మామి‘డీలా’ ఆలస్యంగా పూతలు

ABN , First Publish Date - 2020-02-12T11:48:22+05:30 IST

ఈ ఏడాది మామిడి పూతలు ఆశాజనంగా కనిపించడం లేదు. సాధారణంగా డిసెంబరు, జనవరి నెలలోనే మామిడి

మామి‘డీలా’ ఆలస్యంగా పూతలు

  • ఆందోళనలో రైతులు
  • పూతలో కనిపించని పిందె
  • అనుకూలించని వాతావరణ పరిస్థితులు
  • ఆశించిన కొత్తరకం పురుగు
  • కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణం
  • పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి
  •  

వీపనగండ్ల, ఫిబ్రవరి 11: ఈ ఏడాది మామిడి పూతలు ఆశాజనంగా కనిపించడం లేదు. సాధారణంగా డిసెంబరు, జనవరి నెలలోనే మామిడి పూతలు వచ్చి ఫిబ్రవరిలో పిందెలతో చెట్లు కళకళలాడాలి. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల ఫిబ్రవరి నెల గడుస్తున్నా పూతలు పూర్తి స్థాయిలో రాలేదు. వచ్చిన పూతలలో పిందె  కనిపించకపోవడం, కొన్ని చోట్ల పిందె కనిపించినప్పటికీ వాతావరణంలో మార్పుల వల్ల రాలిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆలస్యంగా వచ్చిన పూతలతో ప్రయోజనం ఉండదని, ఎండల తీవ్రత వల్ల పిందె నిలబడదని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. కొన్ని తోటల్లో పూతలు  సకాలంలో  వచ్చినా  చలి తీవ్రతతో హెచ్చు తగ్గులు, చీడ పీడల ప్రభావం బాగా ఉండడంతో పూతలో పిందె కనిపించడం లేదు.  ఏప్రిల్‌, మే మాసంలో పంట కోతకు వస్తుందని, ఆ సమయంలో వచ్చే అధిక గాలులకు నష్టపోయే ప్రమాదం ఉంది. వనపర్తి జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది దిగుబడులు భారీగా తగ్గే అవకాశం లేకపోలేదు. మామిడి తోటలపై పెట్టిన పెట్టుబడి సైతం వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  రాష్ట్రంలోనే అత్యధికంగా వనపర్తి జిల్లాలో మామిడిని ప్రధాన పంటగా రైతులు సాగు చేస్తున్నారు. జిల్లాలో 11,800 ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. ఉమ్మడి వీపనగండ్ల మండలంలో ఐదు వేల ఎకరాల్లో మామిడి సాగవుతోంది.   కౌలు రైతులు తోటలను లీజుకు తీసుకొని సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. 

 నష్టాలో రైతులు

జిల్లాలో గత మూడేళ్లుగా మామిడి దిగుబడి ఆశాజనకంగా లేదు. కౌలు రైతుల పరిస్థితి మరి దారుణంగా మారింది. లక్షల రూపాయలు వెచ్చించి మామిడి తోటలను లీజుకు తీసుకున్న కౌలు రైతులు నష్టాలనే చవిచూస్తున్నారు. జూన్‌ మాసం నుంచి కొమ్మ కటింగ్‌ చేయడం, పాదులు తీయటం, దుక్కులు దున్నటం, ఎరువులు, మందులు పిచికారి వంటి సస్యరక్షణ చర్యలకు వేలాది రూపాయాలు పెట్టుబడి పెడుతున్నారు. తోటల్లో నిరంతరం కష్టపడుతున్నా ఫలితం దక్కడం లేదు. కాపు ఉంటే రేటు లేకపోవడం, రేటు ఉంటే కాపు లేకపోవడం వంటి పరిస్థితులలో మామిడి రైతులు నష్టాలను చవి చూస్తున్నారు. ఈ ఏడాది కూడా వాతావరణం అనుకూలించక పూతలు రాకపోవటం, చీడపీడల బెడద అధికంగా ఉండడంతో పంట దిగుబడి భారీగా తగ్గనున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడి డబ్బులు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదని వారు వాపోతున్నారు. 

 మామిడి తోటలను ఆశించిన కొత్తరకం పురుగు

ఈ ఏడాది మామిడి తోటకు కొత్త రకం పురుగు ఆశించింది. ఈ పురుగు ఆకుపై  పూతలలో పాన్‌ ఆకారంలో కనిపిస్తుంది. కొత్తరకం పురుగు కనిపించటంతో రైతులు ఆందోళన  చెందుతున్నారు. ఇప్పటి వరకు ఉన్న పురుగులను నివారించడం  రైతులకు తలనొప్పిగా మారింది. ఎన్ని మందులు పిచికారి చేసినా పురుగు చావడం లేదని రైతులు వాపోతున్నారు. కొత్త పురుగు మామిడిపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ పురుగును పేరిస్రాగా గుర్తించినట్లు ఉద్యాన శాఖ మండల విస్తరణ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ పురుగు ఈ ఏడాది కొత్తగా కనిపిస్తుందన్నారు. ఈ పురుగు నివారణ కోసం మోనోక్రొటోఫాస్‌ ఒక లీటరు నీటిలో 0.5 ఎంఎల్‌ మందును, డిచోలోరో పాస్‌ ఒక లీటరు నీటిలో ఒక ఎంఎల్‌ మందును కలిపి పిచికారి చేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.


 పురుగు నిర్మూలన తలనొప్పిగా మారింది. 

-  ఆంజనేయులు మామిడి రైతు వెలగొండ

మామిడి తోటలకు ఈ ఏడాది చీడపీడల బెడద అధికంగా ఉంది. వాటిని నివారించేందుకు ఎన్నో రకాల మందులను పిచికారి చేసినా. ఫలితం  కనిపించడం లేదు. నాలుగుసార్లు మందు పిచికారి చేసినా పురుగు కనిపిస్తుంది. ఏమి చేయాలో పాలుపోవడం లేదు. 

Updated Date - 2020-02-12T11:48:22+05:30 IST