యాసంగిలో 3.97 లక్షల ఎకరాలకు నీరు
ABN , First Publish Date - 2020-12-16T03:54:52+05:30 IST
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల ద్వారా యాసంగి సీజన్‌లో 3.97 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని సాగు నీటి సలహా బోర్డు సమావేశం తీర్మానించింది.
సాగునీటి సలహా బోర్డు సమావేశంలో తీర్మానం
వనపర్తి, డిసెంబరు 15, (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల ద్వారా యాసంగి సీజన్‌లో 3.97 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని సాగు నీటి సలహా బోర్డు సమావేశం తీర్మానించింది. వనపర్తి జిల్లా కేంద్రంలో ఉమ్మడి జిల్లా సాగునీటి సలహా బోర్డు సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో 2020-21 రబీ సీజన్‌లో జూరాల ఎడమ కాలువ కింద డిస్ర్టిబ్యూటరీ 20 వరకు, కుడి కాలువ కింద డిస్ర్టిబ్యూటరీ 32 వరకు ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో సాగునీరు అందించాలని నిర్ణయించా రు. జూరాల కింద 32,500 ఎకరాలు, ఆర్డీఎస్ కింద 20,000, నెట్టెం పాడు ఎత్తిపోతల కింద 70,000, భీమా కింద 23,650, కోయిల్‌సాగర్ కింద 12,000, కేఎల్‌ఐ కింద 2,78,864 ఎకరాలకు నీరందించాలని తీర్మా నించారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరం సమృద్ధిగా వర్షాలు కురిసినందున ప్రాజెక్టుల్లో పుష్కలంగా ఉన్న నీటిని సహేతుకంగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. వేసవిలో తాగునీటి అవసరాల దృష్ట్యా ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో సాగునీటిని వాడుకోవాలని తెలిపారు. రాబోయే రోజుల్లో జూరాల ఎడమ కాలువ డి-20 తర్వాత సింగోటం, గోపల్‌దిన్నె లింక్ ద్వారా చివరి ఆయకట్టుకు నీరందిం చేందుకు అధికారులు పరిశీలించాలని కోరారు. కల్వకుర్తి ఆయకట్టుకు ఎలాంటి ఇబ్బంది లేదని, నీరు మిగులు ఉన్నందున జూరాల, బీమా ఆయకట్టుకు వాడుకునేందుకు ప్రణాళికలు చేయాలని సూచించారు. అన్ని ప్రాజెక్టుల ఇంజనీర్లు, ఈఈలు, రైతుబంధు సమితి అధ్యక్షులు, కో ఆర్డినేటర్ల సహకారంతో నీటి విడుదలను పర్యవేక్షించాలని చెప్పారు. జూరాల ప్రాజెక్టుకు సమాంతరంగా 4 నుంచి 5 టీఎంసీల రిజర్వాయర్ నిర్మాణానికి గతంలోనే ప్రతిపాదనలు పంపామని, మళ్లీ లేఖ రాస్తామని అన్నారు.
నీటిని సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి శ్రీనివాస్‌గౌడ్
వ్యవసాయ, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో పని చేసి రైతు లు నీటిని సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలి. ఒక వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసి రైతులకు ఎప్పటికప్పుడు సాగునీటి వివరాలు వెల్లడించాలి. ఆయా ప్రాజెక్టుల కింద మార్చి 15 తర్వాత పనులు ప్రారంభించాలి. పాలమూరు-రంగారెడ్డి పనులు వేగవంతం చేస్తాం.
నీరందించే బాధ్యత ఇంజనీర్లదే: ఎంపీ రాములు
అచ్చంపేట నియోజకవర్గంలో డీ 30 పెంపుపై పనులు త్వరగా చేప ట్టాలి. ఉప్పునుంతల, బల్మూరు మండలాలకు నీరిచ్చేందుకు ప్రభుత్వాన్ని కోరతాం.
ఎత్తు పెంచాలి: మహబూబ్‌నగర్ జడ్పీ చైర్‌పర్సన్
జూరాల, కోయిల్‌సాగర్ ఎత్తు పెంచడం వల్ల కోయిల్‌సాగర్ కింద అదనంగా 5 గ్రామాలకు నీరు అందుతుంది.
పనులు పూర్తి చేయాలి: ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి
కేఎల్‌ఐ కింద జంగారెడ్డిపల్లి నుంచి నాగిళ్ల వెళ్లే కాలువ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. వాటిని త్వరితగతిన పూర్తి చేయాలి.
గద్వాలతో సమానంగా నీరివ్వాలి: ఎమ్మెల్యే అబ్రహాం
జూరాల కుడి కాలువ కింద గద్వాలతోపాటు అలంపూర్ నియోజకవర్గానికి సమానంగా నీరివ్వాలి. నెట్టెంపాడు కింద కూడా అలంపూర్ నియోజకవర్గానికి ఎక్కువ నీరు ఇవ్వాలి
ఆలస్యంగా వేసిన ఖరీఫ్ పంటలకు నీరివ్వాలి: ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి
జూరాల ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీరు నిల్వ ఉన్నందున చిన్నంబావి, వీపనగండ్ల మండలాల్లో ఆలస్యంగా వేసిన ఖరీఫ్ పంటలకు నీరివ్వాలి.
కాల్వ పనులు పూర్తి చేయాలి: ఎమ్మెల్యే జైపాల్ యాదవ్
కేఎల్‌ఐ కింద అసంపూర్తిగా ఉన్న జంగారెడ్డిపల్లి నుంచి నాగిళ్ల వరకు 60 కిలో మీటర్ల కాలువ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి. గోకారం చెరువు రిజర్వాయర్ పనులు కూడా పూర్తి చేయాలి.
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి: ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు
కేఎల్‌ఐ ప్యాకేజీ 30 కింద కాలువ పొడగింపు పనుల విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. సమావేశంలో వనపర్తి కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, నాగర్‌కర్నూల్ కలెక్టర్ ఎల్‌పీ శర్మన్, నారాయణపేట కలెక్టర్ హరిచందన, గద్వాల కలెక్టర్ శృతి ఓఝా, వనపర్తి జడ్పీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, గద్వాల చైర్‌పర్సన్ సరిత, నాగర్‌కర్నూల్ చైర్‌పర్సన్ పద్మావతి, వనపర్తి, మహబూబ్‌నగర్ రైతుబంధు సమితి అధ్యక్షులు జగదీశ్వర్‌రెడ్డి, గోపాల్‌యాదవ్ పాల్గొన్నారు.