బండిపోయే దారేది
ABN , First Publish Date - 2020-10-03T09:43:07+05:30 IST
భారీ వర్షాలకు రోడ్లు దెబ్బతింటున్నాయి. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబరులలో కురిసిన వానలకు ఉమ్మడి ..

భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు
వరద ఉధృతికి కోతకు గురైన రహదారులు
గతుకుల రోడ్లపై ప్రయాణానికి ఇబ్బందులు
పునరుద్ధరణకు రూ.48.22 కోట్లతో అధికారుల ప్రతిపాదనలు
నేటికీ నిధులు విడుదల చేయని సర్కారు
ఇంకా టెండర్ల దశను దాటని గతేడాది పనులు
రోడ్ల నిర్వహణకూ నిధులు కరువు
రోడ్లు బెడ్లను తలపిస్తున్నాయి.. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కురిసిన భారీ వర్షాలకు రంపంతో కోసిన తరహాలో కోతకు గురయ్యాయి.. మోకాళ్ల లోతు గుంతలు ఏర్పడి, వాటిలో చెరువులను తలపించేలా నీళ్లు నిల్వ ఉంటున్నాయి.. ఈ మార్గాల మీదుగా ప్రయాణం చేసిన వారంతా నడుము నొప్పులతో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.. వీటి పునరుద్ధరణకు ఆర్‌అండ్‌బీ శాఖ ప్యాకేజీల వారీగా పనులను విభజంచి రూ.48.22. కోట్లతో ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు సమర్పించింది.. అయినా, నేటి వరకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంలో తీవ్ర జాప్యం చేస్తోంది.. దీనికితోడు గతేడాది మంజూరైన పనులకు సంబంధించి కాంట్రాక్టర్లు చేసిన పనులకు ఇంత వరకు బిల్లుల చెల్లింపులు చేయకపోవడంతో, ఆ పనులు నత్తకడకను తలపిస్తున్నాయి..
మహబూబ్‌నగర్, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : భారీ వర్షాలకు రోడ్లు దెబ్బతింటున్నాయి. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబరులలో కురిసిన వానలకు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల రోడ్లపై మోకాళ్లలోతు గుంతలు ఏర్పడ్డాయి. మరికొన్ని చోట్ల నీటి ఉధృతికి కోతకు గురయ్యాయి. వీటిని పునరుద్ధరించేందుకు ఆర్‌అండ్‌బీ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా, ఇప్పటి వరకు మోక్షం లభించలేదు. అత్యవసర, తప్పనిసరిగా చేయాల్సిన పనులకు సంబంధించి నామినేషన్లపై పనులు చేయించారే తప్ప, వాటికి కూడా బిల్లులు రాలేదు. గతేడాది మంజూరైన పనులకు సంబంధించి కూడా ఇంకా టెండర్ల దశ దాటలేదు.
ఇవి దెబ్బతిన్న రోడ్లు
ఉమ్మడి జిల్లాలో మండల కేంద్రాల నుంచి గ్రామాలకు వెళ్లే రోడ్లు నాలుగేళ్లుగా మరమ్మతులకు నోచుకోవడం లేదు. దీనికితోడు ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు గుంతలమయంగా మారి, కనీసం వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. అందులో భూత్పూర్ నుంచి నాగర్‌కర్నూల్ రోడ్డు, జడ్చర్ల నుంచి వనపర్తి వెళ్లే ప్రధాన రహదారి, బాలానగర్ నుంచి కొందుర్గు మీదుగా మహబూబ్‌నగర్ వచ్చే రోడ్డు, మహబూబ్‌నగర్-గండీడ్-కోస్గి-తాండూరు రోడ్డు, నారాయణపేట నుంచి దామరగిద్ద రోడ్డు, మరికల్ నుంచి ధన్వాడ-నారాయణపేట రోడ్డు, మక్తల్-నారాయణపేట రోడ్డు, నారాయణపేట-జలాల్‌పూర్ రోడ్డు, మరికల్-నర్వ రహదారి, నాగర్‌కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి-తాడూరు-నాగర్‌కర్నూల్ రోడ్డు, తెల్కపల్లి-లింగాల రోడ్డు, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాలోని పలు రహదారులు వాహనాలు నడిచే పరిస్థితి లేకుండా దెబ్బతిన్నాయి.
ప్యాకేజీలుగా విభజించి ప్రతిపాదనలు
ఆగస్టు, సెప్టెంబరులో కురిసిన వానలకు దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు, బ్రిడ్జిలను పునరుద్ధరించేందుకు అధికారులు 164 ప్యాకేజీలుగా విభజించి రూ.48.22 కోట్లతో ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపారు. వీటిలో ఆగస్టులో వచ్చిన వానలకు దెబ్బతిన్న రోడ్లకు గాను 111 ప్యాకేజీల్లో రూ.20.04 కోట్ల ప్రతిపాదనలు పంపగా, ఇప్పటి వరకు నిఽధులు మంజూరు కాలేదు. తాజాగా వచ్చిన వానలకు మరో 53 ప్యాకేజీలకు గాను రూ.28.18 కోట్ల ప్రతిపాదనలు సమర్పించారు.
ముందుకు రాని కాంట్రాక్టర్లు
2019-20లో ఉమ్మడి జిల్లాలో రోడ్లు, బ్రిడ్జిల మరమ్మతులు, పునరుద్ధరణకు 28 ప్యాకేజీల్లో రూ.43.32 కోట్ల నిదులు మంజూరు చేశారు. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతుండడంతో టెండర్లు వేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. 28 ప్యాకేజీల్లో పనులు మంజూరైతే వీటిల్లో 15 పనులకు టెండర్లు ఖరారవగా, 9 పనులు మొదలయ్యాయి. మిగిలినవి ఇంకా మొదలు కాలేదు.
అదనపు నిధులకు బ్రేక్
జిల్లాల్లో విస్తరించిన అంతర్గత రోడ్ల నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధుల్వివడం మానేసింది. తాత్కాలిక మరమ్మతుల విధానాన్ని తొలగించి, రోడ్లు దెబ్బతింటే శాశ్వత మరమ్మతులే చేపడుతోంది. రోడ్డు పని చేసిన కాంట్రాక్టరే కొంత కాలం నిర్వహణ బాధ్యతలు ఉండటంతో వారితో పనులు చేయించడమే తప్ప అదనపు నిధులిచ్చే పరస్థితి లేకుండాపోయింది. 2015లో ఉమ్మడి జిల్లాకు మంజూరైన దాదాపు రూ.వెయ్యి కోట్ల నిధులతో మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు సింగిల్ లైన్ రోడ్లను డబుల్ లైన్లుగా మార్చడం, జిల్లా కేంద్రాల మధ్య రోడ్లను విస్తరించడం, అన్ని రోడ్లను పునరుద్ధరించడంతో పాటు, పలు హైలెవల్ వంతెనలను చేపట్టారు. ఆ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
అడుగుకో గుంత
మహబూబ్‌నగర్ నుంచి హన్వాడ, గండీడ్, కోస్గి, కొడంగల్ మీదుగా తాండూరు వరకు వెళ్లే 75 కిలోమీటర్ల ప్రధాన రహదారి అడుగడుగునా గుంతలమయంగా మారింది. వర్షంతో రోడ్డంతా నీరు నిండిపోయి వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. పలుచోట్ల రోడ్డుకు అంచుల వెంబడి కట్టలు కోతకు గురయ్యాయి. ఈ రోడ్డుని ఫోర్‌వేగా మార్చి జాతీయ రహదారుల మధ్య అనుసంధానం చేసేందుకు ప్రతిపాదించిన తర్వాత ఇతర మరమ్మతులు చేయడం వదిలేయడం, జాతీయ రహదారి అనుసంధాన పనులు జరగకపోవడంతో మొత్తంగా ఈ రోడ్డు మీద ప్రయాణించాలంటేనే వాహనాదారులు భయపడే పరిస్థితి ఏర్పడింది.