రెడ్‌ అలర్ట్‌.. కరోనా వ్యాప్తి నిరోధించేందుకు యుద్దప్రాతిపదికన చర్యలు

ABN , First Publish Date - 2020-03-21T11:22:42+05:30 IST

కరోనా కల్లోలంతో జిల్లా అంతటా రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు

రెడ్‌ అలర్ట్‌.. కరోనా వ్యాప్తి నిరోధించేందుకు యుద్దప్రాతిపదికన చర్యలు

  • - దోమల పెంట వద్ద చెక్‌పోస్టు ఏర్పాటు
  • - నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో ముగ్గురిని పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించిన వైద్య సిబ్బంది
  • - సలేశ్వరం జాతరను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన జిల్లా కలెక్టర్‌ ఈ.శ్రీధర్‌
  • - జన సంచారం లేక నిర్మానుష్యంగా మారుతున్న రహదారులు
  • - మన్ననూర్‌ వద్దే శ్రీశైలం బస్సులను నిలిపివేస్తున్న అటవీశాఖ అధికారులు


నాగర్‌కర్నూల్‌, మార్చి 20 (ఆంధ్రజ్యోతి) : కరోనా కల్లోలంతో జిల్లా  అంతటా రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో జిల్లాలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి ఇటీవల స్వస్థలాలకు వచ్చిన ఎన్‌ఆర్‌ఐలను క్వారింటైన్‌లో ఉంచడమే కాకుండా అంతర్రాష్ట్ర సరిహద్దుగా ఉన్న దోమల పెంట వద్ద చెక్‌పోస్టును ఏర్పాటు చేశారు. తెలంగాణ అమర్‌నాథ్‌గా పేరొందిన సలేశ్వరం జాతరను రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఈ.శ్రీధర్‌ శుక్రవారం ప్రకటించారు. 


జిల్లా కేంద్రం నుంచి ముగ్గురిని గాంధీ ఆసుపత్రికి...

సంపర్క్‌ క్రాంతి రైలులో ప్రయాణించిన ఇద్దరు, ఇటీవల విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చిన ఓ వ్యక్తిని గురువారం అర్ధరాత్రి వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. నాగర్‌కర్నూల్‌ పట్టణంలోని ఓ కాలనీకి చెందిన దంపతులు ఇటీవల వెంకటేశ్వరస్వామిని దర్శించుకునే క్రమంలో మహబూబ్‌నగర్‌ నుంచి సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో ఇండోనేషియా నుంచి రామగుండం వచ్చిన విదేశీయులు ప్రయాణించిన ఎస్‌-9బోగిలో తిరుపతికి చేరుకున్నారు. అయితే ఆ బోగిలో ఎవరెవరూ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణం చేశారనే విషయాన్ని ఆరా తీసిన పోలీసులు ఆ జాబితాలో నాగర్‌కర్నూల్‌ నుంచి ఇద్దరు ఉన్నట్లు తెలుసుకుని గురువారం రాత్రి వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి పంపించారు. 


ఇటీవల విదేశీ పర్యటన నుంచి మరొకరిని కూడా గాంధీకి తరలించారు. జిల్లా నుంచి గాంధీ ఆసుపత్రికి పరీక్షల నిమిత్తం పంపిస్తున్న వారి జాబితాను పోలీసులు, వైద్య సిబ్బంది గోప్యంగా ఉంచుతున్నారు. జిల్లాలో ఇటీవల విదేశాల నుంచి తిరిగొచ్చిన వారి వివరాలను సేకరించిన యంత్రాంగం కజకిస్తాన్‌, సౌదీ, దుబాయ్‌ నుంచి దాదాపు 18మంది  నెల రోజుల క్రితం ఇక్కడికి వచ్చినట్లు తెలుసుకుని వారి ఇళ్ల వద్దకు వెళ్లి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. 14రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని వారికి సూచనలిచ్చారు. జిల్లా కలెక్టర్‌ ఈ.శ్రీధర్‌, ఎస్పీ వై.సాయిశేఖర్‌, డీఎంహెచ్‌ఓ డా.సుధాకర్‌లాల్‌ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మత పెద్దలకు చేసిన సూచనలతో జిల్లాలోని మస్జీద్‌లలో శుక్రవారం ప్రత్యేక నమాజ్‌కు ముస్లింలు పలుచగా హాజరయ్యారు. 


సలేశ్వరం జాతర రద్దు

తెలంగాణ అమర్‌నాథ్‌గా పిలువబడే సలేశ్వరం జాతరను రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఈ.శ్రీధర్‌ శుక్రవారం ప్రకటించారు. నల్లమల లోతట్టు అటవీ ప్రాంతంలోని పౌర్ణమి కంటే రెండు రోజుల ముందు ప్రారంభమై ఐదు రోజుల పాటు కొనసాగే సలేశ్వరం జాతరలో లింగమయ్యను దర్శించుకోవడానికి ప్రతి ఏటా దాదాపు పది లక్షల మంది భక్తులు హాజరవుతారు. కొండలు, లోయల మధ్య సాగే ఈ జాతరలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తారు. వచ్చే నెల 8నుంచి జరిగే ఈ ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం ఈ సారి పది లక్షల రూపాయలు కూడా కేటాయించింది. అయితే ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా లక్షల మంది సమూహం చేరితే ప్రమాదకరమైన పరిస్థితులు తలెత్తుతాయని నిర్ణయించిన ప్రభుత్వం సలేశ్వరం జాతరను రద్దు చేసింది. మరో పక్క శ్రీశైలం వెళ్లే భక్తులను కూడా మన్ననూర్‌ వద్దనే పారెస్టు అధికారులు నిలిపివేస్తున్నారు. అక్కడి నుంచి కిందికి దింపి బస్సులను ఖాళీగా  పంపిస్తున్నారు.

 

నిర్మానుష్యంగా మారిన రహదారులు

కరోనా సృష్టిస్తున్న కల్లోలంతో రహదారులన్ని నిర్మానుష్యంగా మారుతున్నాయి. సమూహాల్లో కలవాలన్నా, ఎక్కడైనా శుభకార్యాలకు వెళ్లాలన్నా జనం బెంబేలెత్తుతున్నారు. దీంతో జిల్లాలోని నాగర్‌కర్నూల్‌, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్‌ పట్టణాల్లో ప్రధాన రహదారులు, వీధులు జనసంచారం లేక నిర్మానుష్యంగా మారుతున్నాయి. 


యుద్ధ ప్రాతిపదికన చర్యలు

కరోనా వైరస్‌ వ్యాప్తి పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. ఇందు కోసం జిల్లాలో అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశాం. ప్రత్యేకంగా శానిటేషన్‌ విషయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రతి మునిసిపాలిటీలోను మురుగుకాల్వలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసి బ్లీచింగ్‌ చేయాలని ఆయా పాలకవర్గాలకు ఆదేశాలిచ్చాం. ఆసుపత్రులకు వచ్చే రోగుల పట్ల డాక్టర్లు నిర్లక్ష్యం వహించకుండా ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని గుర్తించి వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఐసోలేషన్‌ వార్డులోకి తరలించి చికిత్సలు చేయాలని ఆదేశించాం. జిల్లా ఆసుపత్రితోపాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లు 24గంటల పాటు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాకు నాలుగు ధర్మల్‌ స్కానింగ్‌ యంత్రాలను వెంటనే తెప్పించాలని నిర్ణయించాం.


స్వీయ నియంత్రణ పాటించాలి

- డా.వై.సాయిశేఖర్‌

కరోనా వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు జిల్లా ప్రజలు స్వీయ నియంత్రణ ఉండాలి. వ్యక్తిగత, పరిసరాల శుభ్రతను పాటిస్తే ఆందోళన చెందే అవకాశం ఉండదు. ముఖ్యంగా కుటుంబ సభ్యులందరిలోను అవగాహన కల్పించేలా ఆ ఇంటి యజమానులు ప్రయత్నించి రెండు వారాల పాటు ఇంటికే పరిమితమైతే ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావు. కరోనా వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు వైద్య, ఆరోగ్యం, రెవెన్యూ శాఖలతో కూడిన అధికారులతోపాటు ప్రత్యేకంగా పోలీస్‌ బృందాలను కూడా ఏర్పాటు చేశాం. ఇటీవల విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వారిని గుర్తించి మూడు శాఖలకు చెందిన వారు వారింటికెళ్లి కౌన్సెలింగ్‌ ఇవ్వడం జరుగుతుంది. 14రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండేలా కౌన్సెలింగ్‌ ఇస్తున్నాం. ఈ విషయంలో ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం. సభలు, సమావేశాలపై నిషేధాజ్ఞలు కొనసాగిస్తాం. కరోనా వైరస్‌ వ్యాప్తి జరిగిందని వచ్చే పుకార్లను నమ్మవద్దు.  

Updated Date - 2020-03-21T11:22:42+05:30 IST