చెత్తపై చిత్తశుద్ది ఏదీ....

ABN , First Publish Date - 2020-03-04T10:39:11+05:30 IST

చెత్తపై చిత్తశుద్ది ఏదీ....

చెత్తపై చిత్తశుద్ది ఏదీ....

రోడ్లపై యదేచ్చగా చెత్త పారేస్తున్న ఘనులు

 

వనపర్తి, మార్చి 3 : పట్టణాలు, గ్రామాలు పరిశుభ్రంగా, సుందరంగా ఉండాలని లక్షలాది రూపాయలతో ఓ వైపు ప్రభుత్వం పట్టణ ప్రణాళిక కార్యక్రమాలు చేపడుతుండగా...మరోవైపు ప్రజలు ఏమాత్రం బాధ్యత లేకుండా వ్యవహరిస్తూ చెత్తను రోడ్లపై పారవేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. గత వారం రోజులుగా జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో పట్టణ ప్రగతి కార్యక్రమం కొనసాగుతోంది. జిల్లా కలెక్టర్‌తో పాటు అధికారులు, ప్రజా ప్రతినిదులు స్వయంగా కార్యక్రమాల్లో పాల్గొంటూ పట్టణాలను పరిశుభ్రంగా మారుస్తున్నారు. అయితే జిల్లాకేంధ్రంలో కొన్ని చోట్ల కొందరు నిర్లక్షంగా రోడ్లపై చెత్త వేస్తున్నారు. నిన్నటికి నిన్న రోడ్లపై చెత్త వేసినందుకు 33వ వార్డు రాజీవ్‌ చౌరస్తాలోని ఓ ప్రయివేట్‌ పాఠశాల యాజమాన్యానికి మున్సిపల్‌ అధికారులు రూ. 5వేలు జరిమానా సైతం విధించారు. అయినా మంగళవారం 28వ వార్డులో అదే సీన్‌ పునరావృత్తం అయింది. ఉదయం కలెక్టర్‌ షేక్‌ యాస్మీన్‌ బాష ఇంటింటి చెత్తసేకరణ వాహనాలను ప్రారంభించి, అందరూ రోడ్లపై చెత్త వేయకుండా బండ్లలో వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం కొనసాగుతుండగానే 28వ వార్డులో ఉన్న సత్యనారాయణ రైస్‌మిల్లు ముందు ప్రధాన రహదారిపై కొందరు ఘనులు ఎంగిలి ప్లేట్లు, ప్లాస్టిక్‌ వ్యర్థాలు కుప్పలుగా వేశారు. అలాగే పెట్రోలు బంకు వెనుక ఖాలీ మద్యం సీసాలు, అదే కాలనీలో రోడ్డుపై చెత్తను పారవేశారు. ప్రతి రోజూ మిల్లు, పెట్రోలు బంకు చుట్టూ తెల్లవారుజామున గుర్తు తెలియని వారు ఇలా చెత్తను పడేస్తున్నారని కాలనీ వాసులు చెప్తున్నారు. మన కాలనీ, మన పట్టణం సుందరంగా ఉండాలంటే అందరూ బాధ్యతగా ఉండాలని ఇదేం తీరని కొందరు విమర్శిస్తున్నారు. 

Updated Date - 2020-03-04T10:39:11+05:30 IST