అల్ప‘పీడ’నం

ABN , First Publish Date - 2020-09-16T06:27:02+05:30 IST

అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా వ్యాప్తంగా సోమ, మంగళవారాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి

అల్ప‘పీడ’నం

మూడు రోజులుగా ముంచెత్తుతున్న వానలు

ఉధృతంగా పారుతున్న వాగులు, వంకలు

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కొన్ని గ్రామాలకు నిలిచిన రాకపోకలు

దెబ్బతింటున్న పత్తి పంటలు

నిండు కుండను తలపిస్తున్న జలాశయాలు

దిగువకు నీటిని విడుదల చేస్తున్న అధికారులు

ఉమామహేశ్వరంలో ఆకట్టుకుంటున్న జలపాతాలు


పొద్దస్తమానం ముసురు ముసుగేస్తుంటే, రాత్రి అయితే మాత్రం భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి.. గడిచిన మూడు రోజులుగా ఉమ్మడి పాలమూరు జిల్లా అంతటా ఇదే పరిస్థితి నెలకొన్నది.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప‘పీడ’న ప్రభావంతో శనివారం నుంచి వానలు పడుతూనే ఉండగా, మంగళవారం కూడా వర్షాలు ముంచెత్తాయి.. చెరువులు అలుగు పారుతుంటే, జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.. పలు చోట్ల కుంటలు తెగిపోతుండటంతో పంటలు నీట మునిగిపోతున్నాయి.. లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి.. వాగులు ఉగ్రరూపం దాల్చుతుండటంతో పలు గ్రామాలకు రాకపోకలకు నిలిచిపోయాయి..


(నాగర్‌కర్నూల్‌-ఆంధ్రజ్యోతి)/నారాయణపేట/కోడేరు/వనపర్తి (కలెక్టరేట్‌)/కోడేరు/కొల్లాపూర్‌ రూరల్‌/పెంట్లవెల్లి/అచ్చంపేట, సెప్టెంబరు 15 : అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా వ్యాప్తంగా సోమ, మంగళవారాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. వనపర్తి జిల్లా వ్యాప్తంగా వానలు కురుస్తున్నాయి. సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు ఆయా మండలాల్లో భారీ వర్షపాతం నమోదయింది. వీపనగండ్ల మండలంలో అత్యధికంగా 68.8 మిల్లీమీటర్లు, చిన్నంబావిలో 59.2, రేవల్లిలో 51.3, పాన్‌గల్‌లో 49.8, ఘనపురంలో 42.3, పెద్దమందడిలో 40.8, వనపర్తిలో 37.5, మదనాపురంలో 34.0, గోపాల్‌పేటలో 25.2, కొత్తకోటలో 25.0, ఆత్మకూరులో 23.0, అమరచింత మండలంలో 13.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.


నారాయణపేట జిల్లా వ్యాప్తంగా సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఓ మోస్తరు వర్షం కురిసింది. మండలాల వారీగా అత్యధికంగా ధన్వాడ మండలంలో 69.8 మిల్లీమీటర్ల, అత్యల్పంగా కృష్ణాలో 13.5, నారాయణపేటలో 64.0, దామరగిద్దలో 54.8, మరికల్‌లో 62.5, మక్తల్‌లో 28.0, నర్వలో 29.0, మద్దూర్‌లో 50.0, కోస్గిలో 63.0, మాగనూర్‌లో 34.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.


నాగర్‌కర్నూల్‌ జిల్లాలో వాగులు, వంకలు పొంగాయి. వరి, పత్తి పంటలకు నష్టం వాటిల్లింది. కోడేరు, పస్పుల మధ్య వాగు పొంగడంతో ట్రాక్టర్‌ వరదలో కొట్టుకుపోయింది. కొల్లాపూర్‌లోని 12వ వార్డులో వరద నీరు ఇళ్లలోకి చేరింది. పెద్దకొత్తపల్లి మండలం దేవినేనిపల్లిడండా సమీపంలో కుంట తెగిపోవడంతో వరి పంటకు నష్టం వాటిల్లింది. ఉమామహేశ్వరం క్షేత్రంలో జలపాతం కొత్త కళను సంతరించుకుంది. చంద్రవాగు వద్ద వరద ప్రవాహం మంగళవారం కూడా కొనసాగింది. ఎత్తం సమీపంలో కేఎల్‌ఐ సబ్‌ కాల్వలు తెగిపోయి పొలాలు నీట మునిగాయి. ఎన్మన్‌బెట్ల గ్రామంలో ఒక ఇళ్లు కూలిపోయింది. పెంట్లవెల్లి-మంచాలకట్ట గ్రామాల మధ్య వాగు పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. నార్లాపూర్‌, ముక్కిడిగుండం గ్రామాల మధ్య పెద్దవాగు ఉధృతంగా పారడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కొల్లాపూర్‌లోని వరిదేల చెరువు తూములు మూసి ఉండటంతో కాలనీలోకి నీరు చేరాయి. 

Updated Date - 2020-09-16T06:27:02+05:30 IST