రియల్‌.. ఫియర్‌

ABN , First Publish Date - 2020-12-12T03:24:11+05:30 IST

రియల్‌ ఎస్టేట్‌ రంగాన్ని కరోనా కోలుకోలేని దెబ్బతీసింది.

రియల్‌.. ఫియర్‌
వనపర్తి పట్టణ సమీపంలో వేసిన వెంచర్‌

కరోనా ప్రభావంతో రియల్‌ ఎస్టేట్‌ రంగం కుదేలు

ఉమ్మడి జిల్లాలో తీవ్రంగా నష్టపోతున్న వ్యాపారులు

కొనుగోళ్లు, అమ్మకాలు లేకపోవడం వల్ల సామాన్యులకూ ఇబ్బందులు

ఏజెంట్లకు ఏడాది నుంచి ఉపాధి కరువు

14 నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ర్టేషన్లతో ఊరట 


రియల్‌ ఎస్టేట్‌ రంగాన్ని కరోనా కోలుకోలేని దెబ్బతీసింది. ఈ ఏడాది ప్రారంభంలోనే వైరస్‌ ప్రభావం మొదలు కావడంతో ఈ రంగంపై ఆధారపడిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరోనా సడలింపులు ప్రారంభమైన తర్వాతనైనా ప్లాట్ల కొనుగోళ్లు, అమ్మకాలు ఊపందుకుంటాయని వ్యాపారులు భావించగా, మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ జీవో తీసుకువచ్చి వ్యవసాయేతర భూముల రిజిస్ర్టేషన్లను నిలిపేసింది. దాంతో కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన వ్యాపారులు ఇటు ఎల్‌ఆర్‌ఎస్‌, అటు వ్యవసాయేతర భూముల రిజిస్ర్టేషన్లలో నెలకొన్న అనిశ్చితి వల్ల తీవ్ర నష్టాలకు గురయ్యారు. ప్రభుత్వం తాజాగా ఈ నెల 14 నుంచి పాత పద్ధతిలోనే రిజిస్ర్టేషన్లు చేయనుండటంతో కొంత ఊరట లభించనుంది.

- ఆంధ్రజ్యోతి, వనపర్తి


కొవిడ్‌-19 రియల్‌ వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపింది. ఉమ్మడి జిల్లాలో 19 మునిసిపాలిటీలు ఉన్నాయి. జాతీయ రహదారిపై ఉన్న మునిసిపాలి టీలతోపాటు ఇతర వాటిలోనూ రియల్‌ వ్యాపారానికి డిమాండ్‌ భారీగానే ఉంది. ఈ రంగంపై ఆధారపడి 20 నుంచి 30 వేల మంది ఉపాధి పొందుతున్నారు. ఇందులో వ్యాపారులు కొందరు మాత్రమే కాగా, మిగతావారంతా ఏజెంట్లుగా పని చేస్తున్నారు. రియల్‌ రంగం కుదేలు కావడంతో వారంతా ఉపాధి కోల్పోయారు.


సామాన్యులూ బాధితులే..

కరోనా, ఎల్‌ఆర్‌ఎస్‌లు కేవలం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులనే కాకుండా సామాన్యులనూ ఇబ్బందులు పెడుతున్నాయి. కొన్నేళ్ల కిందట సామాన్యుల దగ్గర డబ్బులు నిల్వ ఉంటే.. బ్యాంకుల్లో డిపాజిట్లు చేయడం, ఇతరులకు వడ్డీకి అప్పుగా ఇవ్వడం వంటి మార్గాలను ఆశ్రయించేవారు. రియల్‌ ఎస్టేట్‌ రంగం పుంజుకున్న తర్వాత ప్లాట్లపై పెట్టుబడి పెడుతున్నారు. భవిష్యత్‌లో వాటికి మంచి ధర వస్తే అమ్మి పిల్లలకు చదువు చెప్పించడం, వివాహాలు చేయడం, కొత్తగా ఇళ్లు కట్టుకోవడం వంటివి చేయొచ్చనే ధీమాతో ఉండేవారు. అయితే కరోనా ప్రారంభమైన తర్వాత చదువులు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. చదువు కోసం భూమిపై పెట్టుబడి పెట్టిన వారికి ప్రస్తుతం ఇబ్బందులు ఏమీ లేకపోయినా, ఇళ్లు కట్టుకోవాలని, పిల్లల వివాహాలు చేయాలని పెట్టుబడి పెట్టిన వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పెట్టుబడి పెట్టిన సదరు భూములను అమ్ముదామంటే రిజిస్ర్టేషన్లు నిలిచిపోవడం, ఎల్‌ఆర్‌ఎస్‌కు మరింత సొమ్ము చెల్లించాల్సిన పరిస్థితులు ఏర్పడటంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ఎలాగోలా అప్పులు తెచ్చి పెళ్లిళ్లు చేస్తున్నా ప్లాట్ల అమ్మకంపై వారిలో భయం ఉండేది. అయితే ప్రభుత్వం ఈ నెల 14 నుంచి పాత పద్ధతిలోనే రిజిస్ర్టేషన్లు చేయనున్నట్లు చెప్పడంతో ఊరట లభించనుంది.


అప్పులు తీర్చే మార్గమేది?

సాధారణంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసేవారు భూమి అమ్మిన రైతుకు ముందుగానే పూర్తి స్థాయిలో పేమెంట్‌ చేయరు. కొంత మొత్తం చెల్లించి, అగ్రిమెంట్‌ చేసుకుంటారు. అందులో వెంచర్‌ వేసి ప్లాట్లు విక్రయించగా వస్తున్న మొత్తాన్ని విడతలవారీగా చెల్లించి, పూర్తి చెల్లింపు తర్వాత రిజిస్ర్టేషన్లు చేసుకుంటారు. ముందుగా అప్పులు తెచ్చి, భూమిపై పెట్టుబడి పెడతారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే పెట్టుబడి పోను మంచి లాభాలు వస్తాయి. అయితే కరోనాకు ముందు ఇదే పద్ధతిలో అగ్రిమెంట్లు చేసుకున్న వారు కరోనా తర్వాత ప్లాట్లు అమ్ముడు పోకపోవడంతో డబ్బులు చెల్లించలేక పోతున్నారు. భూమి అమ్మిన వారి నుంచి ఒత్తిడి వస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు. తెచ్చిన అప్పులకు వడ్డీ అంతకంతకూ పెరుగుతుండటంతో మదనపడుతున్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల వద్ద కొందరు ఏజెంట్లుగా పని చేస్తుంటారు. వారు ప్లాట్లను అమ్మిస్తుంటారు. కొనుగోలు చేసేవారు లేక ఆ ఏజెంట్ల పరిస్థితి కూడా ఆగమ్యగోచరంగా ఉంది. అలాగే ప్లాట్లు అగ్రిమెంట్లు చేయించి, విక్రయిం చడం ద్వారా కమీషన్లు పొందే వారికీ కరోనా, ఎల్‌ఆర్‌ఎస్‌ వల్ల ఉపాధి కరువైంది. 


రియల్‌ ఎస్టేట్‌ కుదేలు

ప్రభుత్వం అనుమతులు లేని లే అవుట్లు, ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీంను మళ్లీ ప్రారంభించింది. అంతకు ముందే వ్యాపారం అంతంత మాత్రంగానే ఉంది. 2020 వేసవిలో అమ్మకాలు బాగుం టాయని అందరం ఆశించాం. అప్పులు తెచ్చి వెం చర్లపై పెట్టుబడులు పెట్టాం. కరోనా కార ణంగా రియల్‌ వ్యాపారం కుదేలైంది. సామాన్యులు కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. అప్పులపై వడ్డీలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌పై స్పష్టత ఇవ్వాలి.

- సతీష్‌, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి

Updated Date - 2020-12-12T03:24:11+05:30 IST