ప్రజారోగ్యపై నిర్లక్ష్యం తగదు: ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2020-09-06T10:04:27+05:30 IST

ప్రజారోగ్య విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని నారా యణపేట ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను హెచ్చరించారు...

ప్రజారోగ్యపై నిర్లక్ష్యం తగదు: ఎమ్మెల్యే

నారాయణపేటరూరల్‌, సెప్టెంబరు5: ప్రజారోగ్య విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని  నారా యణపేట ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను హెచ్చరించారు. శనివారం జిల్లా కేంద్రంలోని మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ అమ్మకోళ్ళ శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా విజృంభిస్తున్న తరుణంలో కనీసం కరోనా పరీక్షలకు సంబంధించిన ఒక్క ముక్క కూడా  నివేదికలో పొందపర్చక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో ఎన్ని పరీక్షలు చేశారు. ఎన్ని పాజిటివ్‌ కేసులు వచ్చాయి, ఎంతమందికి చికిత్స అందిస్తున్నారు అని ప్రశ్నించారు. ఎక్కువ కేసులు ఉన్న గ్రామాలను కంటైన్మెంట్‌ గ్రామాలుగా ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. తీరు మార్చుకోకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.


అదేవిధంగా మండలంలోని వివిధ గ్రామాల్లో భగీరథ ట్యాంకులు, పైప్‌లైన్‌ పనులు పూర్తికాలేదని వెంటనే పూర్తిచేయాలని సర్పంచులు సభాదృష్టికి తీసుకువచ్చారు. పలు విషయాలపై సమావేశంలో ప్రజాప్రతినిధులు అధికారులను నిలదీశారు. సమావేశంలో వైస్‌ఎంపీపీ పి.సుగుణ, జడ్పీటీసీ పాడువల్లి అంజలి, జడ్పీ కోఆప్షన్‌ తాజుద్దిన్‌, విండో అధ్యక్షుడు నర్సింహారెడ్డి, ఎంపీడీఓ సందీప్‌కుమార్‌, తహసీల్దార్‌ దానయ్య, ఆయా గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-06T10:04:27+05:30 IST