లెవీ.. ఏవీ!
ABN , First Publish Date - 2020-10-04T09:16:53+05:30 IST
లెవీ కింద పెట్టాల్సిన బియ్యం కోసం కొందరు రైస్ మిల్లర్లు తటపటాయిస్తున్నారు. కస్టమ్ మిల్లింగ్ కింద తీసుకున్న వడ్లను
ఐకేపీ ద్వారా తీసుకున్న ధాన్యాన్ని అమ్ముకున్న మిల్లర్లు
ప్రభుత్వానికి బియం్య ఇవ్వాల్సిందిగా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు
తమిళనాడు, ఉత్తర తెలంగాణ నుంచి బియ్యాన్ని దిగుమతి చేసుకున్న ఘనులు
లెవీగా అనుమతించడానికి కొందరు అధికారులకు ముడుపులు
గద్వాల, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి) : లెవీ కింద పెట్టాల్సిన బియ్యం కోసం కొందరు రైస్ మిల్లర్లు తటపటాయిస్తున్నారు. కస్టమ్ మిల్లింగ్ కింద తీసుకున్న వడ్లను ముందుగానే ఇతరులకు అమ్ముకోవడంతో, ప్రభుత్వానికి పెట్టాల్సిన బియ్యం కోసం ఇతర రాష్ర్టాలకు పరుగులు తీస్తున్నారు. తమిళనాడు, ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లోని మిల్లుల నుంచి బాయిల్ల్ రైస్‌ను తెప్పించుకొని వాటినే లెవీగా మారుస్తున్నారు.
కస్టమ్ మిల్లింగ్ కింద రైస్ మిల్లర్లు ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా తీసుకున్న వడ్లను బియ్యంగా మార్చి ప్రభుత్వానికి లెవీ రూపంలో ఇవ్వాలి. కానీ, ఈ వడ్లను మిల్లర్లు ముందస్తుగా మిర్యాలగూడ, సూర్యపేట, కర్నూల్ ప్రాంతాల్లోని మిల్లర్లకు అమ్మకాలు జరిపి సొమ్ము చేసుకున్నారు. అయితే, కస్టమ్ మిల్లింగ్ కింద మిల్లర్లు పెట్టాల్సిన బియ్యం పెట్టకపోవడంతో రాష్ట్ర సీఎస్ నుంచి కలెక్టర్ వరకు సివిల్ సఫ్లయ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారు లెవీ బియ్యం పెట్టాలని మిల్లర్లపై ఒత్తిళ్లు తీసుకొచ్చారు. దీంతో వారు బాయిల్డ్ రైస్ కోసం తమిళనాడు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని రైస్ మిల్లులోని బియ్యాన్ని కొనుగోలు చేశారు. ఆ బియ్యాన్ని లెవీ కింది అనుమతించడానికి సివిల్ సఫ్లయ్, రెవెన్యూ అధికారులకు భారీగా మూడుపులు చెల్లిస్తున్నట్లు తెలిసింది.
జోగుళాంబ గద్వాల జిల్లాలో రబీలో పది లక్షల క్వింటాళ్ల వరి ధాన్యం దిగుబడి వచ్చిందని వ్యవసాయ శాఖ నివేదిక ఇచ్చింది. జిల్లాలోని 56 ఐకేపీ కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన వడ్లను తీసుకున్న మిల్లర్లు లేవీ కింద 1,25,050 క్వింటాళ్ల బాయిల్డ్ రైస్‌ను పెట్టాలి. కానీ, ఇప్పటి వరకు కేవలం 11,052 క్వింటాళ్లను మాత్రమే లెవీ కింద పెట్టారు. రా రైస్ కిందా 50,490 క్వింటాళ్ల బియ్యం పెట్టాల్సి ఉండగా, కేవలం 391 క్వింటాళ్లు మాత్రమే పెట్టారు. జిల్లాలో ఉన్న మిల్లుల్లో రోజుకు 1,740 క్వింటాళ్ల వడ్డను బియ్యంగా మార్పే అవకాశం ఉంది. కానీ, మిల్లర్లు ఎందుకు లెవీ బియ్యాన్ని పెట్టడంలో ఆలస్యం చేస్తున్నారనే విషయం మిలియన్ డాల్లర్ల ప్రశ్నగా మిగిలింది.
తమిళనాడు నుంచి దిగుమతి
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని చాలా మంది రైస్ మిల్లర్లు కస్టమ్ మిల్లింగ్ కింద తీసుకున్న వడ్లను అమ్ముకున్నారు. తమిళనాడులో తక్కువ ధరకు దొరికే బాయిల్డ్ రైస్‌ను రోజు పది నుంచి 20 లారీల్లో దిగుమతి చేసుకొని, లెవీగా మారుస్తున్నారు. మరికొందరు ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల నుంచి, కర్ణాటక రాష్ట్ర రాయచూర్ నుంచి బాయిల్డ్ రైస్‌ను దిగుమతి చేసుకుంటున్నారు. రా రైస్ పెట్టాల్సిన మిల్లర్లు రేషన్ బియ్యాన్ని తీసుకొని రీసైక్లింగ్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల మిల్లర్లకు క్వింటాల్‌పై దాదాపు రూ.3 వేల గిట్టుబాటు అవుతుంది. అలాగే వడ్లను బియ్యంగా మార్చినందుకు మరికొంత సొమ్ముతోపాటు, కరెంటు ఆదా అవుతుంది.