కొను‘గోల’ కేంద్రాలు

ABN , First Publish Date - 2020-11-26T03:53:56+05:30 IST

ప్రభుత్వ పాఠశాలలు ధాన్యం కొనుగోలు కేంద్రాలుగా మారాయి.

కొను‘గోల’ కేంద్రాలు
గండీడ్‌ మండలం గాధిర్యాల్‌ పాఠశాల ఆవరణలో ఉంచిన ధాన్యం బస్తాలు

పాఠశాలల్లో వరి ధాన్యం కొనుగోలు

వసతులు లేని చోట మాత్రమే వాడుకోమన్న విద్యాశాఖ

అదీ ఒకటి రెడు గదులనే..

పాఠశాల మొత్తం వాడుకుంటున్న వ్యవసాయశాఖ

దుమ్మూ దూళితో ఇబ్బందులు పడుతున్న ఉపాధ్యాయులు


మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం, నవంబరు 25: ప్రభుత్వ పాఠశాలలు ధాన్యం కొనుగోలు కేంద్రాలుగా మారాయి. విద్యార్థులు ఉండాల్సిన గదుల్లో ధాన్యం బస్తాలు దర్శనమిస్తున్నాయి. కరోనా నేపథ్యంలో తరగతులు ప్రారంభం కాకపోడంతో గదులన్నీ ఖాళీగా ఉంటున్నాయి. ఉపాధ్యాయులు మాత్రం వెళ్లి వస్తున్నారు. వారు కూడా ఆఫీస్‌ గదులకే పరిమితం అయ్యారు. దాంతో వ్యవసాయ శాఖ అధికారులు పాఠశాలలను వరి కొనుగోలు కేంద్రాలుగా మార్చారు. చాలాచోట్ల అనుమతి కూడా తీసుకోకుండా స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులతో మాట్లాడి ధాన్యం కొనుగోలు  కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలోని 16 మండలాల్లో గల 50 శాతం స్కూళ్లను ధాన్యం కొనుగోలు కేంద్రాలుగా మార్చారు. గదులన్నీ ధాన్యం బస్తాలతో నిండిపోయాయి. పాఠశాలల ఆవరణ అంతా దుమ్మూ దూళితో నిండింది. దాంతో బడికి రోజు విడిచి రోజు వెళ్తున్న ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దుమ్మూ, దూళితో అవస్థలు పడుతున్నామని అంటున్నారు.

కొనుగోలు కేంద్రాల ఏర్పాటు సరికాదు

ప్రభుత్వ పాఠశాలల్లో వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం సరికాదని ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలకు వెళ్తే దుమ్మూ దూళితో ఇబ్బందులు పడుతున్నామని ఉపాధ్యాయులు వాపోతున్నారు. విద్యాశాఖ అఽధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాలను తీయించాలని కోరుతున్నారు. 


ఉపాధ్యాయులకు ఇబ్బంది కల్గించొద్దు

ఎలాంటి వసతి లేని గ్రామాల్లో, అవసరం ఉన్న చోట మాత్రమే ఒకటి, రెండు పాఠశాలల గదులను వాడుకోవాలని చెప్పాం. పాఠశాల ఆవరణ అంతా వాడుకోవద్దు. పనిచేసే ఉపాధ్యాయులకు ఇబ్బందులు కల్గించొద్దు. డిసెంబరు ఒకటి నుంచి పాఠశాలలు ప్రారంభమైతే అప్పటిలోపు అన్నీ ఖాళీ చెయ్యాల్సి ఉంటుంది.

- ఉషారాణి, డీఈవో 

Updated Date - 2020-11-26T03:53:56+05:30 IST