ప్రమాదంలో ప్రజల ఆరోగ్యం

ABN , First Publish Date - 2020-05-29T10:59:12+05:30 IST

గద్వాల జిల్లాలో ఆస్పత్రుల వ్యర్థాలను ఎక్కడపడితె అక్కడ పడేస్తుండటంతో ప్రజల ఆరోగ్యం

ప్రమాదంలో ప్రజల ఆరోగ్యం

మెడికల్‌ వ్యర్థాలను డ్రెయినేజీల్లో పడేస్తున్న వైనం

పట్టించుకోని వాతావరణ కాలుష్య నియంత్రణ బోర్డు


గద్వాల, మే 28 (ఆంధ్రజ్యోతి): గద్వాల జిల్లాలో ఆస్పత్రుల వ్యర్థాలను ఎక్కడపడితె అక్కడ పడేస్తుండటంతో ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడింది. వాతావరణ కాలుష్య నియంత్రణ బోర్డు అధికార యంత్రాంగం మామూళ్ల మత్తులో జోగుతోందనే ఆరోపణలున్నాయి. ఆ శాఖకు కలెక్టర్‌ తాఖీలు ఇవ్వడంతో మెడికల్‌ వ్యవస్థలో కొనసాగుతున్న మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గద్వాలలో 40కిపైగా ప్రైవేట్‌, 19 ప్రభుత్వ ఆస్పత్రులు ఉన్నాయి. గద్వాల ప్రభుత్వ ఆస్పత్రి ద్వారా మాత్రమే హైదరాబాద్‌ నుంచి మెడికల్‌ వ్యర్థాల సేకరణ జరుగుతోంది. మిగిలిన 11 ప్రాథమిక ఆర్యోగ కేంద్రాల వ్యర్థాలను భూమిలో పూడ్చిపెడుతున్నామని, కొన్నింటిని కాల్చి వేస్తున్నా మని చెబుతున్నా అలా చేయడం లేదని తెలుస్తోంది. చాలా చోట్ల డ్రెయినేజీల్లో పడేస్తున్నారు.


ఇటీవలే టెండర్లు పిలిచామని, రేట్లలో తేడాలుండటంతో ఖరారు చేయలేక పోతున్నామని వైద్య ఆర్యోగ్యశాఖ తెలుపుతోంది. ఆస్పత్రుల వ్యర్థాలను డ్రెయినేజీల్లో పడేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు స్పందించకపోవడంతో ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం పొంచి ఉంది. మరోవైపు మెడికల్‌ షాపుల యజమానులు, మెడికల్‌ ఏజెన్సీలు వైద్యులకు వచ్చే శాంపిళ్లతోపాటు గడువు ముగిసిన మందులను విక్రయించి రూ.లక్షల్లో ఆర్జిస్తున్నారు.

Updated Date - 2020-05-29T10:59:12+05:30 IST