అడిగిన వారికి ఉపాధి కల్పించండి..

ABN , First Publish Date - 2020-05-17T10:23:52+05:30 IST

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంలో అడిగిన వారందరికి పని కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి

అడిగిన వారికి ఉపాధి కల్పించండి..

 జిల్లా అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి


గద్వాల, మే 16 (ఆంధ్రజ్యోతి): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంలో అడిగిన వారందరికి పని కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి అధికారులకు ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్‌ హాలు నుంచి అన్ని మండలాల ఎంపీడీవోలు, ఏపీవోలు, ఎంపీవోలతో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌పై సమీక్ష నిర్వహించారు. కరోనా వల్ల లాక్‌డౌన్‌ ఉన్న ఈ తరుణంలో గ్రామీణ, మండల స్థాయిలోని కూలీలు పని కల్పించాల్సిందిగా ఆశిస్తున్నారని, అలాంటి వారందరిని ఉపాధి హామీలో పని కల్పించాలని ఆదేశించారు.


గట్టు మండలంలో ఉపాధి ఆశిస్తున్న కూలీలసంఖ్య అధికంగా ఉందని, అఽధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లి  పని కల్పించాలన్నారు. గద్వాల, అయిజ వంటి కొన్ని మండలాలలో సైతం పని కల్పించటంలో వెనుకబడి ఉన్నారన్నారు. కింది స్థాయి ఉద్యోగులు ఎవరైనా పనిచేయని పక్షంలో అలాంటివారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలి అన్నారు. అన్ని గ్రామ పంచాయతీలలో శ్మశాన వాటికల నిర్మాణం, తడి పొడి చెత్త షెడ్ల నిర్మాణాలు ఆశించిన స్ధాయిలో పనులు పురోగతిలో కావడం లేదన్నారు.


శ్మశాన వాటికలు 255 గ్రామ పంచాయితీలకు గాను కేవలం 141 గ్రామ పంచాయతీలలో మాత్రమే పనులు ప్రారంభమైనట్లు ఆన్‌లైన్‌లో చూపిస్తున్నాయని, మిగిలిన గ్రామ పంచాయతీలలో సైతం పనులు ప్రారంభమయ్యేటట్లు చూడాలన్నారు. హరితహారంలో నాటిన మొక్కలు 85శాతానికి మించి జీవించి ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. డీఆర్‌డీఏ పీడీ నర్సింహులు, డీపీవో కృష్ణ, సీఈఓ ముసాయిదా బేగం, డీఓ పీఆర్‌ రవీందర్‌ ఉన్నారు.

Updated Date - 2020-05-17T10:23:52+05:30 IST