సరిగ్గా అదే రోజూ..

ABN , First Publish Date - 2020-11-13T10:18:21+05:30 IST

అది 1993. పోలీసులు, మావోయిస్టులకు మధ్య భీకర పోరు సాగుతున్న సమయం. వరుస ఎన్‌కౌంటర్లు, మావోయిస్టుల లొంగుబాటులు పెరుగుతున్న తరుణం.

సరిగ్గా అదే రోజూ..

 1993, నవంబరు 14న దీపావళి

 నాటి సోమశిల దుర్ఘటనకు 27 ఏళ్లు పూర్తి

- ఎస్పీ పరదేశీనాయుడుతో సహా తొమ్మిది మంది పోలీసుల మృతి


మహబూబ్‌నగర్‌, నవంబరు 12 : అది 1993. పోలీసులు, మావోయిస్టులకు మధ్య భీకర పోరు సాగుతున్న సమయం. వరుస ఎన్‌కౌంటర్లు, మావోయిస్టుల లొంగుబాటులు పెరుగుతున్న తరుణం. వాటికి అడ్డుకట్ట వేసేందుకు మావోయిస్టులు వ్యూహం రచించారు. ఈ వ్యూహంలో భాగంగా అప్పటి ఉమ్మడి పాలమూరు జిల్లా ఎస్పీ పరదేశినాయుడుతో సహా తొమ్మిది మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు.  ఈ ఘటన జరిగిన సరిగ్గా 27 ఏళ్లు అయ్యింది. ఆ రోజూ దీపావళి. మళ్లీ ఇప్పుడు అదే రోజు దీపావళి పండుగ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆనాటి దుర్ఘటనపై ‘ఆంధ్రజ్యోతి’ కథనం.


అసలేం జరిగింది

ఉమ్మడి జిల్లాలో మావోయిస్టులు నల్లమల కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే వారు. పోలీసులు వీరి చర్యలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టే వారు. ఒక వైపు ఎన్‌కౌంటర్లు, మరో వైపు లొంగుబాటులను ప్రోత్సహిస్తుండటంతో వాటికి అడ్డుకట్ట వేయాలని మావోయిస్టులు పోలీసులకు భారీగా నష్టం చేయాలని, తద్వారా లొంగుబాటులను అరికట్టాలని పథకం వేశారు. ఇందులో భాగంగా నవంబరు 13, 1993న కొల్లాపూర్‌ మండలం సోమశిలలో ప్రయాణికులు లేని ఆర్టీసీ బస్సుతో పాటు అక్కడి ఆర్‌అండ్‌బీ అతిథి గృహాన్ని పేల్చేశారు. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలిచేందుకు వచ్చినప్పుడు, వారి వాహనాన్ని కూడా ల్యాండ్‌మైన్‌తో పేల్చేయాలని ప్రణాళిక రూపొందించుకున్నారు. అయితే, పోలీసులు వారి వాహనాల్లో కాకుండా ప్రైవేట్‌ బస్సులో ఘటన స్థలాన్ని సందర్శించారు. అందులో ప్రయాణికులు ఉండటంతో ఆ బస్సును పేల్చేందుకు వారు సుముఖత చూపలేదు.

 

మరుసటి రోజు (నవంబరు 14)న మఽధ్యాహ్నం తరువాత అప్పటి ఉమ్మడి పాలమూరు ఎస్పీ పరదేశినాయుడు ఉన్న పలంగా కొల్లాపూర్‌కు చేరుకున్నారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో అయ్యప్పకు చెందిన ప్రైవేట్‌ బస్సులో సోమశిల వెళ్లి రావాలని నిర్ణయించుకున్నారు. ఆయన వెంట వచ్చిన పోలీసులతో పాటు, అక్కడే ఉన్న మరికొందరు సిబ్బంది మొత్తం 35 మంది ఒకే బస్సులో సోమశిల బయలుదేరారు. అప్పటికే అక్కడ ల్యాండ్‌మెన్‌తో సిద్ధంగా ఉన్న మావనోయిస్టులు పోలీసుల బస్సును గమనించారు. అయితే, బస్సులో ఎస్పీ ఉన్నారన్న సమాచారం వారికి లేదు. సోమశిల వెళ్లి తిరిగి వస్తుండగా సాయంత్రం 4:30 గంటల సమయంలో కొండపై కాపు కాచిన వారు, మందుపాతరతో బస్సును పేల్చివేశారు. పేలుడు భారీ స్థాయిలో జరగడంతో బస్సు ముందుభాగం పూర్తిగా ధ్వంసమైంది. మందుపాతర ధాటికి బస్సు నిటారుగా లేచి నిలబడింది. పక్కనే ఉన్న విద్యుత్‌ స్తంభం తీగలను తట్టుకుని ఆలానే నిలబడిపోయింది.


ఈ ప్రమాదంలో బస్సులో ముందు వరుసలో కూర్చున్న పోలీసులు చనిపోయారు. వెనక కూర్చున్న వారు గాయాలతో బయటపడ్డారు. ఎస్పీ రెండు కాళ్లు తెగి పడ్డాయి. ఘటన తరువాత 15 నిమిషాల పాటు పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కాళ్లు తెగినా, ఆయుధాలను కాపాడుకునేందుకు పోరాడాలంటూ ఎస్పీ ఆరుస్తూనే ఉన్నారని, ఆయన ఆదేశాల మేరకు ఆయుధాలను కాపాడుకునేందుకు పోరాటం చేశామని అప్పటి బస్సు దుర్ఘటనలో ప్రాణాలతో బయటపడిన కొందరు పోలీసులు చెబుతున్నారు.


మందుపాతర పేలిన శబ్దం విని కూంబింగ్‌లో ఉన్న కొల్లాపూర్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎస్పీతోపాటు ఎస్‌ఐలు కిశోర్‌కుమార్‌, శివప్రసాద్‌, కానిస్టేబుళ్లు వైవీఎస్‌ ప్రసాద్‌, సుభాష్‌, ఎండీ ఎగ్బాల్‌, జయరాములు, రంగారెడ్డి, షేక్‌ హైదర్‌ ఉన్నారు. మృతదేహాలను ఆ రోజు రాత్రికి మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆసుపత్రికి తరలించారు.

Updated Date - 2020-11-13T10:18:21+05:30 IST