ముసుగేసిన..ముసురు
ABN , First Publish Date - 2020-07-10T11:34:50+05:30 IST
జోగుళాంబ గద్వాల జిల్లాలో భారీ వర్షం కురిసింది. గురువారం తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు ఏకధాటిగా వర్షం కురిసింది.

జోగుళాంబ గద్వాల జిల్లా, కొల్లాపూర్‌లో భారీ వర్షం
ఉప్పొంగిన బొంకూరు పెద్దవాగు
పాలమూరులో ఉదయం నుంచి ముసురు
గద్వాల, జూలై 9 (ఆంధ్రజ్యోతి)/కొల్లాపూర్/అయిజ/నారాయణపేట/మహబూబ్‌నగర్ : జోగుళాంబ గద్వాల జిల్లాలో భారీ వర్షం కురిసింది. గురువారం తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు ఏకధాటిగా వర్షం కురిసింది. దీంతో ఉండవల్లి మండలం బొంకూరు గ్రామం వద పెద్దవాగు ఉప్పొంగడంతో, నిర్మాణంలో ఉన్న వంతెన కొద్దిపాటిగా తెగిపోయింది. మానవపాడులో అత్యధికంగా 86.8 మి.మీ, ఉండవల్లిలో 62.0 మి.మీ., అలంపూర్‌లో 59.4 మి.మీ., అయిజలో 44.3 మి.మీ., కేటీదోడ్డిలో 0.5 మి.మీ., ధరూర్‌లో 5.1 మి.మీ., గద్వాలలో 1.4 మి.మీ., ఇటిక్యాలలో 14.8 మి.మీ., మల్దకల్లో 12.4 మి.మీ., గట్టులో 28.9 మి.మీ., రాజోలీలో 36.5 మి.మీ., వడ్డెపల్లిలో 23.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా, ఉండవల్లిలో అరుదుగా కనిపించే పచ్చ కప్పలు దర్శనమిచ్చాయి.
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో ఉదయం ఎనిమిది గంటల నుండి 11 గంటల వరకు భారీ వర్షం కురవగా, దాదాపు 47.2 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. దీంతో కలువలు, కుంటలు, చెరువుల్లోకి నీరు చేరింది.
నారాయణపేట జిల్లా వ్యాప్తంగా బుధవారం రాత్రి ఓ మోస్తారు వర్షం కురిసింది. అత్యధికంగా దామరగిద్ద మండలంలో 20.4 మి.మీ., అత్యల్పంగా ధన్వాడలో 1.8 మి.మీ,. వర్షపాతం నమోదైంది. నారాయణపేటలో 2.4 మీ.మీ., మరికల్లో 16.8 మీ.మీ., నర్వలో 5.2 మీ.మీ., మక్తల్‌లో 14.0 మీ.మీ., మాగనూర్‌లో 15.0 మీ.మీ., మద్దూర్‌లో 9.4 మీ.మీ. వర్షం కురిసింది.
పాలమూరు జిల్లాలో గురువారం రోజంతా ముసురు కురిసింది. ఉదయం నుంచే వాతావరణం మేఘావృతమైంది. మధ్యాహ్నం వరకు ముసురుకురిసినా ఆ తరువాత ఎండ వెలిసి, తిరిగి సాయంత్రం మళ్లీ చిరుజల్లులు కురిశాయి.
ఆల్మట్టికి పెరుగుతున్న వరద
కర్ణాటకలోని ఆల్మట్టికి భారీగా వరద వస్తోంది. తాజాగా గురువారం ప్రాజెక్టులోకి 49,636 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ప్రాజెక్టు 129.72 టీఎంసీల సామర్థ్యానికి గాను, ప్రస్తుతం 82.53 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. నారాయణపూర్‌కు 10,105 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, ప్రాజెక్టులో 37.64 టీఎంసీలకు గాను 25.8 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. అలాగే జూరాల ప్రాజెక్టు సామర్థ్యం 9.66 టీఎంసీలకు గాను ప్రస్తుతం 7.8 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ఈ ప్రాజెక్టుకు 2,577 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది.