ధాన్యం.. ధైన్యం

ABN , First Publish Date - 2020-05-11T10:51:37+05:30 IST

వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

ధాన్యం.. ధైన్యం

 కొనుగోలు కేంద్రాలకు భారీగా వస్తున్న ధాన్యం

గన్నీ బ్యాగులు, లోడింగ్‌ సమస్యలతో సతమతం

వాతావరణంలో మార్పులు వస్తుండటంతో ఆందోళనలో రైతాంగం


గద్వాల రూరల్‌, మే 10  : వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా హమాలీల కొరతతో అన్‌లోడింగ్‌ చేయక ఎక్కడి ధాన్యం అక్కడే ఉండిపోగా, రవాణా సౌకర్యం లేకపోవడంతో అన్‌లోడింగ్‌ చేయడానికి వెళ్లిన లారీలు, తిరిగి రావడానికి రెండు, మూడు రోజుల సమయం పడుతున్నది. గన్నీబ్యాగుల సమస్య కూడా వేధిస్తుండటంతో, వర్షం వస్తే పరిస్థితి ఏంటనే ప్రశ్న తలెత్తుతున్నది.

జోగుళాంబ గద్వాల జిల్లాలో 42,290 ఎకరాలలో వరి సాగు అయ్యింది. దాదాపు 10.14 లక్షల క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది.


ఇందుకు అనుగుణంగా జిల్లాలో 56 కేంద్రాలను ఏర్పాటు చేయగా, 41 కేంద్రాలలో ధాన్యం కొనుగోళ్లు ఏప్రిల్‌ 11వ తేదీ నుంచి ప్రారంభంమయ్యాయి. ఇప్పటి వరకు జిల్లా అంతటా 91,900 క్వింటాళ్ల ధాన్యం మాత్రమే కొనుగోలు చేయగా, ఇందులో 72,145 క్వింటాళ్లు రైస్‌మిల్లులకు చేరగా, ఐకేపీ, పీఏసీయస్‌ కేంద్రాల వద్ద  ఇంకా 19,754 క్వింటాళ్లు రవాణా కావాల్సి ఉన్నది. వారం రోజుల కిందట వచ్చిన రైతుల ధాన్యం కూడా నేటి వరకు తూకం కాకపోగా, ఒక్కసారిగా వస్తున్న ధాన్యాన్ని ఎప్పుడు కొంటారో కూడా తెలియని పరిస్థితి నెలకొన్నది. దీనికితోడు ఉన్నట్లుండి వాతావరణం చల్లబడుతుండటం, ఆకాశం మబ్బులు కమ్ముకోవడంతో పాటు ఉరుములు, మెరుపులు వస్తుండటంతో రైతు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. 


గన్నీ బ్యాగుల సమస్య

10.14 లక్షల క్వింటాళ్లకు దాదాపు 21 లక్షల గన్నీబ్యాగులు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారు. ప్రారంభంలో నాలుగు లక్షల గన్నీబ్యాగులు మాత్రమే ఉన్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా ఇతర రాష్ర్టాల నుంచి రవాణా నిలిచిపోవడంతో అతికష్టం మీద హర్యాన నుంచి 5.50 లక్షల గన్నీబ్యాగులు తెప్పించారు. దాదాపు ఈ బ్యాగులు చిరిగిపోయి, చీకిపోయి ఉండటంతో హమాలీలు వీటిని పక్కన పడేస్తున్నారు. దీని కారణంగా గన్నీబ్యాగులు సమస్య ఏర్పడింది. ఒకవేల అందులో ధాన్యం నింపినా, రవాణాలో కారిపోతుండటంతో క్యాంటిటీలో తరుగు వస్తున్నది. ఇవికాక మరో 11 లక్షల గన్నీబ్యాగులు అవసరం ఉంది. ఇవి ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ఉంది.


పోయిన లారీ వచ్చేది కష్టం

కొనుగోలు కేంద్రాల నుంచి రైస్‌మిల్లులకు పోయిన లారీ తిరిగి వచ్చేది కష్టంగా మారింది. బాయిలర్‌ రైస్‌ మిల్లులు రెండే ఉండటంతో 41 సెంటర్ల నుంచి పోయిన లారీలను అన్‌లోడింగ్‌ చేయడానికి కావల్సినంత లేబర్‌ మిల్లుల దగ్గర లేదు. లాక్‌డౌన్‌ కారణంగా హమాలీల కొరత కూడా ఉంది. కొనుగోలు కేంద్రం నుంచి పోయిన లారీ రెండు రోజుల తర్వాత వస్తుందని, అప్పటి వరకు ఏమిచేయాలని నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు. వర్షం వస్తే కప్పడానికి టార్పాలిన్లు కూడా అందుబాటులో లేవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-05-11T10:51:37+05:30 IST