మాజీ ఎమ్మెల్యే కటికనేని మధుసూదన్‌రావు హఠాన్మరణం

ABN , First Publish Date - 2020-12-16T03:56:48+05:30 IST

బడుగు బలహీన వర్గాల నేతగా గుర్తింపు ఉన్న కొల్లాపూర్‌ మాజీ ఎమ్మెల్యే కటికనేని మధుసూదన్‌రావు(70) మంగళవారం గుండెపోటుతో మరణించారు.

మాజీ ఎమ్మెల్యే కటికనేని మధుసూదన్‌రావు హఠాన్మరణం
మధుసూదన్‌రావు(ఫైల్‌)

హైదరాబాద్‌లో గుండెపోటుతో మృతి


కొల్లాపూర్‌, డిసెంబరు 15: బడుగు బలహీన వర్గాల నేతగా గుర్తింపు ఉన్న కొల్లాపూర్‌ మాజీ ఎమ్మెల్యే కటికనేని మధుసూదన్‌రావు(70) మంగళవారం గుండెపోటుతో మరణించారు. హైదరాబాద్‌లోని ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న ఆయన ఉదయం కాలు జారి కిందపడ్డారు. అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లగా, పరిస్థితి విషవించడంతో మధ్యాహ్నం మృతి చెందారు. ఆయన మరణ వార్త విన్న కొల్లాపూర్‌ నియోజకవర్గ ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు.


1994లో కొల్లాపూర్‌ ఎమ్మెల్యేగా ఎన్నిక

 కొల్లాపూర్‌ మండలం నార్లపూర్‌ గ్రామంలో 1950లో మధుసూదన్‌రావు జన్మించారు. చిన్ననాటి నుంచే బలహీన వర్గాల ప్రజలకు అండగా ఉంటూ, తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1994లో టీడీపీ నుంచి కొల్లాపూర్‌ ఎమ్మెల్యేగా పోటీ చేసి, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి రాంచందర్‌రావుపై 33వేల ఓట్ల మెజార్టీతో గెలుపొంది, రికార్డు సృష్టించారు. 1999లో కాంగ్రెస్‌ అభ్యర్థి, తనకు వరుసకు బావమరిది అయిన జూపల్లి కృష్ణారావుపై టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి, 5 వేల ఓట్లతో ఓటమి చెందారు. 2004లోనూ టీడీపీ నుంచి పోటీ చేయగా, విమానం గుర్తుపై ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా బరిలో ఉన్న జూపల్లిపై 3 వేల ఓట్లతో ఓటమి చెందారు. 2009లో టీడీపీ నుంచి టికెట్‌ దక్కక పోవడంతో ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2014లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయగా, 5 వేల ఓట్లు వచ్చాయి. నాటి నుంచి హైదరాబాద్‌లోనే నివాసం ఉంటున్నారు. గడిచిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. గడిచిన ఎన్నికల్లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు మద్దతుగా పార్టీ గెలుపు కోసం ప్రచారం చేశారు. కటికనేని మరణ వార్త విన్న కొల్లాపూర్‌ నియోజకవర్గంలోని అభిమానులు కన్నీటిపర్యంతమయ్యారు. మధుసూదన్‌రావుకు భార్య రూపకళ, కుమార్తె అశ్విత, కుమారుడు అభిషేక్‌ ఉన్నారు. 


దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన నాయకులు

మధుసూదన్‌రావు మృతిపై పార్టీల నాయకులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన అకాల మృతి బాధాకరమని, మంచి నాయకుడిని కోల్పోయామని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. బావను కోల్పోవడం బాధగా ఉందని జూపల్లి కృష్ణారావు చెప్పారు. రాజకీయ గురువును కోల్పోయానని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సుధాకర్‌ అన్నారు. వీరితో పాటు టీడీపీ కొల్లాపూర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి డా.పగిడాల శ్రీనివాస్‌రెడ్డి భౌతిక కాయానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ సంతాపం తెలిపారు.


ఘన నివాళి

టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో స్థానిక ఎన్‌టీఆర్‌ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి, నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నరేందర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్‌ పెబ్బేటి కృష్ణయ్య, నాయకులు భీంశెట్టి రాము, ఖాదర్‌పాషా, రాఘవేందర్‌, వాసు, మూలే కేశవులు, నర్సింహా, సుదర్శన్‌గౌడ్‌, మోహన్‌రెడ్డి, గౌస్‌, దుర్గాప్రసాద్‌, కట్ట శ్రీనివాసులు, సురేందర్‌రావు, సుధాకర్‌, సుదర్శన్‌శెట్టి, కమలాకర్‌రావు, అహ్మద్‌ఘోరీ, కేశవ శెట్టి పాల్గొన్నారు.


నేడు నార్లాపూర్‌లో అంత్యక్రియలు

మధుసూదన్‌రావు అంత్యక్రియలను బుధవారం స్వగ్రామం కొల్లాపూర్‌ మండలం నార్లాపూర్‌లో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పార్థివదేహాన్ని హైదరాబాద్‌ నుంచి తీసుకొచ్చి, ఉదయం 8 గంటలకు పెద్దకొత్తపల్లి నుంచి కొల్లాపూర్‌ వరకు డీసీఎంలో ఊరేగిస్తారు. 10 గంటల నుంచి కొల్లాపూర్‌ పట్టణంలోని మినీ స్టేడియం ఆవరణలో సందర్శనార్థం ఉంచుతారు. ఆ తర్వాత నార్లాపూర్‌లో అంత్యక్రియలు నిర్వహిస్తారన్నారు.

Updated Date - 2020-12-16T03:56:48+05:30 IST