ఆస్తుల రక్షణ కోసమే సర్వే

ABN , First Publish Date - 2020-10-08T07:28:22+05:30 IST

వ్యవసాయ భూములకు ఇచ్చిన విధంగానే వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించి పాసు బుక్కులు ఇచ్చి, వాటిని సంరక్షించడానికే ప్రభుత్వం సర్వే చేస్తోందని, అందుకు ప్రజలు మునిసిపల్‌ సిబ్బందికి సహకరించాలని సీడీఎంఏ సత్యనారాయణ అన్నారు.

ఆస్తుల రక్షణ కోసమే సర్వే

ధరణి సర్వేను పరిశీలించిన సీడీఎంఏ సత్యనారాయణ


మహబూబ్‌నగర్‌, అక్టోబరు 7: వ్యవసాయ భూములకు ఇచ్చిన విధంగానే వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించి పాసు బుక్కులు ఇచ్చి, వాటిని సంరక్షించడానికే ప్రభుత్వం సర్వే చేస్తోందని, అందుకు ప్రజలు మునిసిపల్‌ సిబ్బందికి సహకరించాలని సీడీఎంఏ సత్యనారాయణ అన్నారు. ఆస్తుల నమోదు ప్రక్రియలో భాగంగా పాలమూరు పురపాలిక పరిధిలో జరుగుతున్న ధరణి పోర్టల్‌ సర్వేను కలెక్టర్‌ వెంకట్రావుతో కలిసి సత్యనారాయణ బుధవారం పరిశీలించారు.


పట్టణంలోని న్యూటౌన్‌, వివేకానందనగర్‌లో చేపడుతున్న సర్వే తీరును పరిశీలించారు. సర్వేలో ఎదురవుతున్న ఇబ్బందులను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఏమైనా అపోహలు ఉంటే నివృత్తి చేయాలని సూచించారు. వివరాలు నమోదు చేసే ప్రొఫార్మాను పరిశీలించారు.  దీనివల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరించా లన్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం నిర్వహించేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.


ఇప్పటికే రెండు సార్లు సమయం పొడిగించినందున యంత్రాంగం కలిసి కట్టుగా పనిచేసి సర్వేను త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌, మునిసిపల్‌ చైర్మన్‌ కేసీ నర్సింహులు, వైస్‌ చైర్మన్‌ గణేష్‌, మునిసిపల్‌ కమిషనర్‌ వడ్డె సురేందర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-10-08T07:28:22+05:30 IST