-
-
Home » Telangana » Mahbubnagar » karporate shakthulaku
-
కార్పొరేట్ శక్తులకు ఆహార ఉత్పత్తులు
ABN , First Publish Date - 2020-12-11T03:27:24+05:30 IST
కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ఆహార ఉత్పత్తులను ఉచితంగా ఇవ్వాలని చూస్తోందని ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీని వాస్‌గౌడ్ ఆరోపించారు.

కేంద్రం ఉచితంగా ఇవ్వాలని చూస్తోంది: మంత్రి శ్రీనివాస్‌గౌడ్
ఘనంగా మహబూబ్‌నగర్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం
పాలమూరు, డిసెంబరు 10: కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ఆహార ఉత్పత్తులను ఉచితంగా ఇవ్వాలని చూస్తోందని ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీని వాస్‌గౌడ్ ఆరోపించారు. గురువారం మహబూబ్‌నగర్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, మునిసిపల్ చైర్మన్ కోరమోని నరసింహులుతో కలిసి హాజరయ్యారు. డీఎంవో బాలమణి మార్కెట్ కమిటీతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ చైర్మన్ సి.అమరేందర్‌రాజు కుటుంబంతో 35 ఏళ్ల నుంచి అనుబంధం ఉందన్నారు. వ్యవసాయ అనుబంధ కులాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందనేందుకు ఈ పాలక వర్గమే నిదర్శనమని తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తుల విలువ పెంపునకు పని చేయాలని, దానికోసం ఇప్పటికే రూ.ఆరు కోట్ల నిధులు ఉన్నాయని చెప్పారు. జిల్లాకు తొందరలోనే విమానాశ్రయం వస్తుందన్నారు. ఐటీ పార్కు, శిల్పారామంలను కేసీఆర్, కేటీఆర్‌లతో ప్రారంభిస్తామన్నారు. ఏడాదిలో అప్పన్నపల్లి బ్రిడ్జిని పూర్తి చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చి రైతాంగం దివాళా తీసేందుకు కుట్ర పన్నుతోందన్నారు. ఆ బిల్లును తక్షణమే రద్దు చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. ఈ చట్టాల వల్ల విద్యుత్ ప్రైవేటీకరణతో రైతులకు 24 గంటలపాటు ఇచ్చే ఉచిత విద్యుత్‌కు అంతరాయం ఏర్పడుతుందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటోందని అనంతరం ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి మాట్లాడారు.
ప్రమాణం చేసిన కమిటీ
మహబూబ్‌నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా సి.అమరేందర్‌రాజు, వైస్ చైర్మన్‌గా జె.తిరుపతిరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. వారితో పాటు డైరెక్టర్లుగా పత్తి వెంకట్రాములు, నరేందర్, డీకే క్రిష్ణయ్య, సి.చంద్రశేఖర్, బి.చెన్నయ్య యాదవ్, కె.రాజునాయక్, వై.శ్రీదేవి, జి.సాయి ప్రమాణం స్వీకారం చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, డీసీసీబీ వైస్ చైర్మన్ కోరమోని వెంకటయ్య, మునిసిపల్ వైస్ చైర్మన్ తాటి గణేష్, మాజీ చైర్‌పర్సన్ రాధాఅమర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు సి.రాజేశ్వర్, కె.ఆంజనేయులు, కౌన్సిలర్లు, రైతులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.