కరోనా నియంత్రణలో పాలమూరు ప్రథమం

ABN , First Publish Date - 2020-04-21T09:41:44+05:30 IST

కరోనా నియంత్రణలో రాష్ట్రంలోనే మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రథమ స్థానం ఉందని ఎక్సైజ్‌ శాఖ మంత్రి

కరోనా నియంత్రణలో పాలమూరు ప్రథమం

మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌

జిల్లా ఆసుపత్రిలో కరోనా నమూనాల సేకరణ కేంద్రం ప్రారంభం


మహబూబ్‌నగర్‌ (వైద్యవిభాగం) ఏప్రిల్‌ 20 : కరోనా నియంత్రణలో రాష్ట్రంలోనే మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రథమ స్థానం ఉందని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో సోమవారం కరోనా నమూనాల సేకరణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అనుమానిత కరోనా వ్యక్తుల నుంచి స్వాప్‌ తీసే విధానాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా అనుమానితుల నుంచి నమూనాలు సేకరించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన కేంద్రాన్ని జనరల్‌ ఆసుపత్రిలో ఏర్పాటు చేశామని చెప్పారు.


మంత్రి కేటీఆర్‌ సహకారంతో ఈ స్టేషన్‌ను ఏర్పాటు చేశామని, ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దీని ద్వారా వేగవంతంగా నమూనాలు సేకరించేందుకు అవకాశం ఉందన్నారు. దీనిద్వారా ల్యాబ్‌ టెక్నీషియన్లు, డాక్టర్లు, వైద్యసిబ్బందికి భద్రత ఉంటుందని చెప్పారు. త్వరలో టెస్టింగ్‌ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ వెంకట్రావు, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రాంకిషన్‌, ప్రభుత్వ వైద్య కళాశాల వైస్‌ ప్రిన్సిపల్‌ సునంధిని పాల్గొన్నారు.

Updated Date - 2020-04-21T09:41:44+05:30 IST