‘రియల్‌’ గద్దలు

ABN , First Publish Date - 2020-09-06T10:13:13+05:30 IST

‘రియల్‌’ గద్దలు పేట్రేగిపోతున్నాయి.. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు అక్కడ వాలిపోతున్నాయి.. ప్రభుత్వ భూమి అయినా సరే కబ్జా చేసేస్తున్నాయి...

‘రియల్‌’ గద్దలు

యథేచ్ఛగా జరుగుతున్న కబ్జాలు

మితిమీరిపోతున్న రియల్‌ మాఫియా ఆగడాలు

ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలపై స్థలంపై కన్నేసిన అక్రమార్కులు

ఇప్పటికే ప్లాట్లుగా చేసి విక్రయించిన ఘనులు

ఎమ్మెల్యే ఆదేశించినా స్పందించని రెవెన్యూ అధికారులు

మాఫియా ఒత్తిళ్లతో అర్ధాంతరంగా ఆగిపోతున్న సర్వేలు

నిద్రావస్థలో జిల్లా ఉన్నతస్థాయి అధికారులు


‘రియల్‌’ గద్దలు పేట్రేగిపోతున్నాయి.. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు అక్కడ వాలిపోతున్నాయి.. ప్రభుత్వ భూమి అయినా సరే కబ్జా చేసేస్తున్నాయి.. ఇప్పటికే చెరువుల శిఖం భూములు, కుంటలను మింగేసిన ఈ రాబందులు, తాజాగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు సంబంధించిన స్థలాన్ని ఖతం చేస్తున్నాయి.. ఏకంగా ప్లాట్లు చేసి ఇప్పటికే విక్రయించిగా, అందులో ఓ షాపింగ్‌ కాంప్లెక్స్‌ స్థలం విషయంలో రెండు వర్గాల మధ్య జరిగిన వివాదంతో కబ్జా బాగోతం బయట పడింది.. ఉన్నతాధికారులందరూ నివసించే జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలోనే ఇలా యథేచ్ఛగా కబ్జాలు జరుగుతున్నా, అధికారులు మీనవేషాలు లెక్కిస్తుండటంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి..


నాగర్‌కర్నూల్‌, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి) : రియల్‌ మాఫియా కబ్జాలు మితిమీరిపోతున్నాయి. చెరువులు, కుంటలకు సంబంధించిన భూములను ఆక్రమించి వాటిని ప్లాట్లుగా విక్రయిస్తున్న మాఫియా ఆగడాలపై ఇప్పటికే విమర్శలు వెలువెత్తుతుండగా, తాజాగా నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని శ్రీపురం రోడ్డు ఈద్గా సమీపంలో ఉన్న ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల స్థలాన్ని ఆక్రమించుకుంటోంది.


జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నిర్మాణం కోసం ప్రభుత్వం రెండు దశల్లో 5.11 ఎకరాల స్థలాన్ని రెవెన్యూ అధికారులు కేటాయించారు. ఈద్గా పక్కన భవన నిర్మాణాన్ని పూర్తి చేసి గతేడాది ప్రారంభించారు. అయితే, ఈ కళాశాలకు ప్రభుత్వం కేటాయించిన స్థలానికి ఆనుకొని ప్రైవేట్‌ భూములను కొనుగోలు చేసినా కొంత మంది రియల్‌ వ్యాపారులు డిగ్రీ కళాశాలకు సంబంధించిన స్థలంలో కూడా ప్లాట్లు చేసి విక్రయిస్తుండడంతో ఈ బండారం బయట పడింది. ఇటీవల దీని పక్కనే ఉన్న భూమికి సంబంధించి షాపింగ్‌ కాంప్లెక్స్‌ స్థలం తమదంటే తమదంటూ రెండు వర్గాలకు చెందిన కొందరు గొడవకు దిగి పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడంతో కళాశాల స్థలం కబ్జాకు గురవుతున్న విషయం బయటకు పొక్కింది.


నాగనూల్‌ గ్రామ శివారులో పుట్నాల కుంటను ధ్వంసం చేసిన నేపథ్యంలో దీన్ని సందర్శించిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పుట్నాల కుంటతోపాటు సద్దాల్‌సాబ్‌ కుంట, మహిళా డిగ్రీ కళాశాల స్థలాన్ని కూడా సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని చాలా స్పష్టంగా పేర్కొన్నా, గడిచిన 20 రోజుల నుంచి అధికారులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. సర్వే చేస్తున్నట్లు వాతావరణాన్ని కల్పించడం, రియల్‌ మాఫియా ఒత్తిళ్లతో మధ్యలోనే ఆపేసి చేతులు దులుపుకోవడం పరిపాటిగా మారిందనే ఆరోపణలున్నాయి. ఈ వాదనకు బలం చేకూర్చే విధంగా కళాశాలకు సంబంధించిన స్థలం హద్దులు నిర్ణయించే విషయంలో చిన్నచిన్న పొదలున్నాయనే కారణంగా సర్వే నిలిపివేయడం, పుట్నాల కుంట విషయంలో కూడా ఇదే పరిస్థితి కన్పించడం గమనార్హం. 


సెంటు భూమిని కూడా కబ్జా కానీవ్వం

నాగర్‌కర్నూల్‌ చుట్టు పక్కల ప్రాంతాల్లో సెంటు ప్రభుత్వ భూమి కూడా కబ్జా కానివ్వకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఆస్తులను కబ్జాకు పాల్పడేందుకు సొంత తమ్ముడు ప్రయత్నించినా ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు. శనివారం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను సందర్శించిన ఆయన, 5.11 ఎకరాల భూమికి సంబంధించిన హద్దులు వెంటనే నిర్ణయించాలని అధికారులను ఆదేశించారు. కొన్ని పత్రికలు పని కట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నాయని, ఆక్రమణలను వెలుగులోకి తీసుకొస్తే సంతోషిస్తామని చెప్పారు. కేసరి సముద్రం చెరువు ఆక్రమణకు సంబంధించిన అంశాన్ని కావాలని రాజకీయం చేస్తున్నారని, ఫుల ట్యాంక్‌ లెవల్‌లో నీళ్లుంటాయనే విషయం పరిగణనలోకి తీసుకోకుండా, లేనిపోని ఆరోపణలు చేయడం సహేతుకం కాదని ఆయన చెప్పారు. ఎమ్మెల్యే వెంట డీసీసీబీ డైరెక్టర్‌ జక్కా రఘునందన్‌రెడ్డి, మార్కెట్‌ చైర్మన్‌ దొడ్ల ఈశ్వర్‌రెడ్డి ఉన్నారు.

Updated Date - 2020-09-06T10:13:13+05:30 IST