-
-
Home » Telangana » Mahbubnagar » Public lands exposed to Kabza
-
రెవెన్యూలో..నకి‘లీలలు’
ABN , First Publish Date - 2020-06-23T10:05:57+05:30 IST
ప్రభుత్వ భూమి పరుల పాలవుతోంది. వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం తాగిపర్తి గ్రామం వనపర్తి-హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఉండటంతో ఇక్కడి

కబ్జాకు గురైన ప్రభుత్వ భూములు
ప్లాట్ల కోసం నకిలీ పట్టాలను సృష్టించిన అక్రమారులు
30 నుంచి 40 మంది వద్ద నకిలీ పత్రాలు
2015లో ప్రొసీడింగ్‌లు ఇచ్చినట్లు సృష్టించిన ప్రబుద్ధులు
పత్రాల్లో ఓ చోట మహబూబ్‌నగర్, మరో చోట వనపర్తి జిల్లా స్టాంపులు
రెవెన్యూ రికార్డుల్లో కనిపించని ఆధారాలు
పట్టాలిచ్చే సమయానికి పూర్తి కాని కొత్త జిల్లాల ఏర్పాటు
అధికారులు భారీగా ముడుపులు
ప్రభుత్వ భూమికే కొందరు అక్రమార్కులు ఎసరు పెట్టారు.. భూములకు ఉన్న డిమాండ్ దృష్ట్యా కొత్త దందాకు తెర లేని, గ్రామ కంఠం భూమిని ప్లాట్లుగా విభజించారు.. అంతటితో ఆగకుండా ఏకంగా కొత్త జిల్లాల ఏర్పాటు కాకముందే, జిల్లా సీల్ వేసి నకిలీ పట్టాలను సృష్టించారు.. దాదాపు 40 మందికి ఈ ప్లాట్లను విక్రయించారు.. ఇందుకు సహకారం అందించిన రెవెన్యూ శాఖలోని కొందరు అధికారులకు ఒక్కో ప్లాట్‌కు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు నజరానాలను ముట్టజెప్పినట్లు తెలుస్తున్నది.. రెవెన్యూ రికార్డుల్లో మాత్రం వీటిని సంబంధించిన ఆధారాలు లేకపోవడంతో, సమాచార హక్కు చట్టం ద్వారా తీసుకున్న పత్రాల్లో కూడా పట్టాలు ఇచ్చినట్లు రుజువులు లేకపోవడంతో ఈ విషయం బహిర్గతమైంది..
వనపర్తి, ఆంధ్రజ్యోతి: ప్రభుత్వ భూమి పరుల పాలవుతోంది. వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం తాగిపర్తి గ్రామం వనపర్తి-హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఉండటంతో ఇక్కడి భూమికి డిమాండ్ ఏర్పడింది. దీంతో సర్వే నంబర్ 166లోని గ్రామ కంఠం భూమిని కొందరు అక్రమార్కులు నకిలీ పట్టా కాగితాలు సృష్టించి, కబ్జా చేసిన వైనం బయట పడింది.
30 నుంచి 40 మందికి నకిలీ పట్టాలు
గ్రామంలోని సర్వే నంబర్ 166లో దాదాపు నాలుగెకరాల పైచిలుకు ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో కొంత మేర ఆ గ్రామానికి సంబంధించిన కార్యాలయాల కోసం కేటాయించగా, ఇంకా నాలుగెకరాలు ప్రభుత్వ ఆధీనంలో ఉంది. అయితే కొందరు ఈ భూములను ప్రభుత్వం ప్లాట్లుగా చేసి ఇచ్చినట్లు నకిలీ పట్టా కాగితాలు సృష్టించారు. ఒక్కొకరికీ 200 గజాల చొప్పున కేటాయించి, 2015లో ప్రొసీడింగ్స్ ఇచ్చినట్లు చూపించి, ఆ భూమిని కబ్జా చేశారు. ఇలా దాదాపు 30 నుంచి 40 మంది వరకు నకిలీ పట్టా కాగితాలు సృష్టించి, భూమిని ఆక్రమించుకున్నారు. అయితే గోపాల్‌పేట రెవెన్యూ కార్యాలయంలో వారికి భూమి అప్పగించినట్లు ఎలాంటి ఆధారాలు లేవు. సమాచార హక్కు చట్టం ద్వారా తీసుకున్న పత్రాల్లో కూడా పట్టాలు ఇచ్చినట్లు రుజువులు లేవు. కాగా, తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం బీపీఎల్ కోటా కింద ఇళ్ల స్థలాలు ఇవ్వడం నిలిపి వేసింది. ఏదైనా ప్రత్యేక పరిస్థితుల్లో మినహా, ఎక్కడా ప్లాట్లు కేటాయించలేదు. అయితే గ్రామంలో మాత్రం తమకు ప్లాట్లు కేటాయించనట్లు చాలా మంది వద్ద పట్టా సర్టిఫికెట్లు ఉండటం గమనార్హం.
పత్రాల్లో పొరపాట్లు
విశ్వసనీయా సమాచారం ప్రకారం గతంలో ఇక్కడ పని చేసిన కొందరు రెవెన్యూ అధికారులు, ఆ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కొంత నగదు ముట్టజెప్పడంతో ఈ నకిలీ పత్రాలు సృష్టించి పంపిణీ చేసినట్లు తెలిసింది. ఒక ప్లాటుకు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు చెల్లించడంతోనే ఈ తతంగం అంతా పూర్తయిందని తెలుస్తోంది. అధికారికంగా ఇచ్చిన ప్లాట్లు కాకపోవడం వల్లే రెవెన్యూ రికార్డుల్లో ప్లాట్లు ఇచ్చినట్లు ఎలాంటి ఆధారాలు కూడా లేవని స్పష్టమవుతోంది. అయితే ఈ పత్రాలు ఇచ్చిన వారు కూడా, ఆ పత్రాల్లో పెద్ద పొరపాటు చేశారు. 2015లో పట్టా ఇచ్చినట్లుగా ఆ పత్రాల్లో ఉండగా, ఓ చోట మహబూబ్‌నగర్ జిల్లా స్టాంపు, మరో చోట వనపర్తి జిల్లా రౌండ్ సీల్ ముద్రలు వేసి ఉన్నాయి.
2015లో అసలు వనపర్తి జిల్లాగా ఏర్పడలేదు. అలాగే పట్టా కాగితాల్లో మండలం ఉండాల్సిన చోట లబ్ధిదారు పేరు, లబ్ధిదారు పేరు ఉండాల్సిన చోట మరో అంశం ఇలా అర్థం కాకుండా పత్రాలు సృష్టించారు. అయితే గ్రామ పంచాయతీ సమీపంలోనే ఈ ఆక్రమణ జరిగినా అటు పంచాయతీ పాలకవర్గం, ఇటు ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం కూడా విడ్డూరంగా ఉంది. కలెక్టర్ వెంటనే స్పందించి భూమిని స్వాధీనం చేసుకోవడంతోపాటు ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు, గ్రామానికి కావాల్సిన సౌకర్యాల నిమిత్తం ఆ భూమిని కేటాయిస్తే మేలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.