జైహింద్‌..ఘనంగా 74వ స్వాతంత్య్ర వేడుకలు

ABN , First Publish Date - 2020-08-16T10:37:54+05:30 IST

74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరిగాయి. కరోనా నేపథ్యంలో ఎలాంటి ఆర్భాటం లేకుండా

జైహింద్‌..ఘనంగా 74వ స్వాతంత్య్ర వేడుకలు

ప్రభుత్వ కార్యాలయాల్లో రెపరెపలాడిన త్రివరణ పతకాలు

జోరు వానలోనే జెండావిష్కరణ చేసిన అతిథులు

వ్యవసాయానికి పెద్దపీట

వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి

అభివృద్ధి చెందిన జిల్లాగా పాలమూరును తీర్చిదిద్దుతాం

పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌


త్రివర్ణ పతాకం రెపరెపలాడింది.. జోరువానలోనూ జెండా పండుగ సంబురంగా సాగింది.. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా వ్యాప్తంగా ఆయా కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో వేడకలు సాదాసీదాగా జరిగాయి.. కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రమైన నేపథ్యంలో ముందస్తుగానే జెండా వందనానికి పరిమిత సంఖ్యలో హాజరు కావాలని ఆదేశాలుండటంతో, కేవలం ముఖ్య అతిథులు, జిల్లా స్థాయి అధికారులు మాత్రమే కార్యక్రమాల్లో పాల్గొన్నారు.. ఆయా జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ప్రభుత్వ విప్‌లు ముందుగా సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతాకాలను ఆవిష్కరించారు.. అనంతరం ఆయా జిల్లాల అభివృద్ధి అంశాలను చదివి వినిపించారు..


మహబూబ్‌నగర్‌ (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/గద్వాల/నాగర్‌కర్నూల్‌(ఆంధ్రజ్యోతి)/వనపర్తి కలెక్టరేట్‌/నారాయణపేట టౌన్‌, ఆగస్టు 15 : 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరిగాయి. కరోనా నేపథ్యంలో ఎలాంటి ఆర్భాటం లేకుండా వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథులు మాత్రమే కార్యక్రమాలకు హాజరై, భౌతికదూరం పాటిస్తూ జెండా వందనం చేశారు.


వనపర్తిలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేసిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో శనివారం ఆయన జాతీయ జెండాను ఎగుర వేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో ఈ వానాకాలంంలో 69,975 ఎకరాలకు సాగునీరు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు రావడంతో జూరాలలో పూర్తిస్థాయి నీటిమట్టం ఉంచడంతో పాటు విద్యుత్‌ ఉత్పత్తి చేయడం మొదలయిందని, అలాగే కాల్వల ద్వారా నీటిని విడుదల చేశామని ఆయన చెప్పారు.


సకల జనుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌ ఆవరణలో జరిగిన స్వాతంత్య్రదినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, జెండావందనం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మహబూబ్‌నగర్‌ జిల్లాను వంద శాతం అభివృద్ధి చెందిన జిల్లాగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తామన్నారు. రూ.35,200 కోట్లతో చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాలోని కరివెన, ఉదండాపూర్‌ రిజర్వాయర్లు నిర్మాణంలో ఉన్నాయని, ఇవి పూర్తయితే అన్ని ప్రాంతాలకు సాగునీరంది సస్యశ్యామలం అవుతామని ఆయన అన్నారు.


చిన్న జిల్లాలతో తెలంగాణ అభివృద్ధి పథంలో దుసుకెళ్తోందని ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్‌ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి అన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు. అనంతరం ఆయన జిల్లాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను శాఖల వారీగా వివరించారు.


నీటి వనరుల వినియోగంలో సమైక్య పాలనలో వివక్షకు గురైన నాగర్‌కర్నూల్‌ జిల్లాను వ్యవసాయ రంగంలో అగ్రగ్రామిగా నిలిపేందుకు సమిష్టిగా కృషి చేయాల్సిన ఆవశ్యకత, అవసరం ఎంతైనా ఉందని ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నాగర్‌కర్నూల్‌ కలెక్టరేట్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పంద్రాగస్టు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకావిష్కరణ చేశారు. 


నారాయణపేట జిల్లా సర్వతో ముఖాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మండలి డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ అన్నారు. జిల్లా కలెక్టరేట్‌ ఆవరణలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, సాయుద బలగాల నుంచి గౌరవవందనాన్ని స్వీకరించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.


కార్యక్రమాల్లో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్లు ఎస్‌.వెంకట్రావు, యాస్మిన్‌బాషా, శ్రుతిఓఝా, ఎల్‌పీ శర్మన్‌, హరిచందన, ఎమ్మెల్యేలు సి.లక్ష్మారెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్‌, చిట్టెం రాంమోహన్‌రెడ్డి, ఎస్పీలు రెమా రాజేశ్వరి, చేతన, వై.సాయిశేఖర్‌, జడ్పీ చైర్‌పర్సన్లు స్వర్ణాసుధాకర్‌రెడ్డి, వనజ, పద్మావతి, సరిత, లోక్‌నాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-16T10:37:54+05:30 IST