‘అలంపూర్‌’కు అంతా ఓకే

ABN , First Publish Date - 2020-10-08T07:41:35+05:30 IST

సీఎం కేసీఆర్‌ సచంనల నిర్ణయం తీసుకున్నారు. కృష్ణానదిపై జూరాల ప్రాజెక్టు తరువాత, అలంపూర్‌ నియోజకవర్గంలో బ్యారేజీ నిర్మాణం చేపడుతామని ప్రకటించారు.

‘అలంపూర్‌’కు అంతా ఓకే

 జూరాల దిగువన బ్యారేజీ నిర్మాణం

 అలంపూర్‌-పెద్దమరూర్‌ వద్ద నిర్మాణానికి సుముఖం

 పోతిరెడ్డిపాడుకు చెక్‌ పెట్టేందుకు సీఎం కేసీఆర్‌ సంచలన నిర్ణయం

 బాబ్లీ తరహాలో చేపడతామని స్పష్టం చేసిన సీఎం

 అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీకి సమాధానం

 బ్యారేజీతో పూర్తిస్థాయిలో కృష్ణా జలాల వాటా వినియోగించుకునే అవకాశం


గద్వాల, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి) : సీఎం కేసీఆర్‌ సచంనల నిర్ణయం తీసుకున్నారు. కృష్ణానదిపై జూరాల ప్రాజెక్టు తరువాత, అలంపూర్‌ నియోజకవర్గంలో బ్యారేజీ నిర్మాణం చేపడుతామని ప్రకటించారు. గోదావరి జలాలను పూర్తిగా వినియోగించుకోవడానికి మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బాబ్లీ ప్రాజెక్టు తరహాలో అలంపూర్‌-పెద్దమరూర్‌ వద్ద కృష్ణానదిపై బ్యారేజీ నిర్మాణం చేపడుతమాని స్పష్టం చేశారు. రోజుకు మూడు టీఎంసీల చొప్పున నీటిని తీసుకునే విధంగా రూపకల్పన చేస్తామని చెప్పారు. ఈ నిర్మాణం జరిగితే ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడుకు అదనపు నీటిని వాడుకోవడానికి అవకాశం ఉండదు.


కేసీఆర్‌ నిర్ణయాన్ని ఏకీభవిస్తున్న మేథావులు

భవిష్యత్తులో కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచితే, తెలంగాణ, ఏపీకి వరద నీరు వచ్చే అవకాశాలు సన్నిగిల్లుతాయి. ఇప్పటికే ఆల్మట్టి, నారాయణపూర్‌, గూగల్‌ బ్యారేజీతో మరో రెండు చిన్న బ్యారేజీలు దాటుకొని జూరాలకు వరద నీరు రావడానికి ఆగస్టు దాటుతుండటంతో, ఈ ప్రాజెక్టు కింద ఖరీఫ్‌ సాగు కష్టంగా మారింది. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు నుంచి శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌ను రోజుకు అదనంగా 80 వేల క్యూసెక్కులు తరలిస్తోంది.


ఇలా నీటిని అదనంగా మళ్లిస్తే శ్రీశైలంలోకి అశించిన స్థాయిలో వరద నీరు చేరకపోవడంతో పాటు ప్రాజెక్టు నిండడం ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ ప్రాజెక్టు కింద ఉన్న నాగార్జునసాగర్‌లో వరద నీరు మరింతగా తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. దీంతో పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ ప్రభుత్వం అదనపు నీటిని తరలించుకుపోవడాన్ని తెలంగాణ ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. అయినా, ఏపీ సీఎం జగన్‌ మాత్రం పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమకు నీటిని తరలించడానికి డీపీఆర్‌ సిద్ధం చేశారు. ఇదే జరిగితే శ్రీశైలం, నాగార్జునసాగర్‌ పరిస్థితి డోలయమానంలో పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ సీఎం అలంపూర్‌ వద్ద కృష్ణానదిపై బ్యారేజీ నిర్మాణంపై నిర్ణయం తీసుకున్నారని, ఇది సరైనదేనని మేధావులు, అధికార పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.


కేటాయింపులపై పేచీ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రెండు రాష్ట్రాలుగా విడిపోగా, 2015లో జరిగిన నీటి పంపకాల విషయంలో కేటాయింపులు సరిగ్గా జరగలేదని తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి వాదిస్తోంది. రెండు రాష్ట్రాలకు తాత్కాలికంగా 2015లో 1956 సెక్షన్‌-3 ప్రకారం ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు వాడుకోవాలని చెప్పారు. కానీ, ఒక ఏడాదికి మాత్రమే ఈ పంపకాలని చెప్పారు. కానీ, ఏడేళ్లు గడుస్తున్నా నీటి కేటాయింపులపై స్పష్టత లేదు. పలుమారు రెండు రాష్ట్రాలు కేంద్రానికి లేఖలు రాసిన స్పందించడం లేదు.


ఈ విషయాన్ని కూడా అపెక్స్‌ కౌన్సిల్‌లో తెలంగాణ సీఎం మాట్లాడినపుడు ఈ విషయం ఎజెండాలో లేదని కేంద్ర జలశక్తి మండలి అధికారులు తప్పించుకున్నారు. ఈ పంపకాలు సరిగ్గా జరిగితే తెలంగాణకు మరిన్ని టీఎంసీలు వాడుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. దీనికితోడు తెలంగాణకు కేటాయించిన 299 టీఎంసీల కృష్ణా జలాలను పూర్తిగా వాడుకోవడానికి అవసరమైన ప్రాజెక్టులు రిజర్వాయర్లు లేవు. జూరాలలో 20 టీఎంసీల రిజర్వాయర్‌, అలంపూర్‌ వద్ద బ్యారేజీ నిర్మాణం జరిపి రోజుకు మూడు టీఎంసీలు తీసుకోవడానికి సీఎం ప్రణాళికలు అమోదిస్తే, ఉమ్మడి పాలమూరు జిల్లాకు సాగు, తాగు నీటికి ఢోకా ఉండదు. 


సీఎం కేసీఆర్‌ నిర్ణయం సరియైుందే.. డాక్టర్‌ అబ్రహం ఎమ్మెల్యే అలంపూర్‌

తెలంగాణ ఉద్యమం జరిగింది నీళ్లు, నిధులు, నియామకాల కోసం. రెండు రాష్ట్రాలుగా విడిపోయినా ఏపీ మాత్రం నీటి దోపిడీకి పాల్పడుతూనే ఉంది. అలంపూర్‌ వద్ద బ్యారేజీ నిర్మాణం చేపడుతామని సీఎం కేసీఆర్‌ ప్రకటించడం అనందంగా ఉంది. ఇదే జరిగితే ఉమ్మడి పాలమూరు జిల్లా సస్యశ్యామలం అవుతుంది.

Updated Date - 2020-10-08T07:41:35+05:30 IST