గాలికుంటు టీకాలు తప్పనిసరి

ABN , First Publish Date - 2020-03-19T06:40:15+05:30 IST

పశువులకు సోకే గాలికుంటు వ్యాధులకు టీకాలు తప్పనిసరిగా ఇప్పించాలని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ ముఖ్య కార్యదర్శి అనితా రాజేంద్ర అధికారులను ఆదేశించారు.

గాలికుంటు టీకాలు తప్పనిసరి

నాగర్‌కర్నూల్‌ కలెక్టరేట్‌, మార్చి 18 : పశువులకు సోకే గాలికుంటు వ్యాధులకు టీకాలు తప్పనిసరిగా ఇప్పించాలని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ ముఖ్య కార్యదర్శి అనితా రాజేంద్ర  అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర పశుసంవర్ధకశాఖ డైరెక్టర్‌ లక్ష్మారెడ్డితో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఉన్న పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వందశాతం పూర్తి చేయాలని ఆదేశించారు. పశువులకు గాలికుంటు వ్యాధి సోకితే పాల ఉత్పత్తి తగ్గిపోతుందని, దాన్ని నివారించేందుకు రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు. ముందుగా పాడి రైతులకు టీకాలు పూర్తైన తర్వాత ఇతర పశువులకు టీకాలు వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో పశుగ్రాసం, తాగునీటి వసతి కల్పించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. కృషి కల్యాణ్‌ యోజన ద్వారా కృత్రిమ గర్భదారణ కార్యక్రమాన్ని వేగమంతం చేయాలన్నారు. కరోనా వస్తుందనే వదంతులను నివారించి ప్రజల్లో అవగాహన కల్పించి కోళ్ల పరిశ్రమను కాపాడాల్పిన బాధ్యత అధికారులపై ఉందని గుర్తు చేశారు. జిల్లాలో 2,40,000 పశువులకు గానూ 80,000 పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేసే కార్యక్రమం పూర్తి చేస్తామని, మిగతా పశువులకు ఈ నెలాఖరు వరకు పూర్తి చేస్తామని జిల్లా పశువైద్యాధికారి అంజిలప్ప వివరించారు. కార్యక్రమంలో పశు సంవర్ధకశాఖ జిల్లా సహాయ సంచాలకులు డాక్టర్‌ వెంకటేశ్వర్లు, డాక్టర్‌ శ్రీనివాసరావు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-19T06:40:15+05:30 IST