కేసీర్‌ పాలనలో మంత్రులు డమ్మీలు

ABN , First Publish Date - 2020-12-21T04:29:37+05:30 IST

కేసీర్‌ పాలనలో మంత్రులు డమ్మీలుగా తయారై, రబ్బరు స్టాంపులుగా మారారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు.

కేసీర్‌ పాలనలో మంత్రులు డమ్మీలు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

సీఎం ఢిల్లీకి ఎందుకు వెళ్లాడో సమాధానం ఇవ్వాలి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్‌


నారాయణపేట టౌన్‌/నారాయణపేట క్రైం, డిసెంబరు 20: కేసీర్‌ పాలనలో మంత్రులు డమ్మీలుగా తయారై, రబ్బరు స్టాంపులుగా మారారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్లి, పొర్లుడు దండాలు పె ట్టినా క్షమించే ప్రసక్తే లేదని చెప్పారు. ఆదివారం నారాయణపేట జిల్లా కేంద్రం లోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో కేంద్ర వ్యవసాయ చట్టాలపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు పగడాకుల శ్రీనివాస్‌ అధ్యక్షతన రైతులకు అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. బండి సంజయ్‌, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ బీసీ కమి షన్‌ సభ్యులు టి.ఆచారి, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, రాష్ట్ర కోశాధికారి శాంతకు మార్‌, రాష్ట్ర నాయకులు నాగురావు నామాజీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీని ఓటర్లు గాలిలో కలిపారన్నారు. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు చూసి టీఆర్‌ఎస్‌ బాక్సులు బద్ధలయ్యాయని పేర్కొన్నారు. ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్‌ ఢిల్లీలో రైతులు చేపడుతున్న ఆందోళన వద్దకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. సన్న వడ్లు పండిస్తే మద్దతు ధర ఇస్తామని చెప్పిన సీఎం తన ఫాం హౌస్‌లో దొడ్డు రకం వడ్లను ఎందుకు పండించారో తెలంగాణ రైతులు తెలుసుకోవాలన్నారు. తన నోటి నుంచి అబద్ధం మాట్లాడితే మెడమీద తలకాయ లేనట్టని చెప్పిన కేసీఆర్‌ నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం, దళితులకు స్థలం ఇవ్వలేదన్నారు. అబద్దాలు మాట్లాడిన కేసీఆర్‌ మెడపై తలకాయ లేనట్టేనని, తలకాయ లేని ముఖ్యమంత్రి ఈ రాష్ర్టానికి అవసరమా? అని ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ పార్టీలు దొందు దొందేనన్నారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులకు ఎంతో మేలు చేస్తాయన్నారు.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు.


అబద్దాల కోరు

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అబద్ధాలు మాట్లాడటంలో, ప్రజలను మోసం చేయడంలో దేశంలోనే నెంబర్‌ వన్‌ అని అన్నారు. మాయల మరాఠీ, జూటకోర్‌ అని, ఆయన నోరు పాపి నోరు అని చెప్పారు. వలసలు ఆగాలంటే బీజేపీ ప్రభుత్వ మే అధికారంలోకి రావాలన్నారు.


ధర్మ పాలన రావాలి

మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 12 లక్షల ఎకరాలకు నీరు అందిస్తామన్న టీఆర్‌ఎస్‌ పార్టీ ఇచ్చిన హామీ ఎక్కడ ఉందో ప్రజలు గుర్తించాలన్నారు. కేసీఆర్‌ తన ఫాం హౌంలో వేసిన పంటను దుబాయ్‌లో అమ్ముకుంటున్నారని, నారాయణపేట ఎమ్మెల్యే తన వ్యాపారాలను కర్ణాటక, ఇతర రాష్ర్టాల్లో కొనసాగిస్తుంటే రైతులు పక్క రాష్ట్రంలో తమ పంటను అమ్ముకుంటే తప్పేంటన్నారు.


బీజేపీ పాలనను కోరుకుంటున్నారు

జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు టి.ఆచారి మాట్లాడుతూ కేంద్రం తెచ్చిన చట్టాల గురించి పశువుల కాడికి వెళ్లే వాడికి తెలుసని, కానీ టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు తెలియదని అన్నారు. సదస్సులో మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులు హనీఫ్‌అలీ, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు రతంగ్‌ పాండురెడ్డి, కొండయ్య, జలందర్‌రెడ్డి, శ్రీవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2020-12-21T04:29:37+05:30 IST