు 50 ఏళ్ల నుంచి 80 ఏళ్ల కిందట నిర్మించిన ఇళ్లలో కూడా కొందరు నివాసం ఉంటున్నారు. వర్షాలకు ఈ ఇళ్లు దెబ్బతిని, ఇళ్లల్లోకి నీళ్లు వచ్చినా తాత్కాళిక మరమ్మతులు చేసుకోవడమో, టార్ఫాలిన్‌ కవర్లు కప్పుకోవడమో చేస్తున్నారు. అయితే, ఈ ఏడాది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. దాదాపు మూడు దశాబ్దాల కిందట కురిసిన వానలు, ఈ సంవత్సరం పడ్డాయి. ఈ వర్షాలకు నాగర్‌కర్నూలు, వనపర్తి, మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాల్లో భారీగా ఇళ్లు కూలిపోయాయి. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 1,023 ఇళ్లు దెబ్బతినగా, అందులో 145 ఇళ్లు పూర్తిగా, 878 ఇళ్లు పాక్షికంగా, నారాయణపేట జిల్లాలో 1,277 ఇళ్లు దెబ్బతినగా, అందులో 51 ఇళ్లు పూర్తిగా, 1,226 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వనపర్తి జిల్లాలో 243 ఇళ్లు ఈ వర్షాల ధాటికి కూలిపోయాయి. ఇందులో ఎక్కువగా గోపాల్‌పేట ఉమ్మడి మండలంలో 63 ఇళ్లు కూలిపోయాయి. నాగర్‌కర్నూలు, వనపర్తి, నారాయణపేట జిల్లాలో ఈ ప్రభావం మరీ ఎక్కువగా ఉంది. ప్రాణనష్టం కూడా ఈ మూడు జిల్లాల్లో బాగా జరిగింది. విపత్తు నిర్వహణ కింద ప్రాణ నష్టం జరిగిన కుటుంబాలకు పరిహారం వచ్చే అవకాశం ఉండగా, ఆస్తుల నష్టంపై స్పష్టత లేదు. 


కలిచి వేసిన బుద్దారం దుర్ఘటన

ఇటీవల వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం బుద్దారంలో జరిగిన దుర్ఘటన అందరినీ కలిచి వేసింది. తండ్రి సంవత్సరీకం కోసం వచ్చిన కుటుంబ సభ్యులు ఇంట్లో నిద్రిస్తుండగా, మట్టి మిద్దె కూలిపోవడంతో ఐదుగురు దుర్మరణం చెందారు. ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. దుర్ఘటన జరిగిన ఇల్లు దాదాపు 80 ఏళ్ల కిందట నిర్మించింది కావడం, ఇటీవల కురిసిన వర్షాలకు తీవ్రంగా దెబ్బతింది. గతంలోనే ఇల్లు దెబ్బతినగా, ప్రమాదం జరిగిన గదిపైన పైకప్పు ఉరవకుండా టార్ఫాలిన్‌ కవర్‌ను కప్పారు. కానీ, ఇవేమి ఆ కుటుంబ సభ్యులను కాపాడలేదు.


నాగర్‌కర్నూలు జిల్లాలో కూడా ఇటీవల ఇల్లు కూలడంతో ఇద్దరు మరణించారు. నారాయణపేట జిల్లా నర్వ మండలం కన్మనూరు గ్రామానికి చెందిన 63 ఏళ్ల వృద్ధురాలితోపాటు ధన్వాడ మండలంలో మూడేళ్ల బాలుడు మట్టి మిద్దె కూలిపోయి మృతి చెందాడు. ఇలా ప్రతీ ఏటా మట్టి ఇళ్లు కూలిపోయి ప్రాణనష్టం సంభవిస్తూనే ఉంది. కానీ, నష్టం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై శ్రద్ధ కరువవుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణాలను వేగం పెంచాల్సిన అవసరం ఉన్నది. ముందుగా పూర్తిగా ఇళ్లు లేని పేదలకు ఇచ్చిన తర్వాత, శిథిలావస్థలో ఉన్న ఇళ్లు ఉన్న వారికి రెండో విడతలో ఇవ్వాలి.

Read more