ఇంటి పన్ను వసూళ్లలో వెనకబాటు

ABN , First Publish Date - 2020-03-13T10:51:27+05:30 IST

ఇంటి పన్ను వసూళ్లలో వెనకబాటు

ఇంటి పన్ను వసూళ్లలో వెనకబాటు

- వసూలు చేయాల్సింది రూ. 2.43 కోట్లు

- నేటి వరకు  రూ.1.51 కోట్లే వసూళ్లు

- మూడు మండలాల్లో 50 శాతం లోపే..

- 18 రోజుల్లో వంద శాతం పూర్తయ్యేనా..?

- పంచాయతీ అధికారుల పర్యవేక్షణ కరువు


గద్వాల రూరల్‌, మార్చి 12 : ఇంటి పన్నుల వసూళ్లలో జిల్లా వెనకబడి ఉన్నది. గత ఏడాది ఈ పాటికే 90 శాతం పూర్తి చేసిన అధికారులు, ఈ సంవత్సరం ఇప్పటి వరకు 63 శాతాన్ని మించలేదు. గ్రామ పంచాయతీలకు వచ్చే ఆదాయమార్గాల్లో ఇంటి పన్నులు ఒకటి. గత ఏడాది 99.8 శాతం వసూలయ్యాయి. కానీ ఈ ఏడాది పన్నుల వసూలు వెనుకంజలో ఉంది. జిల్లాలోని 255 గ్రామ పంచాయతీలలో రూ.2.43 కోట్ల పన్నులను వసూలు చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు రూ.1.51 కోట్లు మాత్రమే వసూలు చేశారు. ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో 18 రోజుల గడువు మాత్రమే ఉన్నది. ఈ నెల చివరి నాటికి వంద శాతం పన్నులు వసూలయ్యే అవకాశం కన్పించడం లేదు.  


అత్యధికం.. అత్యల్పం

గట్టు మండలంలో ఇప్పటి వరకు 36.70 శాతం మాత్రమే వసూలు చేశారు. అదే విదంగా మల్దకల్‌, ఉండవెల్లి మండలాల్లో వసూలు 50 శాతం దాటలేదు. లక్ష్యం పూర్తికాకపోతే ఎరియర్స్‌ కింద మిగిలిపోతాయి. వాటిని వచ్చే ఏడాది వసూలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. గత ఏడాది కూడ ఇటిక్యాల మండలం వెనకబడటంతో దాదాపు రూ.81 వేలు ఎరియర్స్‌ మిగిలి పోగా వాటిని ఈ ఏడాది వసూలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే అలంపూర్‌ మండలంలో 81.42 శాతం పన్నులు వసూలు కాగా, రాజోలి మండలంలో 80.94 శాతం పన్నులు వసూలయ్యాయి. ఇటిక్యాల మండలంలో 80.15 శాతం పన్నులు వసూలయ్యాయి. 


ఇంటిపన్నులపై వసూళ్లపై సమీక్ష కరువు

ఇంటి పన్నులపై ప్రతి ఏడాది మార్చిలో సమీక్షల నిర్వహించి ప్రతిరోజు ఎంత వసూలయ్యాయి. మిగిలిన వాటిని ఎప్పుడు వసూలు చేస్తున్నారనేది ఎప్పటికప్పుడు జిల్లా అధికారులు డీపీఓ, డీఎల్‌పీఓ సమీక్షిస్తుండాలి. మండలంలో ఎంపీఓ పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించి వసూళ్లపై ఆరా తీయాల్సి ఉంటుంది. కానీ ఈ ఏడాది ఇవేవీ జరగడం లేదు. సమీక్షలో జిల్లా కలెక్టర్‌ సూచించిన మాట తప్ప అధికారులు వసూళ్లపై దృష్టి పెట్టడం లేదన్న విమర్శలున్నాయి. 


పనిభారంతో పంచాయతీ కార్యదర్శులు

పంచాయతీ కార్యదర్శులు పని బారంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. పల్లె ప్రగతి పనులతో పాటు పారిశుధ్యం, మంచినీటి సరఫరా, హరితహారం నిర్వహిస్తూనే ఇంటి పన్నులను కూడ వసూలు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా.. ఉపాధి ఫీల్డ్‌ అసిస్టెంట్లు సమ్మెలోకి వెళ్లడంతో ఉపాధి పనులు కూడ వీరే నిర్వహించాలని తాజాగా ప్రభుత్వం నుంచి మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. దీనివల్ల ఇంటి పన్నుల వసూలుపైనా ప్రభావం పడే అవకాశం ఉంది.

Updated Date - 2020-03-13T10:51:27+05:30 IST