కేంద్రాల్లోనే.. కుప్పలు

ABN , First Publish Date - 2020-12-20T04:19:30+05:30 IST

జోగుళాంబ గద్వాల జిల్లాలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను హమాలీల కొరత వేధిస్తోంది.

కేంద్రాల్లోనే.. కుప్పలు
హమాలీల కొరతతో ముల్కలపల్లి గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో తూకం కాని ధాన్యం

హమాలీల కొరత.. 

తూకం యంత్రాలు కరువు

లారీలు అంతంతమాత్రమే..

గద్వాల జిల్లాలో 45 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

కేంద్రాలకు వచ్చింది 1.30 లక్షల క్వింటాళ్లు

కొనుగోలు చేసింది 76 వేల క్వింటాళ్లు

కొనాల్సింది 54 వేల క్వింటాళ్లు

అన్నదాతకు రూ.7.32 కోట్లు చెల్లింపు


 జోగుళాంబ గద్వాల జిల్లాలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు  కేంద్రాలను హమాలీల కొరత వేధిస్తోంది. కేటాయించిన వారు కేంద్రాలకు రోజూ రాకపోవడంతో ఈ సమస్య నెలకొన్నది. దాంతో రైతులు తెచ్చిన ధాన్యం సెంటర్లలోనే మగ్గుతోంది. జిల్లాలో 69 వేల హెక్టార్లలో వరి సాగు చేయగా, 2.39 లక్షల క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు 1.30 లక్షల క్వింటాళ్ల ధాన్యం వచ్చింది.

- గద్వాల, ఆంధ్రజ్యోతి


జిల్లాలోని ఐకేపీ వరి కొనుగోలు కేంద్రాలకు వరి ధాన్యాన్ని తెచ్చిన రైతులు వారాల తరబడి పడిగాపులు కాస్తున్నారు. హమాలీల కొరత, తూకం యంత్రాలు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై నెల రోజులు గడవగా, ఇప్పటి వరకు 50 శాతం ధాన్యాన్ని మాత్రమే తరలింపు జరిగింది.


69 వేల హెక్టార్లలో వరి సాగు

జిల్లాలో 69 వేల హెక్టార్లలో వరి సాగయ్యింది. 2.39 లక్షల క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేశారు. ధాన్యం కొనుగోలు కోసం జిల్లా వ్యాప్తంగా 45 ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు 1.30 లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని తెచ్చారు. 76 వేల క్వింటాళ్లు కొని, రైస్‌ మిల్లులకు తరలించారు. మరో 54 వేల క్వింటాళ్ల ధాన్యం తూకం చేయాల్సి ఉంది. రైస్‌ మిల్లులకు తరలించిన ధాన్యానికి సంబంధించి 1,932 మంది రైతులకు రూ.7.32 కోట్లు వారి ఖాతాల్లో జమ అయ్యాయి.


హమాలీల ఇక్కట్లు

కొనుగోలు కేంద్రాల్లో హమాలీల సమస్యలు ఉన్నాయి. ప్రతి కేంద్రానికి 50 నుచి 70 మంది హమాలీలను కేటాయించారు. కానీ వారు వారంలో రెండు మూడు రోజులే వస్తున్నారు. దీంతో కేంద్రాల్లో ధాన్యం కుప్పలు ఎక్కడివి అక్కడే ఉంటున్నాయి. తూకం వేయడానికి అవసరమైన యంత్రాలు కూడా అందుబాటులో లేవు. దాంతో రైతులు కొనుగోలు కేంద్రాల్లో 15 రోజులుగా ఎదురు చూడాల్సి వస్తోంది. ధాన్యాన్ని కొని, మిల్లులకు తరలిస్తే కానీ రైతుల ఖాతాల్లో డబ్బులు జమకావు. తూకం చేసినా కూడా లారీల సమస్యతో మరి కొన్ని రోజలు రైతులు డబ్బుల కోసం ఎదురు చూడాల్సి వస్తోంది.


ప్రైవేట్‌ వ్యాపారులకు విక్రయం

జిల్లాలోని చాలా మంది రైతులు ధాన్యాన్ని ఐకేపీ కేంద్రాలకు కాకుండా ప్రైవేట్‌ వ్యాపారులకు అమ్ముతున్నారు. వారు కూడా ప్రభుత్వ మద్దతు ధర సన్నాలు రూ.1,860, దొడ్డు రకాలు రూ.1,880లకు కొంటున్నారు. డబ్బులు వెంటనే చెల్లిస్తుండటంతో వారికి విక్రయించడానికే అన్నదాతలు మొగ్గు చూపుతున్నారు. వ్యాపారులు లారీల ను తీసుకుని గ్రామాలకు వెళ్లి ధాన్యాన్ని కొంటు న్నారు. ధాన్యం కొన్న వారం రోజులకు డబ్బులు చెల్లిస్తున్నారు. అప్పటికప్పుడు కావాలంటే క్యాష్‌ కటింగ్‌ పేరుతో రెండు శాతం డబ్బులను కట్‌ చేసుకొని, ఇస్తున్నారు. డబ్బులు అవసరం ఉన్న వారు, కౌలుకు సాగు చేసిన వారు, మంచి సన్న రకాలు పండించిన రైతులు ప్రైవేట్‌ వ్యాపారులకు అమ్ము తున్నారు. జిల్లాలో 90 శాతం మంది రైతులు సన్న రకాలను సాగు చేస్తారు. ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా 1.39 లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేయగా, ప్రైవేట్‌ వ్యాపారులు మరో లక్ష క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు.

Read more