కరోనా కట్టడిలో ఉన్నట్లేనా..!
ABN , First Publish Date - 2020-04-28T10:19:53+05:30 IST
కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరుగుతూ గజగజలాడినా పాలమూరు ఉమ్మడి జిల్లాలో

మూడురోజులుగా ఆగిన కొత్తకేసులు
గద్వాలలో కట్టడికి కొత్త వ్యూహం
పాజిటివ్ రాకపోవడంతో ఆగిన పరీక్షలు
ఇదే కొనసాగిస్తే త్వరలో పూర్తి అదుపులోకి
మహబూబ్‌నగర్, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరుగుతూ గజగజలాడినా పాలమూరు ఉమ్మడి జిల్లాలో మూడురోజులుగా కొత్త కేసులు లేకపోవడంతో పరిస్థితి కుదుటపడింది.తొలుత ఎయిర్‌పోర్ట్ వద్ద విధులు నిర్వహించిన ఉద్యోగుల ద్వారా జిల్లాలో కేసులు నమోదయితే, ఆతర్వాత మర్కజ్‌కాంటాక్ట్‌తో కేసుల సంఖ్య ఊహించనిరీతిలో పెరిగింది. ఎయిర్‌పోర్టు వద్ద విధులు నిర్వహించిన ఇద్దరు ఉద్యోగులు సహా ముగ్గురికి తొలుత పాజిటివ్ నమోదయింది.
ఆతర్వాత మర్కజ్ కాంటాక్ట్‌లు, కర్నూల్ కాంటాక్ట్‌లతో 63కి పెరిగిన విషయం తెలిసిందే. అత్యధికంగా జోగులాంబ గద్వాల జిల్లాలో కేసుల సంఖ్య 49కి చేరితే, ఆతర్వాత మహబూబ్‌నగర్‌లో 11కి చేరింది. నాగర్‌కర్నూల్ జిల్లాలో రెండు కేసులు, నారాయణపేట జిల్లాలో ఒక కేసు నమోదయ్యాయి. మొత్తం 63 కేసుల్లో 3 మరణాలు సంభవిస్తే, మరో 18 మంది డిశ్చార్జి అయ్యారు. మిగిలిన 42 మంది హైద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
పాజిటివ్ కేసుల వ్యాప్తి ఎక్కువగా ఉన్న గద్వాల పట్టణంలో తాజాగా ఆదివారం రాత్రి నుంచి కంటైన్మంట్ జోన్లలోని ఇళ్లకు మున్సిపల్ అధికారులు తాళాలు వేశారు.ఈ కాలనీల్లో పూర్తి స్థాయిలో జనసంచారం లేకుండా కట్టడి చేస్తున్నారు. ఈ ఇళ్లలోని వారికి అవసరమైన నిత్యావసరాలు, మందులు, ఇతర అన్ని రకాల సేవలను నేరుగా వారి ఇళ్లవద్దకే వెళ్లి అందిస్తున్నారు. అదే విధంగా ప్రతి రోజూ వైద్యబృందం ఈ ఇళ్లకువెళ్లి పరీక్షలు నిర్వహిస్తుంది. అదేవిధంగా పాజిటివ్ నమోదయితే వారి కాంటాక్ట్‌లు తప్ప, మిగతావారి నుంచి శాంపిల్స్ తీసుకొని పరీక్షలు జరపవద్దని నిర్ణయించారు. దీంతో ఉమ్మడి జిల్లాలో మూడు రోజులుగా కొత్త కేసుల నమోదు ఆగిపోయింది. తాజాగా క్వారంటైన్, హోం క్వారంటైన్లలో ఉన్నవారికి పాజిటివ్ లక్షణాలుంటేనే పరీక్షలు చేస్తారని చెబుతున్నారు.
దీంతో ప్రస్తుతానికి ఉమ్మడి జిల్లాలో కరోనా వ్యాప్తిని కట్టడి చేసిన పరిస్థితి నెలకొంది. ప్రధానంగా గద్వాల జిల్లాకు సరిహద్దు ప్రాంతమైన ఏపీలోని కర్నూల్‌లో పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి వందశాతం రాకపోకలు నిలిపివేయడంతో జిల్లాలో ఒక్కో జోన్‌ని అదుపులోకి తీసుకొని కట్టడి చర్యలు ముమ్మరం చేశారు. ఇదే కట్టడిని కొనసాగిస్తూ కొత్త కేసులు వచ్చినా, కాంటాక్ట్ తక్కువ ఉండేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇళ్లకు తాళాలేయడం ఈవ్యూహమే. ఇది ఫలిస్తే కరోనా వైరస్ వ్యాప్తి ప్రభావాన్ని సాధ్యమైనంత మేర తగ్గించినట్లవుతుంది. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో ఇదే రీతిలో కఠినమైన కట్టడి మరికొంత కాలం కొనసాగిస్తేనే పూర్తిగా పరిస్థితి అదుపులోకి వస్తుందని భావిస్తున్నారు.
జిల్లా కొత్తపాజిటివ్‌కేసులు మొత్తం పాజిటివ్‌లు డిశ్చార్జి మరణాలు యాక్టివ్ పాజిటివ్ హోం క్వారంటైన్‌లో ఉన్నవారు
1.గద్వాల జిల్లా నిల్ 49 9 2 38 1244
2.మహబూబ్‌నగర్ నిల్ 11 9 నిల్ 02 624
3.నాగర్‌కర్నూల్ నిల్ 02 నిల్ నిల్ 02 193
4.నారాయణపేట నిల్ 01 నిల్ 01 నిల్ 2,192
5.వనపర్తి నిల్ నిల్ నిల్ నిల్ నిల్ నిల్