నల్లమలకు పూర్వ వైభవం
ABN , First Publish Date - 2020-06-25T10:46:11+05:30 IST
కలప అక్రమ తరలింపు కారణంగా విస్తీర్ణం తగ్గిన నల్లమల అటవీ ప్రాంతానికి పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రత్యేక కార్యాచరణ

(నాగర్‌కర్నూల్-ఆంధ్రజ్యోతి) : కలప అక్రమ తరలింపు కారణంగా విస్తీర్ణం తగ్గిన నల్లమల అటవీ ప్రాంతానికి పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ ఈ.శ్రీధర్ వెల్లడించారు. రైతు వేదికలు, వైకుంఠధామాల్లో విస్తృతంగా మొక్కలు పెంచే కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చి, ఆరో విడత హరితహారంలో జిల్లా వ్యాప్తంగా దాదాపు 80 లక్షల మొక్కలను నాటాలని నిర్ణయించామని ఆయన స్పష్టం చేశారు. 6వ విడత హరితహారం సందర్భంగా ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో మాట్లాడిన కలెక్టర్ జిల్లాను 6వ విడత హరితహారంలో కూడా అగ్రగ్రామిగా నిలిపేందుకు క్షేత్రస్థాయిలో తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు.
నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాలలో ఇప్పటి వరకు 91.09శాతం మొక్కలు బతికాయన్నారు. ఈ సారి నల్లమల అటవీ ప్రాంతంలో మొక్కల రక్షణతోపాటు అటవీ సంబంధమైన జాతుల మొక్కలు విస్తృతంగా పెంచాలని నిర్ణయించామన్నారు. 2.50 లక్షల హెక్టార్లలో పలుచబడిన అటవీ ప్రాంతాన్ని ఎంపిక చేసుకొని మొక్కలు నాటేందుకు విస్తృతమైన కార్యచరణను రూపొందించామన్నారు.
తిమ్మాజిపేట నుంచి శ్రీకారం
6వ విడత హరితహారం కార్యక్రమాన్ని తిమ్మాజిపేట నుంచి ప్రారంభించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. స్మృతి వనం పేరిట వెయ్యి మొక్కలు నాటనున్నట్లు చెప్పారు.