మామిడికి మహర్దశ
ABN , First Publish Date - 2020-09-16T06:33:12+05:30 IST
కొల్లాపూర్ మామిడి రైతులకు కష్టానికి తగ్గ ఫలితం దక్కబోతుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రహ్మాండమైన

వ్యవసాయ ఎగుమతి విధానాన్ని అమలు చేయనున్న కేంద్రం
కొల్లాపూర్ మామిడి రైతుల కష్టానికి దక్కనున్న ఫలితం
నాగర్‌కర్నూల్, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి) : కొల్లాపూర్ మామిడి రైతులకు కష్టానికి తగ్గ ఫలితం దక్కబోతుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రహ్మాండమైన డిమాండ్ ఉన్నా, దళారుల చేతిలో మోసపోతున్న రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా వ్యవసాయ ఎగుమతి విధానాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. నోడల్ ఏజెన్సీ ప్రక్రియను క్రియాశీలకంగా అమలు చేయాలని నిర్ణయించడంతో మామిడి రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. సురభి రాజుల కాలం నుంచి కొల్లాపూర్‌లో బేనిషాన్, రాణిపసంద్, దిల్‌పసంద్, కాలిమిస్రీ, తోతాపరీ రకాలకు అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రత్యేక గ్రేడింగ్ ఉంది.
అయితే, ఈ ప్రాంత రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని దళారులు క్రమంగా రైతుల శ్రమను దోచుకుంటూ వచ్చే ప్రక్రియను అమలు చేశారు. దీని కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో వెయ్యి నుంచి రూ.1,500 (ఇండియన్ కరెన్సీలో) ధర పలికే కిలో మామిడిని కేవలం 30-40 రూపాయలకు కొనుగోలు చేస్తూ వంచనకు గురి చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా సమయంలో హైదరాబాద్ మార్కెట్‌లో రైతులకు జరుగుతున్న ఆర్థిక నష్టంపై పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా జరిగాయి. చాలా కాలంగా ఈ ప్రాంత రైతాంగం డిమాండకనుగుణంగా దేశ విదేశాల్లో బాగా డిమాండ్ ఉన్న మామిడి పండ్ల రకాలను ఎగుమతి చేయడానికి నోడల్ ఏజెన్సీగా ఎంపిక చేయడం పట్ల రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
అభిప్రాయం:దళారీ వ్యవస్థ పోతే రైతుకు లాభం చేకూరుతుంది. పరుశరాముడు
కొల్లాపూర్ మామిడికి ప్రత్యేకమైన బ్యాండ్ ఇమేజ్ ఉంది. కాని మార్కెట్‌లో సరైన లాభాలు రావడం లేదు. దళారీ వ్యవస్థ వల్ల తరుగు, కాయల సైజ్ తేడాల పేరుతో రైతులను మోసం చేస్తున్నారు. ప్రభుత్వం మామిడి ఉత్పత్తి రైతుల సంఘం ఏర్పాటు చేసి రైతులకు న్యాయం చేయాలన్న ఆలోచన మంచిది.